‘నితిన్ గార్గ్’ హంతకుడికి 13 సం.ల శిక్ష వేసిన ఆస్ట్రేలియా కోర్టు


గత సంవత్సరం ఆస్ట్రేలియాలో హత్యకు గురయిన భారతీయుడు ‘నితిన్ గార్గ్’ హంతకుడికి ఆస్ట్రేలియా పదమూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో జాతి వివక్ష ఏమీ లేదని కోర్టు నిర్ధారించింది. కేవలం మొబైల్ ఫోన్ కోసమే ఈ హత్య జరిగినట్లుగా కోర్టు తేల్చివేసింది. హత్య చేసే ఉద్దేశ్యం హంతకుడికి లేదనీ, అసలు తాను కత్తితో నితిన్ గార్గ్ ను పొడిచిందీ లేనిదీ కూడా హంతకుడికి తెలియదనీ, అంతా ఒక నిమిష లోపలే జరిగిపోయిందనీ కోర్టు నిర్ధారించింది.

నితిన్ హంతకుడిని జె.ఎల్.ఇ గా గుర్తిస్తున్నారు. మెల్ బోర్న నగరంలో నితిన్ గార్గ్ ను హత్య చేసినపుడు హంతకుడి వయస్సు కేవలం పదిహేనేళ్ల వయసే అయినందున వయసు రీత్యా మైనర్ అవుతాడనీ, మైనర్ నేరస్ధుల పేర్లు వెల్లడించడం ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం నిషేధమనీ అందువల్ల పూర్తి పేరు వెల్లడించడం సాధ్యం కాదనీ తెలుస్తోంది. ప్రస్తుతం జె.ఎల్.ఇ వయసు పదిహేడేళ్ళు.

2009, 2010 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో పలువురు భారతీయ విద్యార్ధులు హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు వ్యతిరేకంగా భారత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. భారతీయ విద్యార్ధుల హత్యల వెనుక ఆస్ట్రేలియన్ల జాతి వివక్ష ఉందనీ, భారతీయ విద్యార్ధులు ఆస్ట్రేలియా వచ్చి వారి విద్య, ఉపాధి అవకాశాలను కాజేస్తున్నారన్న భావనతో వారు ఈ హత్యలకు పాల్పడుతున్నారని సామాజిక విశ్లేషకులు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేసారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరాకరించింది. ఏవో కొన్ని హత్యల వెనుక జాతి వివక్ష ఉండవచ్చనీ, మెజారిటీ హత్యల వెనుక జాతి వివక్ష లేదనీ కేవలం సాధారణ నేరాలలో భాగంగానే ఆ హత్యలు జరిగాయనీ ఆస్ట్రేలియా ప్రభుత్వం వాదించింది. వరుసగా జరిగిన హత్యల తర్వాత భారతీయ విద్యార్ధులు కొన్ని వేలమంది ఆస్ట్రేలియా చదువులను బహిష్కరించారు. నితిన్ గార్గ్ హత్య, ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య రాయబార సంక్షోభం తలెత్తడానికి దారి తీసింది. హత్యలలో అధికంగా విక్టోరియా రాష్ట్రంలోనే జరిగాయి. విక్టోరియా రాష్ట్రం జాతి వివక్షకు పెట్టింది పేరు కావడం గమనార్హం. విక్టోరియా రాష్ట్రంలో కూడా మెల్ బోర్న్, సిడ్నీ నగరాల్ళో భారతీయ విద్యార్ధుల హత్యలు ఎక్కువగా జరిగాయి.

విక్టోరియా రాష్ట్ర సుప్రీం కోర్టు జడ్జి పాల్ కోఘ్లాన్ నిందితుడికి శిక్ష విధిస్తూ హత్య అవకాశవాదంతో జరిగిందని తెలిపాడు. రాత్రి పూట పని ముగిశాక ఇంటికి వస్తున్న నితిన్ గార్గ్ ను హంతకుడు టార్గెట్ చేశాడని తెలిపాడు. నేరం తీవ్ర స్వభావం కలదే అయినప్పటికీ అది అనుకోకుండా జరిగిందని జడ్జి నిర్ధారించాడు. అతనికి బాధితుడిని కత్తితో పొడిచిందీ లేనిదీ కూడా తెలియదనీ, చంపాలన్న ఉద్దేశ్యం జె.ఎల్.ఇ కి లేనప్పటికీ హత్యా నేరం కింద అతను దోషి అని జడ్జి తేల్చాడు. ఒక హింసాత్మక నేరం జరుగుతున్న క్రమంలో హత్య జరిగినందున అది ‘కన్స్‌స్ట్రక్టివ్ మర్డర్’ అవుతుందనీ జడ్జి తెలిపాడు.

ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ విద్యార్ధి రంగం మూడవ అతి పెద్ద విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించిపెడుతున్న రంగం. బొగ్గు, ఇనుప ఖనిజం తర్వాత విద్యారంగం నుండే ఆ దేశానికి అధిక విదేశీ మారక ద్రవ్య సంపాదన వస్తోంది. ఇందులో భారతీయ విద్యార్ధుల వల్ల గణనీయ భాగం ఆస్ట్రేలియాకు ఆదాయంగా వస్తోంది. గత ఒక్క సంవత్సరమే విద్యారంగ ద్వారా ఆస్ట్రేలియాకు పద్దెనిమిది బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆ దేశానికి సమకూరింది. భారతీయ విద్యార్ధులపై వరుసగా దాడులు, హత్యలు జరిగాక అక్కడికి విద్యార్ధుల రాక గణనీయంగా పడిపోయింది. గత సంవత్సరం ఆస్ట్రేలియాలో అంతార్జాతీయ విద్యార్ధుల సంఖ్య 9.4 శాతం పడిపోయింది.

ఏవో కొన్ని హత్యలు జాతి వివక్ష నేరంతో జరిగాయని ఆస్ట్రేలియా పోలీసులు, ప్రభుత్వం చెప్పినప్పటికీ అలా జరిగిన హత్యలు ఏవో చెప్పడంలో వారు విఫలం అయ్యారు. జాతి వివక్ష వల్ల హత్యకు గురైన కేసుల్లో ఇంకా ఎవరికీ శిక్ష పడలేదు. జాతి వివక్ష కారణం కాని హత్యల విషయాలలో పురోగతి ఉన్నది తప్ప వివక్షత వల్ల జరిగిన హత్య కేసుల విషయంలో పురోగతి కనిపించడం లేదు. ఆస్ట్రేలియాలో జాతి వివక్ష ప్రమాదకరంగా ఉందని ఐక్యరాజ్య సమితి సైతం నివేదిక ఇచ్చిన నేపధ్యంలో భారతీయ విద్యార్ధులు ఆస్ట్రేలియా వెళ్ళకపోవడమే మేలు.

వ్యాఖ్యానించండి