‘భగవద్గీత’ నిషేధానికి రష్యా కోర్టు నిరాకరణ


భారత ప్రభుత్వం రాయబార పరంగా తెచ్చిన ఒత్తిడి ఫలించిందో ఏమో గానీ ‘భగవద్గీత’ అనువాద గ్రంధం నిషేధానికి రష్యాలోని సైబీరియా కోర్టు నిరాకరించిందని పి.టి.ఐ వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. సైబీరియాలోని టామ్స్క్ జిల్లా కోర్టులో గత జూన్ నెలలో ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని పి.టి.ఐ నివేదించింది. గత కొన్ని వారాలుగా ఈ అంశంపై రష్యా, భారత్ ల మధ్య రాయబార పరమైన ఒత్తిడి కొనసాగుతూ వచ్చింది. పార్లమెంటులో సైతం ఈ అంశంపై సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రష్యా కోర్టు పిటిషన్ దారు కోరికను నిరాకరించడంతో ఈ ఒత్తిడి తేలికపడ్డట్లయింది.భగవద్గీత రష్యన్ అనువాదాన్ని నిషేధించాలన్న పిటిషన్ కోర్టు ముందుకు విచారణకు వచ్చిన నేపధ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ భారత రష్యా రాయబారిని ఈ వారంలోనే కలిసి చర్చించాడు.

భగవద్గీత రష్యన్ “అనువాదం,” ‘ఉన్నది ఉన్నట్లుగా’ స్వీకరించినట్లయితే ‘సామాజిక అసమ్మతి’ ని పెంపొందిస్తుందనీ, భగవద్గీతను నమ్మని వారి పట్ల ద్వేష భావాన్ని పెంపొందిస్తుందనీ ప్రాసిక్యూటర్లు వాదించారు. రష్యన్ అనువాదంలో ఒక్క భగవద్గీత యధాతధ అనువాదమే లేదు. దానితో పాటు అనువాదకుడు ‘ఎ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాద’ వ్యాఖ్యానం కూడా ఉంది. అనువాదకుడు రష్యాలో ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్ – ఐ.ఎస్.కె.సి.ఒ.ఎన్) వ్యవస్ధాపకుడు. ఇస్కాన్ హరే కృష్ణ ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. భగవద్గీత రష్యా అనువాదాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిషేధించిన తీవ్రవాద పుస్తకాల జాబితాలో చేర్చాలని ప్రాసిక్యూషన్ కోరింది. ఈ జాబితాలో ఇప్పటివరకు వెయ్యికి పైగా పుస్తకాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో అడాల్ఫ్ హిట్లర్ రచన “మై కెంఫ్” కూడా ఉందని తెలుస్తోంది. “జెహోవాస్ విట్నెస్”, “సైంటాలజీ” మున్నగు ఉద్యమాల పుస్తకాలు కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఒక్క హిందూ మత భక్తి పుస్తకాన్ని నిషేధించాలనడమే కాక ఆ జాబితాలో క్రైస్తవ ఉద్యమాల పుస్తకాలు కూడా ఉన్నాయని గుర్తించవచ్చు.

రష్యాలో ఇస్కాన్ ప్రతినిధి యూరి ప్లెష్కోవ్, భగవద్గీత రష్యన్ అనువాదం, రష్యాలో పాతిక సంవత్సరాల నుండి ఉంటోందని తెలిపాడు. ఈ కాలంలో ఎన్నడూ హింసను గానీ, తీవ్రవాద కార్యకలాపాన్ని గానీ ఈ పుస్తకం ప్రేరేపించలేదని ఆయన ఎత్తి చూపాడు. “దానికి బదులు ఈ పుస్తకం సమస్త జీవులపైన మానవతా వాద వైఖరిని బోధిస్తుంది” అని ప్లెష్కోవ్ చెప్పాడు. టామ్స్క్ లోనే హరే కృష్ణ గ్రామాన్ని నిర్మించడానికి ఇస్కాన్ తలపెట్టగా కొంతమంది చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆ నిర్మాణంపై కొన్ని రోజులు నిషేధం విధించింది. టామ్స్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు భగవద్గీత అనువాదం పై పరిశోధన జరిపి కొన్ని అంశాలను నిర్ధారించారు. భగవద్గీత రష్యన్ అనువాదం ఇపుడు ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తే గనక అందులో భగవద్గీతను నమ్మని వారి పట్ల కఠిన పదజాలాన్ని కలిగి ఉందని వారు నిర్ధారించిన అంశాలలో తెలిపారు. మతపరమైన ద్వేషం కలుగజేస్తుందనీ, లింగ, జాతి, దేశీయత, భాష అంశాల ప్రాతిపదికన భేదభావనను పెంపొందిస్తుందనీ వారు నిర్ధారించారు.

