కిమ్ జోంగ్-ఇల్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం సంపాదించి అణ్వస్త్రాల నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. ఉత్తర కొరియా వద్ద నిజానికి అణ్వస్త్రాలు ఉన్నదీ లేనిదీ అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఉత్తర కొరియా అనేకసార్లు అణ్వస్త్ర పరీక్ష జరపడంతో ఆ దేశం వద్ద అణు బాంబులు ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాయి. ఇరాన్ లాగానే ఉత్తర కొరియాపైన కూడా అణ్వస్త్రాలను సాకుగా చూపుతూ అమెరికా, యూరప్ లు అంతర్జాతీయ ఆంక్షలు విధించాయి. భూ మండలాన్ని అనేక వేల సార్లు భస్మీపటలం చేయగల ఆయుధాలను తమ దగ్గర ఉన్న అమెరికా, యూరప్ దేశాలు తాము తప్ప ప్రపంచంలో మరే ఇతర దేశమూ అణ్వస్త్రం తయారు చేయారదని భావిస్తాయి. వీరి బాధిత దేశాల్లో ఇండియా, పాకిస్ధాన్ కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా, ఇరాన్ లు తమ మాట వినకపోవడంతో ఆ దేశాలపైన అనేక దుష్ప్రచారాలను అమెరికా, యూరప్ ల పత్రికలు ప్రచారంలో పెట్టాయి. కొన్ని వేల అణు బాంబులు తమ వద్ద ఉంచుకుని ఉన్నాయో లేవో తెలియని ఉ.కొరియా, ఇరాన్ బాంబుల వలన ప్రపంచ శాంతికి భద్రతకూ భంగమని అవి ప్రచారం చేస్తాయి. వరుస పెట్టి అరబ్ దేశాలపైన దురాక్రమణ యుద్ధాలు చేస్తూ తమ దేశం దాటి కదలని ఇరాన్, ఉ. కొరియాలను ప్రపంచం పట్ల యుద్ధోన్మాదంతో ఉన్నట్లుగా చిత్రిస్తాయి. అదిగో అటువంటి చిత్రీకరణలో భాగమే ఈ కార్టూన్. ఇది ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక ప్రచురించింది.
–
