దేశంలో ఏ సంస్ధ కూడా రాజ్యంలో మరొక రాజ్యంగా ఉండజాలదని పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ బుధవారం హెచ్చరించాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కుట్రలు జరుగుతున్నాయని గిలానీ ఆందోళన వ్యక్తం చేసాడు. పాక్ ప్రధాని గిలాని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొద్ది వారాల క్రితం అధ్యక్షుడు జర్దారీ, అమెరికా ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కి రాశాడని భావిస్తున్న మెమో లోని అంశాలను ధృవ పరచడం గమనార్హం.
అమెరికా కమెండోల చేత ఒసామా బిన్ లాడెన్ హత్య జరిగాక పాక్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పాక్ ఆర్మి ప్రయత్నిస్తున్నదనీ, అదే జరిగితే అమెరికాయే దాన్ని అడ్డుకోవాలనీ, అందుకు బదులుగా అమెరికా సైన్యం పాకిస్ధాన్ భూభాగంపై యధేచ్ఛగా అమెరికా దురాక్రమణ వ్యతిరేక మిలిటెంట్లను వేటాడడానికి అనుమతి ఇస్తామనీ తాను పంపిన మెమోలో జర్దారీ కోరినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జర్దారీ తిరస్కరించినప్పటికీ, అటువంటి మెమో అందిన విషయాన్ని మైక్ ముల్లెన్ ధృవీకరించాడు.
తాజాగా పాక్ ప్రధాని గిలానీ తన ప్రభుత్వ కూల్చివేతకు కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించడం జర్దారీ రాశాడంటున్న లేఖలోని అంశాలను ధృవపరుస్తున్నాయి. పాకిస్ధాన్ కి ఎన్నికైన ప్రభుత్వం కావాలా లేక నియంతృత్వం కావాలా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాల్సి ఉంటుదని గిలానీ అన్నాడు. “కుట్రలు జరుగుతున్నాయని ఈ రోజు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎన్నికైన ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఈ కుట్రలు జరుగుతున్నాయి” అని పాకిస్ధాన్ జాతిపిత ముహమ్మద్ ఆలీ జిన్నా పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఒక ఫంక్షన్ లో గిలానీ తెలిపాడు. “ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, లేక ప్రజల్లో ఉన్నా మేము పాకిస్ధాన్ ప్రజల హక్కుల కోసం పోరాడతామని నేను వారికి చెప్పదలుచుకున్నాను” అని గిలానీ అన్నాడు. ఎవరు కుట్ర పన్నుతున్నదీ గిలానీ వివరాలు చెప్పలేదు.
‘ఏ ఒక్క సంస్ధ కూడా రాజ్యం లోపల మరొక రాజ్యంగా ఉండజాలదు’ అంటూ గిలానీ పాక్ మిలట్రీని ఉద్దేశించే అన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికీ, సైన్యానికీ పెరుగుతున్న విభేధాలను ఎత్తి చూపిస్తూ గిలానీ ఈ మాటలన్నాడని వారు భావిస్తున్నారు. “తాము ప్రభుత్వం కింద లేమని ఎవరూ చెప్పలేరు. రక్షణ మంత్రిత్వ శాఖతో సహా ఈ దేశానికి చెందిన ప్రతి సంస్ధా ప్రధాని మంత్రికి లోబడే ఉంటుంది. ఎవరూ తాను స్వతంత్రుడననీ భావించడానికి వీల్లేదనీ, ఆ విషయంలో ఎవరికీ అనుమానాలు అనవసరమనీ అంతా గుర్తించాలి… తాను ప్రభుత్వం కింద లేనని ఎవరైనా భావించినట్లయితే వారు పొరబడుతున్నారు” అని గిలానీ ఘాటుగా హెచ్చరించాడు.
“వారు ప్రభుత్వం కిందే ఉన్నారు. ఇక ముందూ ప్రభుత్వం కిందే ఉంటారు కూడా. ఎందుకంటే మేము ప్రజలచేత ఎన్నిక అయ్యాము. మేము పాకిస్ధాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం.” అని గిలానీ సమావేశంలో వ్యాఖ్యానించాడని ‘ది హిందూ’ తెలిపింది. మెమో గేట్ నేపధ్యంలోనే ప్రధాని గిలానీ ఈ వ్యాఖ్యలు చేశాడన్నది సుస్పష్టం. జర్దారీ కూడా గుండె పోటుకి వైద్యం చేయించుకుని దుబాయ్ నుండి పాక్ కి తిరిగి వచ్చాడు. జర్దారీ తిరిగి వచ్చిన మరుసటి రోజే ప్రధాని గిలాని ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ పక్క అమెరికా చేసిన హెలికాప్టర్, జెట్ ఫైటర్ల దాడిలో పాతికమంది పాక్ సైనికులు చనిపోవడంపై అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారనప్పటికీ పాక్ ప్రభుత్వం, సైన్యం ల మధ్య విభేదాలు రచ్చకెక్కడం పాక్ ప్రయోజనాలని దెబ్బతీస్తుంది.
పాక్ అంతర్గత విభేధాలను వినియోగించుకుని, అమెరికా తాను పాల్పడిన నేరానికి బాధ్యత నుండి తప్పించుకోవడానికి అవకాశాలు కూడా లేకపోలేదు. తమకు సహాకరిచినట్లయితే అమెరికా విచ్చలవిడిగా పాక్ భూభాగంపై మిలిటెంట్ల వేటకు అనుమతిస్తామని జర్దారీ బేరం పెట్టడాన్ని బట్టి పాక్ ప్రయోజనాలను కొద్దో గొప్పో పాక్ మిలట్రీయే పరి రక్షిస్తున్నట్లు కనపడుతోంది. తమలో విభేధాలను తామే పరిష్కరించుకోవడం మాని ఆ విభేధాలను అవకాశంగా వినియోగించుకోండంటూ అమెరికాకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న జర్దారీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాధిపతులూ ఏ మేరకు పాక్ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారన్నదీ పలు అనుమానాలు కలుగుతున్నాయి.
పాకిస్ధాన్ కి ఎన్నికైన ప్రభుత్వం కావాలా లేక నియంతృత్వం కావాలా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాల్సి ఉంటుదని గిలానీ అన్నాడు.
It is the right statement know ?
అంతే కదండీ. అయితే ఆ స్టేట్‌మెంట్ రాజకీయ నాయకులకు అలంకార ప్రాయమే గాని ఆచరణియం కాదు. అవతలి పక్షం సైన్యం అయినందున పాక్ ప్రధాని ప్రజాస్వమ్యం, ప్రజలు అనంటున్నాడు గానీ, లేదంటే దేశ భద్రత, రక్షణ, పరువు ప్రతిష్టలు… ఇలాంటివాటిని ప్రస్తావించి ఉండేవాడు.
“తమకు సహాకరిచినట్లయితే అమెరికా విచ్చలవిడిగా పాక్ భూభాగంపై మిలిటెంట్ల వేటకు అనుమతిస్తామని జర్దారీ బేరం పెట్టడాన్ని బట్టి పాక్ ప్రయోజనాలను కొద్దో గొప్పో పాక్ మిలట్రీయే పరి రక్షిస్తున్నట్లు కనపడుతోంది. తమలో విభేధాలను తామే పరిష్కరించుకోవడం మాని ఆ విభేధాలను అవకాశంగా వినియోగించుకోండంటూ అమెరికాకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న జర్దారీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాధిపతులూ ఏ మేరకు పాక్ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారన్నదీ పలు అనుమానాలు కలుగుతున్నాయి.”
You are rocking, Boss ;)