
భారత షేర్ మార్కెట్లకు 2011 సంవత్సరం నిరాశనే మిగిల్చింది. ప్రపంచంలో మరే దేశమూ నష్టపోనంతగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ షేర్ సూచి ఈ సంవత్సరం 24.6 శాతం నష్టపోయింది. ఈ సంవత్సరం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం రోజు కూడా బి.ఎస్.ఇ సెన్సెక్స్ 0.6 శాతం నష్టపోయింది. సంవత్సరం పొడవునా ద్రవ్యోల్బణం రెండంకెలకు దగ్గరగా కొనసాగడం, ద్రవ్యోల్బణం అరికట్టడానికని చెబుతూ ఆర్.బి.ఐ అధిక వడ్డీ రేట్లు కొనసాగించడం, ఆర్ధిక వృద్ధి అనూహ్యంగా నెమ్మదించడం కారణాల వల్ల భారత షేర్ మార్కెట్లు నష్టపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సంవత్సరం అత్యధికంగా నష్టపోయిన భారత షేర్లు కొత్త సంవత్సరంలో కూడా పెద్దగా కోలుకునే అవకాశాలు లేవని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించింది. భారత ప్రభుత్వం సంస్కరణల విధానాలను అమలు చేయడంలో ఈ సంవత్సరం విఫలం చెందడంతో షేర్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయనీ, ఉన్నవి కూడా బైటికి వెళ్ళిపోయాయనీ రాయిటర్స్ విశ్లేషించింది. పశ్చిమ బహుళజాతి సంస్ధలకు ఈ వార్తా సంస్ధ కల్తీ లేకుండా కొమ్ము కాస్తుంది. భారత పార్లమెంటు సంస్కరణలను అమలు చేయడం లేదని రాయిటర్స్ వార్తా సంస్ధ ఈ సంవత్సరం ప్రారంభం నుండీ ఒకటే కార్యక్రమంగా కన్నీళ్లు కార్చింది. ఒక్క సంస్కరణ విధానం అయినా అమలు చేస్తూ ఏదో ఒక బిల్లు ఆమోదం పొందకపోతే ఆ సెషన్ పార్లమెంటు సమావేశాలు పూర్తిగా వ్యర్ధం అయినట్లుగా ఈ వార్తా సంస్ధ అభివర్ణిస్తుంది. అందుకు తీవ్రంగా బాధపడిపోతుంది. ఆ మేరకు విశ్లేషణలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తుంది. భారత ప్రభుత్వానికి విధానపరమైన పక్షపాతం వచ్చినట్లుగా ఈ సంవత్సరంలో అనేక సార్లు రాయిటర్స్ వార్తా సంస్ధ అభివర్ణించింది.
సంస్కరణల విధానాలు అంటె పశ్చిమ దేశాల బహుళ జాతి కంపెనీలు ఆత్రుతగా ఎదురుచూసే విధానాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ప్రభుత్వం రిటైల్ అమ్మకాల రంగంలోకి విదేశీ ప్రవేటు పెట్టుబడులను యాభై ఒకటి శాతం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్, ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో వెనక్కి ఉపసంహరించుకున్నప్పుడు రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధలు అత్యంత తీవ్రంగా బాధపడిపోయాయి. తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశాయి. భారత ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని నిందించాయి. వీటి ఒత్తిడికి తలొగ్గి, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అనేక సార్లు తాము రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించే బిల్లుని పూర్తిగా వెనక్కి తీసుకోలేదనీ, వెనక్కి తీసుకోవడమన్నది తాత్కాలికమేననీ, సమయం చూసుకుని ఎవరికి చెప్పవలసింది వారికి చెప్పి త్వరలో మళ్లీ ప్రవేశపెడతామనీ హామీలు గుప్పించాడు. ఆ హామీ అమలు కావడం తధ్యం కూడా. అయినా సరే. ఇప్పటికే అనేక సంవత్సరాల పాటు ఈ బిల్లు ప్రతిపాదన వెనక్కి పోయిందని గుర్తు చేస్తూ కేబినెట్ ఆమోదించిన బిల్లుని వెనక్కి తీసుకోవడం సరికాదని పాఠాలు చెప్పాయి. అక్కడికి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల తమకు ఎంతో గౌరవం ఏడ్చినట్లు!
