గర్భిణి అయిన తన భార్యని కాపాడలేకపోయిందన్న ఆగ్రహంతో ఇరవేయేడేళ్ల మహేష్ అనే ఆటో డ్రైవర్ ఒక డాక్టర్ ని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. యాభై అయిదేళ్ల డా॥ టి.సేతు లక్ష్మి, తన రోగిని కాపాడడానికి ప్రవేటు ఆసుపత్రికి స్వయంగా అంబులెన్సులో తరలించినప్పటికీ కాపాడలేకపోయింది. డాక్టర్ నిజాయితీని కొంచెమయినా గుర్తించని రోగి భర్త, భార్య చనిపోయిందన్న ఆవేదనతో డాక్టర్ ప్రాణాలు తీయడానికి వెనుకాడకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో వివిధ వర్గాల మధ్య ఉన్న సామాజిక ఎడమ, ఖాళీతనం ప్రధాన దోషులుగా గుర్తించవచ్చా?
ఎస్.పి రాజెంద్రన్ ప్రకారం డా. టి.సేతు లక్ష్మి ‘మూడవ మైలు’ లో ఉన్న తన ప్రవేటు ఆసుపత్రిలో తన రూంలో రోగిని పరీక్షిస్తుండగా మహేష్ అక్కడికి వెళ్ళాడు. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో అక్కడికి వెళ్ళిన మహేష్, డాక్టర్ పై దాడి చేసి, కత్తితో విచక్షణా రహితంగా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. సేతు లక్ష్మి మృత దేహంపైన తొమ్మిది కత్తి గాయాలు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మహేష్, ట్యుటి కోర్న్ లోని ఆవుదైయార్పురం నివాసి అనీ మరొక ముగ్గురి సహాయంతో ఈ నేరం చేసినట్లుగానూ పోలీసులు తెలిపారు. నలుగురిని అరెస్టు చేసినట్లుగా వారు తెలిపారు. బలవంతంగా చొరబడడం, హత్య, ఉద్దేశ్యపూర్వకంగా గాయపరచడం సెక్షన్ల కింద వారిని అరెస్టు చేసినట్లుగా పోలీసుల సమాచారం. మహేష్ కి అప్పటికే నేర చరిత్ర ఉందనీ, హత్య, హత్యా ప్రయత్నం, ప్రజలను గాయపరచడం మొదలైన నేరాలు అతనిపైన ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే, డిసెంబరు 30 తేదీన మహేష్ తన ఇరవైనాలుగేళ్ళ భార్య నిత్యను బీచ్ రోడ్ లో ఉన్న ఇ.ఎస్.ఐ ఆసుపత్రికి తెచ్చాడు. ఆప్పటికి ఆమె ఇరవై నాలుగు వారాల గర్భిణీ. వచ్చేటప్పటికే సీరియస్ కండిషన్ లో ఉందని తెలుస్తోంది. ఇ.ఎస్.ఐ ఆసుపత్రిలో సేతు లక్ష్మి అనస్తీష్టు గానూ, మెడికల్ ఆఫీసర్ గానూ పని చేస్తోంది. నిత్య గర్భంలో ఉన్న ఆరు నెలల పిండం చనిపోయినట్లుగా డాక్టర్ గుర్తించింది. నిత్య ప్రాణం కాపాడడానికి వెంటనే సర్జరీ చేసి పిండాన్ని తొలగించాలని చెప్పి అందుకు ఉపక్రమించింది.
సర్జరీ జరుగుతుండగా రోగి కి సంబంధించి ‘హెచ్.ఇ.ఎల్.ఎల్.పి’ అనే అసాధారణ పరిస్ధితి తలెత్తింది. గర్భం ధరించిన చివరి నెలల్లో ఈ పరిస్ధితి తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. రోగికి సంబంధించిన కీలక రీడింగ్ లన్నీ ప్రమాదకర స్ధాయిలో తగ్గిపోతుండడం మొదలైంది. అయితే డాక్టర్ సేతు లక్ష్మి తన బాధ్యతను అంతటితో వదిలిపెట్టలేదు. నిత్యను కాపాడాలన్న ఆదుర్దాతో తానే అంబులెన్సులో కూర్చుని ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్న ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బయలుదేరింది. ట్యుటి కోర్న్ సౌత్ పోలీసు స్టేషన్ కి దగ్గరలో ఈ ఆసుపత్రి ఉంది.
