పాక్ చెక్‌పోస్టు దాడిపై అమెరికా నివేదికను తిరస్కరించిన పాక్ సైన్యం


నవంబరు చివరి వారంలో ఆఫ్-పాక్ సరిహద్దులో గల పాకిస్ధాన్ చెక్ పోస్టులపై అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది పాక్ సైనికులు చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఉన్నత స్ధాయిలో దర్యాప్తు జరుపుతామని అమెరికా, నాటోలు హామీ ఇచ్చాయి. సదరు దర్యాప్తు నివేదికను అమెరికా పూర్తి చేసింది. ఈ నివేదికను పాకిస్ధాన్ సైన్యం తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. పాక్, అమెరికాలు ఇరువైపులా జరిగిన తప్పుల వలన పాక్ సైనికుల పెద్ద సంఖ్యలో మరణించడానికి దారి తీసిందని నివేదిక తేల్చినట్లుగా తెలుస్తోంది. నివేదికను బహిరంగం కావించనప్పటికీ కొన్ని అంశాలు పత్రికలకు అందాయి. ఏ కారణమూ లేకుండా అమెరికా సైన్యం పాక్ చెక్ పోస్టులపై దాడి చేసిందనీ, ఈ ఘటనకు అమెరికా అపాలజీ చెప్పాలనీ పాక్ డిమాండ్ చేస్తోంది. అమెరికా ఘటన పట్ల విచారం వ్యక్తం చేసినప్పటికీ అపాలజీ విషయం ఇంతవరకూ ఏమీ చెప్పలేదు.

పాక్ సైన్యం ప్రతిస్పందనను బట్టి ఈ నివేదిక వలన, క్షీణించిన పాక్ అమెరికాల సంబంధాలను మెరుగుపరచలేదని స్పష్టం అవుతోంది. పాక్ తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి దర్యాప్తు నివేదిక ఒక సాధనం కాగా, ఆ నివేదికలో పాక్ ని కూడా తప్పు పట్టడం ద్వారా ఆ సాధనాన్ని అమెరికా తిరస్కరించిందని భావించవచ్చు. ఆఫ్ఘన్ యుద్ధంలో పాక్ సహకారం కీలకం అయిన నేపధ్యంలో అమెరికాకి ఇది మరిన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. తమ సైనికులు ఎలాంటి తప్పు చేయలేదనీ, అమెరికా దాడి ఉద్దేశ్య పూర్వకంగా చేసిందేననీ పాక్ సైన్యం గట్టిగా చెబుతోంది.

అమెరికా దాడి అనంతరం పాకిస్ధాన్ తన భూభాగం గుండా ఆఫ్ఘన్ లోని అమెరికా, నాటో బలగాలకు అందే ఆయుధ, ఇంధన, ఆహార సరఫరాలను ఆపేసింది. తన సరిహద్దులను అమెరికా, నాటో సరఫరాలకు మూసివేసింది. అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఎ, తన డ్రోన్ విమానాలను ఆపరేట్ చేయడానికి వినియోగిస్తున షంషీ విమాన స్ధావరాన్ని అమెరికా చేత ఖాళీ చేయించింది. సరఫరా మార్గాలను పాక్ మూసినందున ఇంతవరకూ ఆఫ్ఘనిస్ధాన్ లో ఆపరేషన్లకు ఇబ్బంది కలగలేదనీ, కానీ మూసివేత కొనసాగినట్లయితే ఆ పరిస్ధితి వస్తుందనీ నాటో అధికారులు చెప్పారు. అమెరికా/నాటో జరిపిన దర్యాప్తులో వెలువడ్డ విషయాలను పత్రికల్ళో వస్తున్నదానిని బట్టి చూస్తే అవి పాక్ ఆర్మి వ్యతిరేకిస్తున్నదని గురువారం అర్ధరాత్రి దాటాక శుక్రవారం తెల్లవారు ఝామున విలేఖరులకు పంపిన ప్రకటనలో పాక్ ఆర్మీ పేర్కొంది. నిజాలను పూర్తిగా విచారించకుండా నివేదికను తయారు చేశారని ఆ ప్రకటన పేర్కొన్నది. తమకు నివేదిక అందాక సవివరమైన ప్రతిస్పందన పంపుతామని ఆ ప్రకటనలో ఆర్మీ తెలిపింది.