భారత దేశంలో నాలుగు కోట్ల కుటుంబాలు (ఐదు కోట్లని మరి కొన్ని అధ్యయన సంస్ధలు చెప్పాయి) రిటైల్ అమ్మకాల రంగంలో ఉపాధి కలిగి ఉన్నారని దాదాపు అన్ని వార్తా సంస్ధలు, పత్రికలు, ఛానెళ్ళు తెలిపాయి. తక్కువలో తక్కువ కుటుంబానికి ఇద్దరు పిల్లలని భావించినా రిటైల్ రంగంపై పదహారు కోట్ల మంది ఆధారపడి ఉన్నారని స్పష్టమవుతున్నది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క చేత్తో ఉపాధి కల్పిస్తున్న రంగం భారత దేశంలో లేదు. ఈ రంగంలో అనేక మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు సైతం ఉపాధి పొందుతారు. ఉద్యోగం రానివారిలో చాలామంది ఏదో ఒక వీధి మూల రిటైల్ షాపు పెట్టుకుని జీవిక గడపడం భారత దేశంలో సర్వ సామాన్యం. ఉద్యోగాలు ప్రభుత్వాలు కల్పించడం ఎన్నడో మానేసినప్పటికీ నిరుద్యోగుల నుండి సామాజికంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి రాకుండా రిటైల్ రంగం పెద్ద ఎత్తున ఆదుకుంటోంది. ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తూ, రిటైర్డ్ ఉద్యోగాలను నింపకుండా ఉపాధి అవకాశాలను ఎలాగూ ప్రభుత్వాలు కల్పించడం లేదు. “అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు” అన్నట్లుగా స్వయం ఉపాధి అవకాశాలను కూడా మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా లాంటి బుర్ర పుచ్చు మేధావుల నేతృత్వంలోని ప్రభుత్వం హరించివేస్తున్నది. రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధిని కూడా హరించి వేసే విదేశీ కంపెనీల ప్రవేశం ఈ మేధావులకు ముద్దు. ఈ కంపెనీలు ప్రాతినిధ్యం వహించే పెట్టుబడిదారీ వ్యవస్ధ తప్ప మరో గతిలేదని ఖాళీ మెదడు మేధావుల వంతపాటలు కొనసాగుతుండగా వీరి ఆటలు సాగక మరేమి?
కొత్త సంవత్సరంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందనీ, అపుడు ఆర్.బి.ఐ వడ్దీ రేట్లు తగ్గిస్తుందనీ, తద్వారా స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులకు బ్యాంకుల నిధులు అందుబాటులోకి వస్తాయనీ, ఆ నిధుల్ని అప్పులుగా తీసుకుని కంపెనీలు కొత్త పెట్టుబడూలు పెడతాయనీ, తద్వారా ఆర్ధిక వ్యవస్ధ ఊపందుకుని ఆర్ధిక వృద్ధి మెరుగుపడుతుందనీ స్వదేశీ, విదేశీ మదుపుదారులు ఆశగా ఉన్నారు. రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధలూ ఆశగా ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గి కంపెనీలు అప్పులు తీసుకుంటే గానీ అవి పెట్టుబడులు పెట్టవన్నది ఇక్కడ అర్ధం అవుతోంది. ప్రజల కొనుగొలు శక్తి పెంచి మార్కెట్లో సరుకుల అమ్మకానికి దోహద పడడం ద్వారా గానీ, రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి, గిట్టుబాటుధరలు పెంచి వ్యవసాయం లాభసాటిగా చేయడం ద్వారా ప్రజా సామాన్యాన్ని ఆర్ధిక వ్యవస్ధలో చురుకైన పాత్రధారులుగా మార్చడం ద్వారా గానీ ఆర్ధిక వ్యవస్ధకు ఊపు కల్పించినట్లయితే ఆ ఊపు అన్ని రంగాలకూ విస్తరిస్తుంది. కలకాలం నిలుస్తుంది. కింది నుండి పైదాకా అన్ని వర్గాలూ, రంగాలూ ఆర్ధిక కార్యాకలాపాల్లో భాగం పంచుకుని జిడిపి వృద్ధి రేటు పెరగడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. కాని మన్మోహన్, అహ్లూవాలియా, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం లాంటి విదేశీ బహుళజాతి సంస్ధల అద్దె ఆర్ధికవేత్తలకు ఇది నచ్చదు. వీరి మాస్టర్లు ప్రయోజనం పొందకుండా వచ్చే జిడిపి వృద్ధి వీరికీ అవసరం ఉండదు.