కాని మార్గ మధ్యంలోనే నిత్య చనిపోయింది. రోగి తరపు బంధువులు అంత దుఃఖంలో ఉండి కూడా డాక్టర్ సేతు లక్ష్మి, నిత్య ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించిందని కొనియాడినట్లుగా ఇండియన్ మెడికల్ అసొసియేషన్ ట్యుటి కొర్న్ విభాగం అధ్యక్షుడు టి.అనంత కుమార్ తెలిపాడు. మరొక ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పటికీ తానే స్వయంగా అంబులెన్స్ లో రోగితో పాటు కూర్చున్నదని నిత్య బంధువులు కొనియాడారని ఆయన తెలిపాడు. దుఃఖంలో ఉండి కూడా వారు సేతు లక్ష్మికి ధన్యవాదాలు తెలిపారని ఆయన చెప్పాడు. రోగి పరిస్ధితి క్షీణీంచినప్పుడు మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సలహా ఇవ్వడంతో డాక్టర్లు సాధారణంగా సరిపెట్టుకుంటారు. ఇలా రోగితో పాటు వేరే ఆసుపత్రికి వెళ్ళే పని పెట్టుకోరు.
ఆసుపత్రులపైనా, డాక్టర్లపైనా ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని అనంత కుమార్ చెప్పినదానిలో వాస్తవం ఉంది. ఈ కేసులో నిందితుడి నేర స్వభావం తన భార్య చనిపోవడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేరేపించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నేర స్వభావం ఉన్న వ్యక్తి అయినప్పటికీ తన భార్య మరణం పట్ల తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం గమనించవలసిన విషయం. నేర స్వభావం లేనట్లయితే భార్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఆలోచన అతనిలో ఉదయించకపోయేదా అన్నది ఆలోచించవలసిన విషయం. భావోద్వేగంతో చేసినా, ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హత్య హత్యే. దానికి తగిన శిక్ష అనుభవించవలసిందే.
ఇక్కడ ఆలోచించవలసిన అంశాలు ఇంకా ఉన్నాయి. ఈ ఆర్టికల్ ప్రారంభంలో పేర్కొన్నట్లు సమాజంలో వివిధ వర్గాల మధ్య ఉన్న సామాజిక అంతరం లేదా తేడా లేదా ఎడమ అన్నవి ఆయా వర్గాల ప్రజల ఆలోచనా విధానాల మధ్య పెట్టని గోడలను లేపాయన్నది వాస్తవం. డాక్టర్ల విషయమే తీసుకుంటే వైద్యం విపరీతంగా వ్యాపారీకరించబడిన ఫలితంగా డాక్టర్లపైన సంఘంలో ఒక విధమైన వ్యతిరేకత ఏర్పడింది. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందించకపోవడం, సరైన వైద్యం అందించాలని డాక్టర్లు భావించినా ప్రభుత్వాల చిన్న చూపు వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం, ప్రభుత్వ డాక్టర్లు అత్యధికులు తమ సమయంలో అత్యధిక సమయాన్ని తమ సొంత ప్రవేటు ఆసుపత్రులకు కేటాయిస్తుండడం ఈ కారణాలన్నీ డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండరన్న అభిప్రాయం ప్రజల్లో, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజానీకంలో వేళ్ళూనుకుంది.
వైద్య రంగం ప్రవేటీకరణ వల్ల డాక్టర్లు ధనికులుగా మారడంతో వారి జీవన సరళి, ఆలోచనా విధానం అన్నీ కింది వర్గాల సామాజిక పరిస్ధితులకు దూరంగా జరిగిపోతున్నాయి. డాక్టర్ చదువులో చేరడం కూడా సేవా దృక్పధం కాకుండా, సంపాదన దృక్పధంతోనే జరుగుతోందన్నది మరొక కఠిన వాస్తవం. సంపాదన ఎలా ఉన్నప్పటికీ డాక్టర్లకు సహజంగా ఉండవలసిన సేవా దృక్పధం కొనసాగిన చోట డాక్టర్లు గౌరవం పొందుతూనే ఉన్నారు. కాని వారి సంఖ్య పడిపోతుండడంతో డాక్టర్లంతా ఒకే జాతి అన్న దృక్పధం సమాజంలో స్ధిరపడింది. ఒక వృత్తిలో ఉన్న వారి పట్ల సమాజంలో పెరగకూడని ధోరణి ఇది. డాక్టర్లే ప్రాణదానం చేయవలసి ఉంటుంది. అదే డాక్టర్లతో సామాజికంగా వ్యతిరేక ధోరణి ప్రబలిన ఫలితంగా వారి ప్రతి చర్యా అనుమాన దృక్కులకు గురవుతోంది. డాక్టర్ కీ, రోగికీ (బంధువలతో సహా) మధ్య ప్రధానంగా ఉండవలసింది నమ్మకం అన్నది అందరికీ తెలిసిందే. ఒక డాక్టర్ గా నమ్మకం ఉన్నప్పటికీ, ధనం కోసం పాకులాడుతున్న డాక్టర్ గా నమ్మకం కోల్పోతున్న పరిస్ధితి. ఈ ద్వైదీ భావం తరచుగా రోగి, అతని/ఆమె బందువులతోనూ ఆడుకుంటున్నది.
