
నవంబరు 26, 2008 తేదీనుండి మూడు రోజుల పాటు ముంబైలోని పలు ప్రదేశాల్లో టెర్రరిస్టులు దాడి చేసి పలువురిని చంపిన నేరానికి, ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ, రాణాలపైన ఛార్జీ షీటు నమోదు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్ధానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హేడ్లీ, పాకిస్ధానీ కెనడియన్ టెర్రరిస్టు తహవ్వూర్ రాణాలతో పాటు లష్కర్-ఎ-తొయిబా వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్ లు ఇండియాలో టెర్రరిస్టు దాడులకు పధకం పన్నినందుకు ఛార్జి షీటు నమోదు చేయడానికి జాతీయ పరిశోధనా సంస్ధ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ) ఉద్యక్తమయ్యింది.
హేడ్లీ, రాణాలతో పాటు నవంబరు 26 న ముంబై టెర్రరిస్టు దాడులకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న జాకి-ఉర్-రెహ్మాన్ లఖ్వి ని ప్రాసిక్యూట్ చేయడానికి భారత హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఆల్ ఖైదా ఆపరేటివ్ ‘ఇల్యాస్ కాశ్మీరీ ని కూడా ప్రాసిక్యూట్ చెయ్యడానికి జాతీయ పరిశోధనా సంస్ధకు అనుమతి మంజూరయ్యింది. ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారులతో పాటు హేడ్లీకి మార్గదర్శకత్వం వహించిన సాజిద్ మాలిక్, అబ్దుల్ రెహ్మాన్ హష్మీ లపైన కూడా ఛార్జి షీటులో అభియోగాలు మోపనున్నారు. ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారుల పేర్లు మేజర్ సమీర్ ఆలి, మేజర్ ఇక్బాల్.
న్యాయ మంత్రిత్వ శాఖ నుండి న్యాయ సలహా పొందిన తర్వాత తొమ్మిది మందిపైన ఛార్జి షీటు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది. భారత దేశంపై యుద్ధం తలపెట్టిన నేరానికీ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధ చట్టం కింద నిందితులపైన నేరాలు మోపుతూ ఛార్జి షీటు నమోదు చేస్తారు. నవంబరు 12, 2009 తేదీన యాభై సంవత్సరాల హేడ్లీపై ఎన్.ఐ.ఎ, ఒక కేసు నమోదు చేసింది. అనంతరం కేంద్ర భద్రతా బలగాల దర్యాప్తులో అనేకమంది భారత్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డారని తేలాక ఇతరుల పేర్లను చేర్చింది.
హేడ్లీ, రాణాలు ఇద్దరూ ఇప్పుడు అమెరికా కస్టడీలో ఉన్నారు. వీరిని విచారించడానికి భారత్, అమెరికాను అనుమతి కోరినప్పటికీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. అమెరికాకి వచ్చి విచారణ చేస్తామని భారత్ కోరినప్పటికీ అనుమతి దొరకలేదు. కాని ఇండియా మాత్రం అమెరికా జరిపే టెర్రరిస్టు వ్యతిరేక పోరాటంలో పూర్తిగా తన పక్షాన పని చేయాలని ఆ దేశం కోరుతుంది. ‘నువ్వు నా పక్షం లేకుంటే టెర్రరిస్టుల పక్షాన ఉన్నట్లే’ అని ప్రపంచ దేశాలను బెదిరిస్తుంది. మళ్ళీ అదే టెర్రరిస్టులతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి లిబియా లాంటి చోట్ల నిస్సిగ్గుగా రెడీ అయిపోతుంది.
అభియోగాలు నమోదు చేసినప్పటికీ హేడ్లీ, రాణాలను విచారించే అవకాశం ఇండియాకు వస్తుందో లేదో తెలియదు. అమెరికా వ్యవహారం చూస్తే అటువంటి అవకాశం ఇండియాకు భవిష్యత్తులో రావడం కూడా అనుమానమేనని అనిపిస్తుంది. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటంలో అమెరికాకి ఇండియా సహకారం ఇవ్వడంతో పాటు అమెరికా కూడా ఇండియాకి సహకారం అందించాల్సి ఉంది. అటువంటి సహకారం అమెరికా ఎందుకు ఇవ్వదో ఇండియా ఆదేశాన్ని ప్రశ్నించాలి. కాని భారత పాలకులు అమెరికాని ప్రశ్నిస్తారని ఆశలు పెట్టుకోలేం.