నీళ్ళకీ ధర పెట్టాలి -అహ్లూవాలియా ప్రేలాపన


“ఆంధ్ర జ్యోతి” దిన పత్రికలో ఈ వార్త ప్రచురితమయింది. విదేశీ కంపెనీల ప్రయోజనాలు తప్ప మరొకటి కనపడని మాంటెక్ అహ్లూవాలియా మెదడుకి పెట్టుబడిదారీ పురుగు ఆశించి పూర్తిగా కుళ్ళిపోయిందనడానికి ఈ వార్త ప్రబల ఉదాహరణ. స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాలను పూర్తిగా తలకెక్కించుకోవడమే కాక, కేవలం పశ్చిమ దేశాల ప్రవేటు బహుళజాతి కంపెనీల పనులు చేసి పెట్టడానికే కట్టుబడి ఉన్న ఈ అద్దె మేధావి ప్రజలకు నీరు మరింత అందుబాటులోకి తేవడానికి బదులు వారికి ఇంకా దూరం చేసే ఆలోచనలే చేస్తున్నాడు. నీటిని సరుకుగా చేసి ఇప్పటికె బహుళజాతి కంపెనీలు లాభాలు సంపాదిస్తుండగా, దేశంలో ఇంకా అనేక కోట్లమంది ప్రజలకు ప్రభుత్వమే ఉచిత రక్షిత నీటి సౌకర్యం కల్పించవలసి రావడం పట్ల బెంగ పెట్టుకున్నాడు. భవిష్యత్తులో నీరు దొరకదు కనక ఇప్పుడే పూర్తిగా ధరకట్టి, కంపెనీలు భవిష్యత్తులో మరిన్ని లాభాలు సంపాదించడానికి ఈ “కుళ్ళు మెదడు” మేధావి పధకాలు పన్నుతున్నాడు.

అవేం చెబుతున్నాయో తెలుసుకోకుండా పెట్టుబడిదారీ వ్యవస్ధే అంతిమం అని నమ్ముతున్న పెట్టుబడిదారీ సిద్ధాంతాల ప్రేమికులు ఇలాంటి వార్తల ద్వారానైనా కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం! గెలుపోటమి వాదనలుగా స్వీకరించి ఏదో విధంగా కౌంటర్ ఇచ్చి గెలిచామని సంతృప్తి పడకుండా వాస్తవిక దృక్పధంతో ప్రజల ప్రయోజనాల నేపధ్యంలో వీరు బుర్రకి పదును పెడతారని ఆశించడంలో తప్పులేదు.

ఆంధ్ర జ్యోతి కత్తిరింపు

క్లిక్ చేసి పెద్దది చూడండి

7 thoughts on “నీళ్ళకీ ధర పెట్టాలి -అహ్లూవాలియా ప్రేలాపన

 1. జనాభా పెరిగిపోతే ఎక్కడైనా నీటి కొరత వస్తుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లకి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనా నీటిపై ధర పెట్టాలి అంటున్నది?

 2. నా బాల్యంలో ఒక గణపతినవరాత్రాలలో కాబోలు, జరిగిన సంఘటన. కిర్లంపూడిలో శ్రీ నిడదవోలు అచ్యుతరామయ్యగారి బృందం బుఱ్ఱకథ మానాన్నగారితో కలసి వింటున్నాను. బ్రిటిషువాళ్ళు పన్ను వేసిన వాటిజాబితా అంతా విని హాస్యగాడు అంటాడు కదా, ‘అరెరే, వీళ్ళు ఒకదానిమీద పన్ను వేయటం మరచిపోయారే’ అని. సరే, దేని మీదా అన్న చర్చ జరిగి హాస్యగాడు చివరికి జవాబు చెబుతాడు ‘అదేనండీ, పళ్ళు తోము పుల్ల మీద’ అని.

