హోం మంత్రి చిదంబరం కు ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వనున్న బి.జె.పి


కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. లాయరు వృత్తిలో ఉన్నపుడు తన క్లయింటు పై దాఖలైన ఒక హోటల్ యజమానిపైన ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఎత్తివేయాలని చిదంబరం సిఫారసు చేసాడని వెల్లడి కావడంతో చిదంబరం పై విచారణ జరపాలని బి.జె.పి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లోక్ సభ, రాజ్య సభల్లో ప్రతిపక్షాలు ఒక పక్క ఆందోళన చేస్తుండగా చిదంబరం ఆ విషయంపై పార్లమెంటు పత్రికలకు ప్రకటన విడుదల చేయడం ఏంటని బి.జె.పి ప్రశ్నిస్తోంది. ఇది పార్లమెంటును అగౌరవపరచడమేననీ, అందువల్ల సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేయదలిచామనీ బి.జె.పి వర్గాలు తెలిపాయి.

బి.జె.పి అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ అధ్యక్షతన మంగళవారం బి.జె.పి పార్లమెంటరీ పార్టీ సమావేశం అయి ఈ విషయం చర్చింది. హోం మంత్రి పైన పార్లమెంటులో ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వాలని సమావేశం నిర్ణయించిందని ఆ పార్టీ తెలిపింది. లోక్ సభలో బి.జె.పి నాయకురాలు సుష్మ స్వరాజ్, రాజ్య సభలో బి.జె.పి నాయకుడు అరుణ్ జైట్లీ, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. “పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా చిదంబరం పార్లమెంటు బయట మాట్లాడాడు. నోటీసు ఇచ్చిన తర్వాత సభలో మాట్లాడడానికి బదులు ఆయన సభ బయట ప్రకటన ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఇది పార్లమెంటును అగౌరవపరచడమే. ఆయనకు వ్యతిరేకంగా యశ్వంత సిన్‌హా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాడు” అని బి.జె.పి నాయకుడు ఎస్.ఎస్.అహ్లూవాలియా పత్రికలకు తెలిపాడు.

ప్రధాని మన్మోహన్ కూడా చిదంబరంకు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని అహ్లూవాలియా అన్నాడు. రష్యానుండి విమానంలో తిరిగి వస్తూ విమానంలోనే ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మన్మోహన్ చిదంబరం పై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. “ప్రధాని కూడా చిదంబరంకు క్లీన్ చిట్ ఇచ్చాడు. అది సరికాదు. ఏది సరైందీ లేదా సరైంది కాదు అన్నది పార్లమెంటు నిర్ణయిస్తుంది. పార్లమెంటు ముందు అన్ని పత్రాలు ఉంచాలి. సభలో చర్చ జరగాలి. ఆ తర్వాత మాత్రమే పార్లమెంటు ఏది సరైందన్నదీ నిర్ణయిస్తుంది. దానికి ముందుగానే చిదంబరంకు ప్రధాని సర్టిఫికెట్ ఇవ్వడం సరికాదు. అది కూడా పార్లమెంటును అగౌరవపరచడం కిందికి వస్తుంది.” అని అహ్లూవాలియా చెప్పాడు.

“చిదంబరం ప్రకటన అందరికీ అందుబాటులో ఉంది. ఆయన భుజంపైన మోపాలని భావిస్తున్న నేరానికి తాను పాల్పడలేదని చిదంబరం చెబుతున్నారు” అని మన్మోహన్ రష్యానుండి తిరిగి వస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఢిల్లీ లో ని ప్రఖ్యాత హోటల యజమాని పైన ఢిల్లీ ప్రభుత్వం, ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు నమోదు చేసిందనీ, సదరు కేసులు ఎత్తివేయాలని కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరడంతో ఆయనపైన కేసులు ఎత్తివేశారనీ బి.జె.పి ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసులు ఎత్తివేయించడం ద్వార చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని అవి ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు వచ్చాక హోటల్ యజమానిపైన కేసుల ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కేసుల రద్దు విషయం వివాస్పదం అయినందున కేసులు తిరిగి పునరుద్ధరించామని వారు తెలిపారు. దీనితో అక్రమంగా కేసులు ఎత్తివేశారన్నది అర్ధమవుతూనె ఉంది. అయితే ఈ అక్రమానికీ, చిదంబరం కూ సంబంధం ఉన్నదీ లేనిదీ వెల్లడి కావలసి ఉంది.

వ్యాఖ్యానించండి