జూన్ నెలలో మొదలయిన విచారణ ఈ డిసెంబరులో పూర్తి కావలసి ఉంది. ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబరు 19న రష్యా సందర్శన పూర్తయిన సందర్భంగా, కోల్ కతాలో రష్యా రాయబార కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి. లోక్ సభ స్పీకర్ ఈ అంశంపై సభ్యులు ఆందోళన చేయడంతో అనేక గంటలపాటు వాయిదా వేయవలసి వచ్చింది. రష్యా అధికారులు ఇందులో జోక్యం చేసుకోవాలని భారత అధికారులు గత వారం విజ్ఞప్తి చేశారు. భగవద్గీత కేవలం మత గ్రంధం మాత్రమే కాదనీ, అది భారతీయ ఆలోచనను ఓ పద్ధతి ప్రకారం వెల్లడించే మార్గమనీ రష్యాలో భారత్ రాయబారి అజయ్ మల్‌హోత్రా ఓ ప్రకటనలో రష్యాకు విజ్ఞప్తి కూడా చేశాడు. అంతేకాక కొన్ని వందల సంవత్సరాలనుండి భగవద్గీత ప్రపంచం అంతా స్వేచ్ఛాగా పంపిణీ చేయబడుతున్న గ్రంధమనీ, అయినా తీవ్రవాదాన్ని రెచ్చగొట్టిన సంఘటన ఒక్కటి కూడా జరగలేదనీ రాయబారి తెలిపాడు.

అయితే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భగవద్గీత పై దాఖలైన పిటిషన్ గురించి ఆందోలన చెందవలసిన అవసరం ఏమీ లేదని వివరించాడు. టామ్స్క్ కోర్టు నేరుగా భగవద్గీత గ్రంధం పట్లా అందులోని బోధనల పట్ల వ్యతిరేకత గానీ, ఆందోళనగానీ వ్యక్తం చేయడం లేదనీ కేవలం అనువాద గ్రంధానికి అనువాదకుడు చేసిన వ్యాఖ్యానాన్ని యధాతధంగా తీసుకున్నపుడే ఏర్పడే పరిస్ధితి పట్ల కోర్టు ఆందోళనగా ఉన్నదనీ తెలిపాడు. భగవద్గీత గ్రంధాన్ని సరిగ్గా అనువదించకపోవడం వల్ల సమస్య తలెత్తిందనీ ఆ ప్రతినిధి తెలిపాడు. “ఇది భగవద్గీత గ్రంధానికి సంబంధించిన విషయం కాదని నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. అది ఒక మతపరమైన తాత్వక పద్యం. అత్యంత గొప్ప గ్రంధం ‘మహా భారత్’ అదొక భాగం. ప్రాచీన హిందూ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యమైనది” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అలెగ్జాండర్ లుకాషెవిక్ గత గురువారం మాస్కోలో తెలిపాడు. రష్యాలో ఆ పుస్తకం 1788లోనే మొదట ప్రచురించబడిందని ఆయన గుర్తు చేశాడు.

2005 లో రష్యా ఆర్ధడాక్స్ ఆర్చ్ బిషప్, హరే కృష్ణ గుడి నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిందిగా మాస్కో మేయర్ ని కోరాడు. హిందూ దేవుడు కృష్ణుడు దెయ్యం అనీ, దేవుడిని వ్యతిరేకించడానికి మనిషి రూపంలో ఉన్న నరక శక్తి అనీ అభివర్ణిస్తూ గుడి నిర్మాణాన్ని వ్యతిరేకించినట్లు ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఆ తర్వాత మాస్కో సబర్బన్ ప్రాంతంలోనే కృష్ణుడి గుడి నిర్మించడానికి అనుమతి ఇచ్చారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని భగవద్గీత అనువాదంపై దాఖలైన పిటిషన్ ను చూస్తున్నట్లుగా రష్యన్ ప్రతినిధి వివరిస్తున్నాడు. నిజానికి భగవద్గీత యధాతధ అనువాదం పట్ల టామ్స్క్ కోర్టుకి ఎలాంటి వ్యతిరేకతా లేదని ఆయనా చెబుతున్నాడు.

-ఎన్.డి.టి.వి

One thought on “‘భగవద్గీత’ నిషేధానికి రష్యా కోర్టు నిరాకరణ

వ్యాఖ్యానించండి