
అభ్యంతరకర సమాచారాన్ని తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన భారత కోర్టులు అమెరికాకి చెందిన ఐ.టి సంస్ధలకు నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, యాహూ, గూగుల్ లాంటి పందొమ్మిది ఐ.టి సంస్ధలు కోర్టునుండి నోటీసులు అందుకున్న సంస్ధల జాబితాలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన రెండు కోర్టులు మతపరంగా ప్రజలను గాయపరిచేవిగా ఉన్న సమాచారాన్ని వెంటనే తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి.
ఢిల్లీలోని ఒక కోర్టు, శుక్రవారం, పందొమ్మిది సంస్ధలకు సమన్లు జారీ చేసింది. చిన్న పిల్లలకు అసభ్య సమాచారం అందుబాటులో ఉంచుతున్న నేరానికి విచారణను ఎదుర్కోవాలని ఈ సమన్లలో కోర్టు పేర్కొన్నది. కొన్ని బొమ్మలను చూసిన తర్వాత అవి హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను కూడా గాయపరిచేవిగా ఉన్నాయని కోర్టు నిర్ధారించిందని పి.టి.ఐ వార్తా సంస్ధను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
“నిందితులు పరస్పరం మరియు కొద్దిమంది గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి కుట్ర పూరిత సహకారంతో అసభ్యకరమైన, భోగలాలసతను ప్రేరేపించే అంశాలను పంపిణీ చేస్తున్నారు” అని ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుదేష్ కుమార్ పేర్కొన్నాడు. శుక్రవారం తనముందుకు వచ్చిన పిటిషన్ ను విచారిస్తూ మెజిస్ట్రేట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వారంలోనే మరొక కోర్టు, మతపరమైన సెంటిమెంట్లను గాయపరిచే విధంగా ఉన్న ఫొటోలనూ, వీడియోలనూ, పాఠ్యాలనూ తొలగించాలని పేరుపొందిన అమెరికా ఐ.టి సంస్ధలకు ఆదేశాలు జారీ చేసింది.
భారత దేశంలో ప్రస్తుతం పది కోట్ల మంది ఇంటర్ నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరి సంఖ్య రానున్న మూడేళ్లలో ముప్ఫై కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందువలన భారత ఇంటర్ నెట్ మార్కెట్ పైన అమెరికా, యూరప్ లకు చెందిన ఐ.టి సంస్ధలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి. చైనా లో ఇప్పటికే ముప్ఫై కోట్లకు పైగా నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అమెరికా, చైనాల తర్వాత అత్యధిక ఇంటర్ నెట్ వినియోగదారులు ఉన్న దేశం మనదే కావడం గమనార్హం. అయినప్పటికీ ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులు మొత్తం జనాభాలో కేవలం పది శాతం ఉన్నారు.
ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్టు, ఒక ఇస్లామిక స్కాలర్ ఢిల్లీ కోర్టుల్లో ఈ పిటిషన్లను దాఖలు చేశారు. భారత దేశంలో అభ్యంతరకరమైన అంశాలను ఇంటర్నెట్ లో పంపిణీ చేయరాదని చట్టాలున్నప్పటికీ అవి పెద్దగా అమలు కావడం లేదు. ఇలా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ అంశం గురించి పెద్దగా పట్టించుకోవు. ఈ పరిస్ధితిని అవకాశంగా తీసుకున్న గూగుల్, యాహూ, ఫేస్ బుక్ లాంటి సంస్ధలు పోర్నోగ్రఫీని వ్యాపింపజేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. గూగుల్ లాంటి సంస్ధలు పేరుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పినప్పటికీ అవి పేరుకే తప్ప అమలు కావు. ఇలాంటి సందర్భాలలో తమ నియమనిభంధనలకు కట్టుబడి ఉన్నామంటూ ఆర్భాటంగా ఒక ప్రకటన చేసి ఊరుకుంటున్నాయి తప్ప కోర్టులు, ప్రభుత్వాల ఆదేశాలను అవి లెక్క చేయడం లేదు.