కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు గణనీయ సంఖ్యలో పార్లమెంటుకు హాజరు కాకపోవడంతో లోక్ పాల్ బిల్లుకి రాజ్యాంగ హోదా కల్పించే ‘రాజ్యాంగ సవరణ బిల్లు’ ఓటమికి గురయింది. గైర్హాజరైన కాంగ్రెస్ సభ్యుల జాబితా ఇవ్వాలని సోనియా గాంధి కోరడంతో గైర్హాజరైన సభ్యులపై కాంగ్రెస్ హైకమాండ్ చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు. మూజు వాణీ ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు బుధవారం రాజ్య సభలో ఓటింగ్ కి రానున్న నేపధ్యంలో రాజ్యసభలో మెజారిటీ సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.
లోక్ పాల్ కి రాజ్యాంగ హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఎం.పి రాహుల్ గాంధీ 116 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించాడు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే హాజరైన సభ్యులలో మూడింట రెండు వంతుల సభ్యులు బిల్లుకు మద్దు ఇవ్వవలసి ఉంటుంది. మంగళవారం సభకు హాజరైన సభ్యులలో కాంగ్రెస్, దాని మిత్రులైన ఇతర పార్టీల సభ్యులు పూర్తిగా లేకపోవడంతో మూడింట రెండు వంతుల మెజారిటీని యు.పి.ఎ సాధించలేకపోయింది. దానితో తమకు ఆ సమయానికి అంత మద్దతు లేదని ప్రణబ్ ముఖర్జీ తెలియజేయడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోయింది.
యు.పి.ఎ కి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు పాతిక మంది వరకూ మంగళవారం లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొనలేదని ‘ది హిందూ’ తెలిపింది. వీరంతా లోక్ సభ సమావేశానికి హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి తగిన మెజారిటీ చూపలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమికి బి.జె.పిని తప్పు పట్టింది. ఈ బిల్లు ఆమోదానికి బి.జె.పి సహకరించలేదనీ, ఆ పార్టీ సహకరించినట్లయితే బిల్లు ఆమోదం పొంది ఉండేదనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా దుయ్యబట్టింది. లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ విషయంలో బి.జె.పిని తప్పు పట్టాడు. బి.జె.పి సహకరించినట్లయితే లోక్ పాల్ శక్తివంతం కావించడానికి వీలుండేదని ప్రణబ్ ముఖర్జీ ఎత్తి చూపాడు.
రాజ్యాంగ సవరణ బిల్లు లోని మూడు క్లాజులపైన ఓటింగ్ జరగగా అవన్నీ ఓటమి చెందాయి. దానితో స్పీకర్ మీరాకుమార్ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయినట్లుగా ప్రకటించింది. లోక్ పాల్ కి రాజ్యాంగ హోదా కల్పించాలని మొదట ప్రతిపాదించిన రాహుల్ గాంధీ బిల్లు ఓటమితో కలత చెందాడని పత్రికలు రాశాయి. ఎలక్షన్ కమిషన్ లాగా లోక్ పాల్ కి కూడా రాజ్యాంగ హోదా ఉండాలని రాహుల్ గాంధి మొదటిసారి ప్రతిపాదించాడు. రాహుల్ ప్రతిపాదనను లోక్ పాల్ పై ఏర్పాటు చేయబడిన స్టాండింగ్ కమిటీ కూడా సమర్ధించింది. పది గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం లోక్ సభ మూజు వాణి ఓటుతో లోక్ పాల్ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించింది.లోక్ పాల్ బిల్లు తో పాటు విజిల్-బ్లోయర్స్ బిల్లు కూడా మంగళవారం లోక్ సభ ఆమోదం పొందింది. అవినీతి తదితర అక్రమాలను వెల్లడించే వ్యక్తుల రక్షణకు ఈ బిల్లు ఉద్దేశించబడింది.
లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందవలసి ఉంది. అయితే రాజ్య సభలో యు.పి.ఎ కూటమికి మెజారిటీ లేదు. దానితో లోక్ పాల్ బిల్లు ఆమోదం ప్రతిపక్షాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. రాజ్య సభలో ఆమోదం పొందితేనే లోక్ పాల్ బిల్లు చట్టంగా మారే అవకాశం ఉంటుంది. లోక్ పాల్ బిల్లులో మంగళవారం ప్రభుత్వమే అనేక సవరణలు ప్రతిపాదించింది. ఆమోదం పొందిన సవరణలలో ముఖ్యమైనది రక్షణ బలగాలనూ, కోస్ట్ గార్డ్ నూ లోక్ పాల్ పరిధినుండి తొలగించే సవరణ ఒకటి. దానితో పాటు మాజీ ఎం.పిలను లోక్ పరిధిలోకి తెచ్చే కాల పరిమితిని ఐదేళ్లనుండి ఏడేళ్లకు పెంచుతూ మరొక సవరణ ఆమోదం పొందింది.
మొత్తం మీద పార్లమెంటు సభ్యులను లోక్ పాల్ ముట్టుకోకుండా ఉండేలా లోక్ సభ సభ్యులు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. తమ జోలికి రాని లోక్ పాల్ ను ఏర్పాటు చేయడానికి మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు అంగీకరించారన్నమాట! వారిని లోక్ పాల్ పరిధిలోకి తెచ్చినా, మరొక చట్టం పరిధిలోకి తెచ్చినా, వారు భయపడవలసింది వారు అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే. పదవిలో ఉన్న ఎం.పిలను లోక్ పరిధిలోకి తీసుకు రాకుండా లోక్ పాల్ బిల్లు ప్రతిపాదించారు. పదవిలేని ఎం.పిలను లోక్ పాల్ పరిధిలోకి ఐదు సంవత్సరాల వరకూ రాకుండా బిల్లులో ప్రదిపాదిస్తే దాన్ని ఏడు సంవత్సరాలకు పెంచుకున్నారు. ఈ ఏడేళ్లలో వారి అవినీతికి పాల్పడ్డ చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికీ, సాక్ష్యాలన్నీ నిర్మూలించడానికీ తగిన అవకాశం వారు ఏర్పరుచుకున్నారు.
భారత దేశంలో అవినీతికి పాల్పడుతున్నది ప్రధానంగా రాజకీయ నాయకులూ, బ్యూరోక్రట్ అధికారులేనన్నది జగమెరిగిన సత్యం. రాజకీయ నాయకులను వదిలి బ్యూరాక్రట్ అధికారులను లోక్ పరిధిలోకి తెచ్చినా అధికారులను పదవిలో ఉన్న రాజకీయ నాయకులు ఎలాగూ కాపాడుకుంటారు. ఇక అవినీతి సామ్రాట్టులను విచారించే అవకాశం లోక్ పాల్ కి ఏ విధంగా వస్తుందీ అగమ్య గోచరమే. లోక్ పాల్ బిల్లును ఆమోదించడం ద్వారా రాజకీయ నాయకులు తమ అవినీతి నిరాటంకంగా కొనసాగించేందుకు తగిన అవకాశాలను ఏర్పాటు చేసుకున్నారన్నది స్పష్టమవుతోంది. ఇప్పుడు రాజకీయ నాయకుల అవినీతిని లోక్ పాల్ ముట్టుకోదని నిర్ధారణ అయింది కనక వారిక ప్రశాంతంగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవచ్చు. వారికి కావలసింది అదే. తమకు కావలసిన చట్టాన్ని రాజకీయ నాయకులు ఆమోదించుకున్నారే తప్ప దేశానికీ, ప్రజలకూ కావలసిన చట్టాన్ని మాత్రం కాదు.