అమెరికా, నాటో బలగాలపైకి పాకిస్ధాన్ వైపు నుండి కాల్పులు జరిగాకే అత్మ రక్షణ కోసం అమెరికా బలగాలు కాల్పులు జరిపాయని అమెరికా వాదిస్తోంది. సరిహద్దులో కొండలపైన రాళ్ళతో కట్టిన చెక్ పోస్టులు ఉన్న సంగతి అమెరికా బలగాలకు తెలియదని దర్యాప్తు నివేదిక తేల్చింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్స్ అధికారి బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ క్లార్క్, దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించాడు. అయితే ఈ రెండు అంశాలను పాక్ ఆర్మీ వ్యతిరేకిస్తోంది. పాక్ సైనికులు అమెరికా బలగాలపై కాల్పులు జరిపారని చెబుతున్నమాట అవాస్తవమని అది చెబుతోంది. అంతేకాక రెండు చెక్ పోస్టులు ఎక్కడ ఉన్నదీ పటంలో మార్క్ చేసి దానిని అమెరికా బలగాలకు గతంలో అందించామని, కనుక చెక్ పోస్టులు ఉన్నాయని తమకు తెలియదనడం బూటకమని పాక్ సైన్యం చెబుతోంది.

నవంబరు 25-26 తేదిన మధ్య రాత్రి సమయంలో అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ కమెండోలు ఆఫ్ఘనిస్ధాన్ లో ఆపరేషన్లు నిర్వహిస్తున్న సంగతి పాకిస్ధాన్ కి సమాచారం ఇవ్వలేదని నివేదికలొ అంగీకరించారు. ఆ విధంగా నాటో, అమెరికాల దాడుల గురించి ముందే పాకిస్ధాన్ కి సమాచారం ఇచ్చిన సమయంలో మిలట్రీ ఆపరేషన్ల గురించిన సమాచారం లీక్ అయిందని అమెరికా, నాటోలు భావించినందున పాక్ కి ముందస్తు సమాచారం ఇవ్వలేదని నివేదిక తెలిపింది. ఇరు పక్షాల మధ్య నమ్మక కొరవడిందని నివేదిక తెలిపింది. అమెరికా బలగాలు తమవైపు ఎవరు కాల్పులు జరుపుతున్నదీ గుర్తించడంలో విఫలమయ్యారనీ, సరైన మేప్ లు ఉపయోగించకపోవడం, కాల్పులు జరుగుతున్న ప్రాంతాల గురించి తప్పుడు సమాచారాన్ని పాకిస్ధాన్ కి ఇవ్వడం జరిగిందని నివేదిక అంగీకరించింది.

ఈ ఒప్పుకోళ్ళు పాకిస్ధాన్ ఆర్మీకి అనుకూలంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికే ఆర్మీ, అమెరికాకి వ్యతిరేకంగా చాలా దూరం పోయినందున అక్కడినుండి వెనక్కి రావడం తెలికైన విషయం కాదు. అమెరికాకి వ్యతిరేకంగా పాకిస్ధాన్ లో పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్న నేపధ్యంలో ఇది మరింత నిజం. గత ఆదివారమే పాక్ లో దాదాపు ముప్ఫై వేలమంది అమెరికా వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. అమెరికా నివేదికలోని అంశాలను పాక్ ఆర్మీ జనరల్ అష్ఫక్ కయానికి ఫోన్ ద్వారా అమెరికా మిలట్రీ అధికారులు చెప్పారనీ, పూర్తి నివేదిక ఇంకా వారికి ఇవ్వలేదనీ అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా నివేదికపై వ్యాఖ్యానించడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం నిరాకరించింది.

పాకిస్ధాన్ ఆర్మీ ఎన్ని అలకలు సాగించినప్పటికీ అంతిమంగా అది అమెరికా మాట వినడానికే మొగ్గు చూపుతుందన్నది నిష్టుర సత్యం.

వ్యాఖ్యానించండి