భారత షేర్ మార్కెట్ కు మేజర్ డ్రైవింగ్ ఫోర్సు విదేశీ పెట్టుబడుల ప్రవాహం అని రాయిటర్స్ అభివర్ణించింది. ఈ సంవత్సరం నికరంగా 380 మిలియన్ డాలర్లు భారత్ షేర్లనుండి తరలి వెళ్ళాయని ఆ సంస్ధ ప్రకటించింది. గత సంవత్సరం నికరంగా 29 బిలియన్ డాలర్లు భారత్ షేర్లలోకి విదేశీ నిధులు వచ్చాయని కూడా ఆ సంస్ధ తెలిపింది. ఈ నిధుల ప్రవాహం వల్ల గత సంవత్సరం (2010) భారత షేర్లు 17 శాతం లాభపడ్డాయి. 2009 లో నైతే భారత్ షేర్ సూచి సెన్సెక్స్ 81 శాతం లాభపడింది. వార్షికంగా చూస్తే షేర్ మార్కెట్ పతనం కావడం గత దశాబ్దంలో ఇది రెండో సారి మాత్రమే. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన 2008 లో మాత్రమే ఈ విధంగా వార్షిక తగ్గుదల సంభవించింది. శుక్రవారం సెషన్ ముగిసే నాటికి సెన్సెక్స్ 15454.92 పాయింట్ల వద్ద ఉంది. శని వారం షేర్ మార్కెట్లకు సెలవు కనక సెన్సెక్స్ కి ఈ సంవత్సరానికి ఇదే ముగింపు రీడింగ్. జనవరి 2న మళ్ళీ మార్కెట్లు తెరుచుకునే నాటికి కొత్త సంవత్సరంలో ఉంటాము. డిసెంబరు నెలలో సెన్సెక్స్ 4.1 శాతం పతనం అయ్యింది.
షేర్ మార్కెట్లతో పాటు రూపాయి విలువ కూడా ఈ సంవత్సరం బాగా పతనమయ్యింది. మొత్తం మీద పదహారు శాతం మేరకు రూపాయి విలువ ఈ సంవత్సరంలో కోల్పోయింది. కరెన్సీ ల విషయంలో కూడా భారత కరెన్సీయే మేజర్ కరెన్సీలలో అత్యధికంగా నష్టపోయింది. రూపాయి విలువ స్ధిరంగా ఉంటే, కొంత విశ్వాసం చేకూరి మార్కెట్లు కూడా స్ధిరంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ కొత్త సంవత్సరంలోనైనా రూపాయి స్ధిరంగా ఉంటుందా లేదా అన్నది అనుమానంగానె ఉంది. ఆర్ధిక కార్యకలాపాలు తేదీల మార్పుపై ఆధారపడి ఉండదు కనుక రూపాయి స్ధిరత్వంపైనా, మార్కెట్ల స్ధిరత్వంపైనా, వెరసి జిడిపి వృద్ధి పైనా నమ్మకం పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. వచ్చే సంవత్సరం మధ్య కల్లా పద్దెనిమి వేలకు సెన్సెక్స్ పెరగవచ్చని రాయిటర్స్ నవంబర్ లో జరిపిన సర్వే తెలిపింది.
భారత ప్రభుత్వం సంస్కరణ విధానాలను అనుసరిస్తూ దేశ ఆర్ధిక వ్యవస్ధను విదేశీ కంపెనీల దోపిడీకి అడ్డాగా మార్చినంతకాలం భారత ఆర్ధిక వ్యవస్ధ ఇలా సంక్షోభాలతో కునారిల్లుతూనె ఉంటుంది. భారత ప్రజలు మరింతగా ఆకలి, నిరుద్యోగం, దరిద్రం బారిన అంతకంతకూ ఎక్కువగా పడుతూనే ఉంటారు. తమ దేశ ఆర్ధిక వ్యవస్ధను తమ వశంలోని తెచ్చుకోవలసింది భారత ప్రజలే. అందుకు పటిష్టమైన రాజకీయ, ఆర్ధిక, సామాజిక, తాత్విక సిద్ధాంత భూమిక కలిగిన రాజకీయ పార్టీ నేతృత్వం ప్రజలకు కావలసి ఉంది.