
ఐ.బి.ఎన్ లైవ్ ప్రసారం చేసిన ఈ వార్తలో 'అస్సాల్ట్' పదవినియోగం కరెక్టు కాదు. చైనా, ఇండియాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చిన్న అవకాశాన్నానైనా పశ్చిమ పత్రికలు వదులుకోవనడానికి ఇదొక సాక్ష్యం
భారత రాయబారి ఎస్.బాలచంద్రన్ పైన చైనా వ్యాపారులు దాడి చేశారనడాన్ని షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారులు నిరాకరిస్తున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. కాని సంఘటనను వివరిస్తున్న భారత పత్రికల కధనాలు వేరే విధంగా ఉన్నాయి. దాడి జరిగిందని చెప్పలేనప్పటికీ, దాడిలాంటిది జరిగిందని మాత్రం అర్ధం అవుతోంది. ఇందుకు ప్రధానంగా చైనా వ్యాపారుల తొందరపాటుతనం కారణంగా కనిపిస్తోంది. తమకు ఇవ్వవలసిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నంలో వారు తొందరబాటుకి గురైనట్లు కనిపిస్తోంది.
షాంఘై నగరం దగ్గర ఉన్న యివు పట్నం లో డిసెంబరు 31 న మూడో దేశానికి చెందిన వ్యాపార సంస్ధలో పనిచేస్తున్న ఇద్దరు భారత ఉద్యోగులపై విచారణ జరుగుతోంది. భారతీయులు ఉద్యోగులు మాత్రమేననీ, వారి కంపెనీ యజమాని చేసిన మొసానికి వారు బాధ్యులు కాదని నమ్మిన భారత రాయబారి బాలచంద్రన్ వారి విడుదలకోసం కోర్టులో జరిగే విచారణకు హాజరైనాడు. విచారణ సుదీర్ఘంగా ఐదు గంటలపాటు జరిగింది. డయాబిటిస్ రోగి అయిన బాలచంద్రన్ కడుపు ఖాళీ కాకుండా ఏదో ఒకటి తినవలసి ఉంటుంది. అందుకోసం ఆయన బైటికి వస్తుండగా విచారణ ముగియకుండా వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారని చైనా వ్యాపారులపై అభియోగం. దానితొ ఆయన అక్కడే జడ్జి, పోలీసుల ముందే అపస్మారక స్ధితికి చేరుకోవడంతో ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది.
రహేజా, అగర్వాల్ అనే పేర్లుగల భారతీయులు ‘యూరో గ్లోబల్ ట్రేడింగ్’ కంపెనీ ప్రతినిధులు. తాము కంపెనీ ఉద్యోగులు మాత్రమేనని వారు చెబుతున్నారు. ఈ కంపెనీ యజమాని యెమెన్ లేదా పాకిస్ధాన్ దేశానికి చెందినవాడని చెబుతున్నారు. స్ధానిక చైనా వ్యాపార సరఫరాదారులకు చెయ్యవలసిన చెల్లింపులను ఎగవేసి కంపెనీ యజమాని పారిపోయాడు. దానితో కంపెనీ ఉద్యోగులు రహేజా, అగర్వాల్ లను చైనా వ్యాపారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తమకు రావలసిన బాకీలు అందితేనే వారిని వదిలిపెడతామని చెప్పారు.
బాలచంద్రన్ ఏదో ఒకటి తిందామని బైటికి వస్తుండగా చైనా వ్యాపారులు ఎందుకు అడ్డుకోవలసి వచ్చింది? నిజానికి బాలచంద్రన్ కోర్టు బైటికి రావడానికి వ్యాపారులకి అభ్యంతరం ఏమీ లేదు. ఆయన తనతో పాటు రహేజా, అగర్వాల్ లను కూడా బైటికి తీసుకెళ్తుండడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. తమ బాకీ వసూలు కాకుండా కంపెనీకి చెందిన చివరి ఇద్దరూ వెళ్లిపోతే ఎలాగన్నది వారి వాదన. దానితో బాలచంద్రన్, రహేజా, అగర్వాల్ త్రయాన్ని చైనా వ్యాపారులు చుట్టుముట్టి రహేజా, అగర్వాల్ లను బలవంతంగా లాగేసుకున్నారు. అప్పటికే సుదీర్ఘ సమయం పాటు ఏమీ తినకుండా ఉన్న బాలచంద్రన్ ఈ మూకుమ్మడి చర్యతో అర్ధ-అపస్మారక (సెమీ కాన్షియస్) స్ధితికి చేరుకున్నాడు. దానితో ఆయనని ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది.
వ్యాపారులకి మద్దతు ఇస్తున్నాడన్న అనుమానంతో బాలచంద్రన్ పైన దాడి జరిగిందనడాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు నిరాకరించడం ఈ సందర్భంగా గమనించాలి. రహేజా, అగర్వాల్ లను బైటికి తీసుకురావడంలో కూడా కాని పనేమీ లేదు. వారిద్దరూ వెళ్ళవచ్చని జడ్జి చెప్పాకనే బాలచంద్రన్ వారిని బైటికి తెస్తున్నట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అయితే జడ్జి తీర్పుని చైనా వ్యాపారులు పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఈ దశలో చైనా పోలీసులు కల్పించుకుని రాయబారినీ, అగర్వాల్, రహేజాలు వెళ్ళిపోవడానికి సహాయ పడవలసి ఉంది. స్ధానిక వ్యాపారులు దాడి చేస్తారన్న భయంతో ఆ తర్వాత కూడా అగర్వాల్, రహేజాలు అక్కడే పోలీసు కస్టడీలో ఉండడానికి ఇష్టపడ్డారని కూడా ‘ది హిందూ’ తెలిపింది.
ఈ మొత్తం ఘటనలో చైనా వ్యాపారుల తొందరపాటు తనం దోషిగా కనిపిస్తోంది. బాలచంద్రన్ పాల్పడిన చర్యలలో తప్పు కనిపించడం లేదు. అగర్వాల్, రహేజాలు కేవలం ఉద్యోగులే అయితే వారిని నిర్బంధించడం వల్ల ప్రయోజనం కూడా ఏమీ లేదు. అయితే కంపెనీ యజమాని అప్పటికే పారిపోవడంతో ఎలాగయినా తమ సొమ్ము రాబట్టుకోవాలన్న ఆత్రుతలో చైనా వ్యాపారులు ఈ తప్పులకు పాల్పడి ఉండవచ్చు.
ఈ ఘటన కి సంబంధించి భారత దేశంలో చైనా రాయబారి ఝాంగ్ యూ ని తన కార్యాలయానికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ పిలిపించి తన నిరసన తెలిపింది. చైనా లోని షాంఘై, బీజింగ్ నగరాల్లో గల భారత రాయబార కార్యాలయాలు కూడా తమ నిరసనను చైనా ప్రభుత్వానికి తెలిపాయి. విచారణ జరపడానికి చైనా అంగీకారం తెలిపినట్లు తెలిపింది.