  అలాగే ఉంది కథ. సవాలక్ష పన్నులు, ధరలూ జనం నడ్డి విరుస్తుంటే జనాన్ని, ఇప్పుడు ‘నీళ్ళ’ మీద ధరకట్టాలన్న గొప్ప ఆలోచన వచ్చిందా దొరలకి?
  పాపం, ఆ హాస్యగాడన్నట్లు, మర్చిపోయారేమో, ‘పీల్చే గాలి’ మీద కూడా ధరకట్టండి ప్రభువులూ!
  మనిషి బ్రతుకున్నందుకు గాను నెలకింత అని ‘జీవనసుంకం’ అదేనండి Life Tax కూడా వసూలు మొదలు పెట్టండి. శుభస్య శీఘ్రం.

 3. శ్యామలరావు గారూ, భలే ఐడియా ఇచ్చారు. లైఫ్ టాక్స్, వాహనాలకి వెయ్యడమే తప్ప మనుషులకి కూడా వెయ్యవచ్చు అని అహ్లూవాలియా, మన్మోహన్ బ్యాచ్ కి తట్టిందో లేదో. మీరు గనక ఈ ఐడియా వారికిస్తే, మీకు ఏదో ఒక పద్మ అవార్డు దక్కినా దక్కవచ్చునండీ.

 4. నాకు ఏదో ఒక పద్మ అవార్డు అసలా ఆలోచనే యెపుడూ రాలేదు సుమండీ.

  అయినా వృత్తి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళ కెవరిస్తారండీ అవార్డులు? రాజకీయ నాయకులు, ప్రభుత్వప్రాపకం ఉన్న కవిమన్యులు ఇతర కళారంగ ప్రముఖులు , జనాకరక్షణ ఉన్న క్రీడాకారులు … ఇలా వీటిని పుచ్చుకోవటానికి వేరే రకం మనుష్యులుంటారు గదా. అన్నట్లు ప్రముఖ పారిశ్రామిక (దోపిడీ)వేత్తలు కూడా ఉంటారు వీటికోసం.

  మీరు నూఱేళ్ళూ అక్షరాలా యేదో యెన్నకున్న రంగానికి నిస్వార్ధంగా సేవ చేసి తరించండి – మీ ముఖం చూడవీ అవార్డులు. గ్యారంటీ.

 5. శేఖర్ గారూ,
  మీరు ప్రాణాధారమైన నీరు అని పదం కట్టేసారు. కాని వాళ్లకు అది తాగునీరులా మాత్రమే, ఇంకా చెప్పాలంటే పచ్చి సరుకులాగే కనబడుతోంది. పల్లెటూళ్లలో ఈనాటికీ మంచినీళ్లు అనే పదమే వాడతారు అంటే తాగటానిక అనువైన నీరు. ఇది వలసభాషలో డ్రింకింగ్ వాటర్ అయిపోయి ఇవ్వాళ సరకురూపంలో ధర కట్టేంతవరకూ వచ్చేసింది. మనిషి చేతిలో నీటి బాటిల్ వచ్చి పడినప్పటినుంచే నీళ్లు సరుకయిపోయింది కదా. మంచినీళ్లు పరిణామక్రమంలో తాగునీరుగా మారిపోయిన క్రమంలోనే నీటికి రెక్కలొచ్చాయి. నీటి విషయంలో నేటికీ ఉన్న ఈమాత్రపు ఉచిత పంపిణీని కూడా ఎత్తేయాలిని దుర్బుద్ధులు రాజ్యమేలుతున్న పిదపకాల మిది. ఔరంగజేబు కూడా వీళ్లముందు నిలబడలేడనుకుంటాను.

  పళ్లు తోము పుల్లలపై పన్ను, గాలిపై పన్ను, జీవించడం పై కూడా పన్ను.. వస్తాయండీ. మరెన్నో రోజులు పట్టదు కూడా.. మీ గోళ్లు కత్తిరించడానిని ఎన్నెన్ని సాధనాలు ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి లెండి త్వరలోనే…

 6. ఔరంగజేబ్‌లాగ జుత్తు పన్ను వేస్తే బాగుంటుంది. అమెరికన్ లిబర్టేరియన్ పార్టీ వ్యాపారులపై పన్నులు ఉండకూడదని అంటుంది. ఆ పార్టీ విధానాలని నమ్మే మాంటెక్ సింగ్ అహ్లువాలియా లాంటివాళ్ళు ఇండియాలో మాత్రం సాధారణ ప్రజలకి నీటి పన్ను ఉండాలంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s