‘అనూజ్ బిద్వే’ హత్య కేసు విచారణ జూన్ లో


అనుజ్ బిద్వే తండ్రి సుభాష్ బిద్వే, కజిన్ సురుచి బిద్వే

ఇంగ్లండులో హత్యకు గురైన అనూజ్ బిద్వే కేసు విచారణ జూన్ నెలలో చేపట్టనున్నారు. జాత్యహంకారంతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న ఈ కేసులో నిందితుడు ఇరవై ఏళ్ళ ‘కియారాన్ స్టేపుల్ టన్’. ఇతను తనను ‘సైకో స్టేపుల్ టన్’ గా పిలవాల్సిందిగా తన మిత్రులను కోరేవాడని తెలుస్తోంది. జూన్ 25, 2012 నుండి కేసులో ట్రయల్స్ ప్రారంభం చెయ్యడానికి కోర్టు నిర్ణయించింది.

సాల్ ఫర్డ్ లోని మాంఛెస్టర్ లో అనుల్ బిద్వే తన మిత్రులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా నిందితుడు అనుజ్ బిద్వే ను టైం అడిగినట్లూ, తమ గమ్యానికి మార్గం ఎటో సెల్ ఫోన్ లో చూస్తూ బిజీగా ఉన్న అనూజ్ బిద్వే అతని మాట వినిపించుకోనట్లూ, ఫలితంగా బిద్వేను తుపాకితో కాల్చిచంపాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. మాంఛెస్టర్ క్రౌన్ కోర్టు లో ట్రయల్స్ జరగనున్నాయి.

బ్రిటన్, ఇండియాలలో ప్రజల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించిన ఈ హత్య నిందుతులను బ్రిటన్ పోలీసులు రెండు రోజులు గడవక ముందే అరెస్టు చేయగలిగారు. బిద్వే ను హత్య చేసిన నేరానికి స్టేపుల్ టన్ పైన అభియోగాలు నమోదు చేశారు. స్టేపుల్ టన్ పెద్దగా మాట్లాడలేదనీ, తన పేరు ధృవీకరించడానికి తప్ప మరి దేనికీ అతను మాట్లాడలేదు. మార్చి 20, 2012 తేదీవరకూ నిందితుడికి పోలీసు రిమాండ్ విధించారు. ఆ తేదీనాటికి, నిందితుడు, హత్యా అభియోగాన్ని తిరస్కరిస్తున్నట్లుగానో, ఆమోదిస్తున్నట్లుగానో చెప్పవలసి ఉంటుంది.

నిందితుడిపైన నేరం రుజువు చేయడానికి తగినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. డిఫెన్సు లాయర్ల విజ్ఞప్తిని పునస్కరించుకుని బిద్వే మృత దేహానికి రెండవసారి పొస్టు మార్టం నిర్వహించనున్నారు. అనంతరం మృత దేహాన్ని బిద్వే బంధువులకు అప్పగించనున్నారు. మాంఛెస్టర్ పోలిసు బృందం ఒకటి ఇండియాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారితో కలిసి బిద్వే బంధువులు ఇంగ్లండు రావలసి ఉంది.

వ్యాఖ్యానించండి