చదువుకున్నవారైనా సరే డాక్టర్ చెబుతున్న విషయాలన్నీ అర్ధం చేసుకోగలరన్న గ్యారంటీ లేదు. అలాంటిది నిరక్ష్యరాస్యులు లేదా పాక్షిక నిరక్ష్యరాస్యులైతే డాక్టర్లకే పూర్తిగా వదిలిపెట్టవలసి ఉంటుంది. ఖర్మ సిద్ధాంతం ఇన్నాళ్ళూ డాక్టర్లపైకి ఆగ్రహావేశాలు మరలకుండా కాపాడి ఉండవచ్చు. ఆ ఖర్మ సిద్ధాంతం ఇప్పటికీ తన వన్నె కోల్పోలేదు. ఐనా డాక్టర్లపై ఆగ్రహావేశాలు పెరగడానికి కారణం ఏమిటి? డాక్టర్ల ధనికాలోచనలు, ఆ ఆలోచనల ఫలితంగా పెరుగుతున్న వ్యాపార ధోరణి, అది రోగుల పీడించేదాకా వెళ్ళడం, చివరికి అవయవాలను దొంగిలించేదాక ధన దాహం చేరుకోవడం… ఇవన్నీ డాక్టర్ వృత్తిపైన ఒక ముద్రను వేశాయి. డాక్టర్లంటే డబ్బు పిశాచులన్నది ఈ ముద్ర సారాంశం. ఈ నేపధ్యంలో రోగి బతకడం కోసం అప్పటిదాకా అందుబాటులో ఉన్నవన్నీ అమ్మేసి ఖర్చు చేస్తున్న బంధువులు డబ్బు ఖర్చు చేసినా రోగి దక్కకపోవడంతో తమ ఆగ్రహావేశాలు మరొక రూపానికి తీసుకెళ్తున్నారు.
సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణులను ఎప్పటికప్పుడు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాని అసలు ఏమీ పని చేయనిది ప్రభుత్వాలే అవడంతో ఈ ధోరణులు కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు కూడా ధన దాహంతో ఉండడం వల్ల సామాజికంగా ప్రబలుతున్న చెడు ధోరణులకు చెక్ పెట్టవలసినవారు కరువయ్యారు. ప్రజల ఆగ్రవేశాలు సైద్ధాంతికంగా సంఘటిత రూపం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రహాన్ని ఒక దారిలో పెట్టగలిగేది సరైన సైద్ధాంతిక అవగాహన మాత్రమే. అది పాలకులకే లేనప్పుడు ప్రజలకు ఉంటుందని భావించలేము.
‘ఖర్మ సిద్ధాంతం’ అన్నపదం తప్పు. ‘కర్మ సిద్ధాంతం’ అనాలి. క్షణికావేశంలో హత్య చేయటానికి ఒక్కొకసారి చిన్నచిన్న కారణాలు చాలు. ఇక్కడ పెద్ద కారణమే ఉంది. నేరస్వభావం ఉన్న వ్యక్తులకు యేకారణమైనా ఒకటే. నేరం జరుగుతుంది. డాక్టరు వృత్తి అనేకాదు అన్నిరకాల వృత్తులూ ధనప్రభావం యొక్క వికృతరూపం మరియు దాని దుష్ప్రభావాల ఫలితాలని మోస్తున్నాయి. నైతికవిలువల గురించి ఆలోచించేటప్పుడు మనం పిల్లల ముందు యెలా ప్రవర్తిస్తున్నాం? నాలుగేళ్ళ పాపకూ రేంక్ వస్తుందా లేదా లేకపోతే భవిష్యత్తు యేమిటి? యేం సంపాదిస్తుంది రేపు అనే స్థితిలో సమాజం ఉన్నపుడు – నేరాలు సహజం కావటం తధ్యం. ఇప్పటికైనా మేలుకోవాలి. డబ్బే జీవితం కాదు.
NIFTY OPTION TIPS
We are only providing accurate niftyoption tips with contract notes proof. Come join with us. NIFTYSIRI.IN
శ్యామలరావు గారూ మీరన్నది నిజం. అన్ని రకాల వృత్తులపైనా ధన ప్రభావం ఉంది. డాక్టర్ వృత్తి ప్రాణాల్తో ముడి పడి ఉన్నందున అక్కడ భావొద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. పిల్లలను పెంచుతున్న విధానాన్ని కూడా సవరించుకోవాలన్న మీ సూచన సరైంది.