నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు


అమెరికాలో నివసించడానికి ఇల్లు లేని పిల్లలు పెరుగుతున్నారని రాయిటర్స్ తెలిపింది. దాదాపు పదహారు లక్షల మంది పిల్లలు ఇలా ఇల్లు లేక హోం లెస్ షెల్టర్లలో, హోటళ్ళలో, కార్లలో, వీధి పక్కనా, సబ్ వేలలో నివసిస్తున్నారని ఓ సంస్ధ చేసిన సర్వేని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఇల్లులేని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మూడేళ్ల క్రితం అమెరికాను చుట్టుముట్టిన మాంద్యం నుండి ప్రభుత్వ బెయిలౌట్లు మేసిన కంపెనీలు బైటపడ్డాయి గాని అక్కడి ప్రజలు మాత్రం ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. ప్రజల ఇళ్ళూ, ఉద్యోగాలూ అన్నీ లాక్కున్న అమెరికా ధనిక సమాజం ఆనక హోం లెస్ షెల్టర్లలో వారిని పెట్టి తమ దాతృత్వం చాటుకుంటోంది.

2 thoughts on “నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు

  1. సంపద అనంతంగా మేట వేసిన చోటనే అనంత దారిద్ర్యం కూడా పోగుపడుతుందని మార్క్స్ 150 ఏళ్ల క్రితమే చెప్పాడు కదా. ఇలలో స్వర్గ ధామంగా కొనియాడబడే అమెరికాలోనే 16 లక్షలమంది పిల్లలు ఇల్లు లేకుండా జీవిస్తున్నారా? వాళ్లకు హోంలెస్ షెలర్లు అనే సౌకర్యం ఒకటి ఉందనే మినహాయింపు తప్పితే ఇండియాకు, అమెరికాకు తేడాలు పెద్దగా ఉన్నట్లు లేదు. కార్లలో, వీధుల పక్కనా, సబ్ వేలలో పిల్లలు, మనుషులు జీవించవలసి రావడం… ఏ దేశానికయినా ఇది తగదు. అధికాదాయాలు, సంపద మెరుపులు, విలాసాలతో మెరుస్తున్న అమెరికాలో చీకటి కోణం కూడా ఇంత తీవ్రంగా ఉంటోందా.. ఈ కోణంలో అమెరికాను ఎవరూ అంచనా వేస్తున్నట్లు లేదు. జీవిక కోసం అమెరికాకు పయనమైన భారతీయులకు ఈ సామాజిక పెను విషాదం గురించి తెలియదేమో.. తెలిసినా మన భారత విద్యాధికుల అవకాశాల ముందు అక్కడి స్వదేశీ జీవితాలే వెలవెలబోతున్నాయేమో.. ఈ 16 లక్షల మంది పిల్లలు రేపు ఏం కానున్నారు?
    బహుశా వీరంతా విస్మృత యాత్రికులే నేమో.. స్వదేశంలో కూడా..

  2. శేఖర్ గారూ,
    అమెరికానుంచి గోదావరి లలిత గారు ఇక్కడి నా వ్యాఖ్య చదివి విలువైన సమాచారం నా మెయిల్‌కి పంపారు. ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యాఖ్య రూపంలో పంపుతున్నాను ఇందులో వ్యక్తిగతానికి సంబంధించిన ఒక్క అక్షరం కూడా లేదు కాబట్టి నాకు నేనుగా స్వతంత్రించి మీకు టపా చేస్తున్నాను.

    లలితగారూ అపార్థం చేసుకోరు కదూ..

    రాజు గారూ,
    అమెరికాలో homeless పిల్లల గురించి మీ వ్యాఖ్య చూశాను. పేదరికం ఇక్కడా ఉంది. paycheck to paycheck బ్రతికే వాళ్ళు ఒక్క చిన్న disability వచ్చినా దిక్కు లేని వాళ్ళైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎంత సంపాదిస్తున్నా ఇక్కడ భద్రత లేనట్టు అనిపిస్తుంటుంది. దూరంగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి డాలర్లలో పైసలు వస్తాయి కదా అనిపిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇన్ష్యూరెన్స్ సమస్యలు ఒకటి. బాగున్న రోజుల్లో జీవన శైలి సంపాదించే దానికి తగ్గట్టు గడుపుకుంటుంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్క సారిగా అప్పులు వెక్కిరిస్తుంటాయి. అలాంటి కారణాలూ ఒక్కో సారి ఉంటాయి. ఐతే ఇక్కడ అటువంటి వారికి ఆశ్రయం కల్పించే వారూ, తిండి సదుపాయాలు అందించే వారూ స్వచ్ఛంద సేవా సంస్థల వారు అటువంటి వారిని ఏ మాత్రం చిన్న చూపు చూడరు. అలా దయనీయమైన పరిస్థితులలో నుంచీ పట్టుదలతో చదువుకుని పైకి వచ్చిన పిల్లలూ ఉన్నారు. తిరిగి మంచి ఉపాధి తెచ్చుకుని పరువుగా స్థిరమైన జీవితానికి తిరిగి రావడమే కాక ఉన్నత స్థాయికి ఎదిగిన పేద వారూ ఉన్నారు. దేశాలు ఏవైనా, ప్రభుత్వాలు ఎటువంటివైనా మనుషుల్లో అన్ని రకాల వారూ అన్ని చోట్లా ఉంటారండీ. దూరపు కొండలు నునుపు, అంతే.

    ఏదో చెప్పాలనిపించి వ్రాశాను.

    Regards,
    లలిత.

వ్యాఖ్యానించండి