మరి కొద్ది వారాల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్న అన్నా బృందం, తమ ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే, తనకేం కాలేదనీ, కొద్దిరోజుల్లో తాను ఆరోగ్యంగా బైటికి వస్తాననీ ఆసుపత్రి నుండి సందేశం పంపినప్పటికీ ఎన్నికల ప్రచారం విషయంలో అన్నా బృందం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్ పాల్ విషయంలో కాంగ్రెస్ దేశాన్ని దారుణంగా మోసం చేసిందనీ కనుక ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామనీ అన్నా హజరే అనేకసార్లు ప్రకటించాడు. ఆ విషయంలో వెనుకడుగు లేదని ఆయన చాలా సార్లు చెప్పాడు. అలాంటిది ఆయనే ఆసుపత్రిలో చేరేటప్పటికి ఎన్నికల ప్రచారంలో పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది.
అన్నా హజారే అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారం విషయంలో అన్నా బృందం పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. మరో కొద్ది వారలా పాటు అన్నా ఆసుపత్రిలో గడపవలసి ఉంటుందని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారనీ, ఇక ఆయన ఆసుపత్రి నుండి డిశ్ఛార్జి అయిన వెంటనే ఎన్నికల ప్రచారానికి వెళ్ళే అవకాశం లేనందున ఎన్నికల ప్రచారానికి ఎలా హాజరయ్యేదీ తెలియడం లేదు. డెబ్భై నాలుగేళ్ల అన్నా హజారే పలుకుబడి పైనే అన్నా బృందం ఎన్నికల ఎత్తుగడ ఆధారపడి ఉంది. ఆయన లేకుండా అన్నా బృందాన్ని ప్రజలు ఆదరించడం అన్నది అనుమానమే. కనుక అన్నా లెకుండా ఎన్నికల ప్రచారంలో ఇతర అన్నా బృందం సభ్యులు పాల్గొనడానికి సాహసించరు.
“మా ఎన్నికల ప్రచారం గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు” అని అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి తెలిపింది. ఉత్తరా ఖండ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. కాంగ్రెస్, బి.జె.పి రెండింటికీ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.
ఎన్నికల ప్రచారం విషయంలో పునరాలోచించుకోవడానికి అన్నా ఆరోగ్యం మాత్రమే కారణం కాదని సీనియర్ పాత్రికేయులను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. “కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏముంది?ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం అంటే బి.జె.పి ని సమర్ధించడమే. ఎందుకు అవి రెండూ మూడు, నాలుగు స్ధానాల కోసం పోటీ పడుతున్నాయి. మాయావతి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం గా ఆరోపణలు ఎదుర్కొంటోంది. కనుక కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం అవినీతికి మద్దతుగా, బి.జె.పి కి మద్దతుగా మారుతుంది. ఆ విషయం అన్నా బృందం ఆలస్యంగా తెలుసుకుంది. దానితో యు.పిలొ కాంగ్రెస్ వ్యతిరేక పొరాటం అర్ధం లేనిదిగా మారింది. అందువల్లనే ఎన్నికల ప్రచారం నుండి వారు ఉపసంహరించుకుంటున్నారు. అన్నా అనారోగ్యం దానికి ముసుగు మాత్రమే. అన్నా అనారోగ్యం నిజమే కావచ్చు. కాని ఎన్నికల ప్రచారం రద్దుకు ఆయన అనారోగ్యం కారణం కాబోదు” అని సీనియర్ పాత్రికేయుడు కుమార్ కేత్కర్ ను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది.