మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అక్కడ ‘సేన’ అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తమకు తామే సంస్కృతీ పరిరక్షకులుగా ప్రకటించుకుంటూ ఇరు ‘సేన’ లు, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్), స్కూళ్ళలో అక్రమాలను అరికడతాంటూ బయలుదేరి టీచర్లపై భౌతిక దాడులు చేస్తుండడంతో అవి పాఠశాలల ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా మారాయి. నేరాలు వారే నిర్ధారిస్తూ, శిక్షలు కూడా వారే వేస్తుండడంతో ఉపాధ్యాయులకు పరిస్ధితి దిన దిన గండంగా మారింది. దానితో సేన ల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అగత్యం వారికి తలెత్తింది.
సరిగ్గా ప్రవర్తించడం లేదంటూ ఆరోపించి సేన ల కార్యకర్తలు అనేకమంది టీచర్లనూ, ప్రిన్సిపాళ్లనూ కొట్టడం, గుండు చేయడం లాంటివి చేస్తున్నారు. కొత్త ముంబైలో ఉన్న డి.ఎ.వి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జోస్ కొరియన్ తాజాగా వీళ్ల బారినపడ్డాడు. రాజ్ ధాకరే నేతృత్వంలోని ఎం.ఎన్.ఎస్ ఈయనపైన వీధి న్యాయం అమలు జరిపింది. ఈయన కండిషన్ లో లేని బస్సుల్లో, సరైన భద్రతా చర్యలు లేకుండా విద్యార్ధులను తెస్తున్నాడన్న ఆరోపణ మోపారు. రాజ్ ధాకరే మనుషులు వచ్చి కురియన్ ముఖంపై నల్ల రంగు పూసి చేయి చేసుకున్నారు. తద్వారా తమలాంటి వారి నుండి రక్షణ పొందటానికి తగిన భద్రతా చర్యలను నిజంగానే తీసుకోవాల్సి ఉందని తెలియజెప్పారు.
నవనిర్మాణ్ సేన దాడితో జోస్ కురియన్ భీతి చెందాడు. విద్యార్ధుల ముందు పరువు కోల్పోవలసిన స్ధితిలో ఉండిపోయాడు. మనసును సైతం తీవ్రంగా గాయపరిచే ఈ చర్య స్కూళ్ళలోనూ, ఉపాధ్యాయుల్లోనూ ఆగ్రహావేశాలను రేకెత్తించింది. పూనె, ముంబైల లోని దాదాపు రెండు వందల పాఠశాలలు సేన ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్యం అయ్యాయి. సేనల అరాచకాలనుండి తమకు భద్రత కల్పించాలను రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. వీరి అరాచకాలు టీచర్లను, ప్రిన్సిపాళ్ళనే కాకుండా విద్యార్ధులను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినంత మంది జనం వెంట ఉంటే వారిని వెంటబెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా కొట్టవచ్చనీ, తమకు కావలసిన పనులు చేసుకోవచ్చనీ దురభిప్రాయాలనూ విద్యార్ధుల్లో ఈ ఘటనలు కలుగజేస్తున్నాయని వారు తెలిపారు. అటువంటి సందేశాలు విద్యార్ధుల్లోకి వెళ్తే వారి భవిష్యత్తు పాడవుతుందని వారి ఆందోళన వ్యక్తం చేశారు.
సేనల అరాచకాలకు వ్యతిరేకంగా ఐక్యమయిన పాఠశాలలు తమ డిమాండ్లతో ఒక ఛార్టర్ ను తయారు చేసారు. విద్యా హక్కు కింద తమకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ ప్రధాన డిమాండ్ గా ముందు పెట్టారు. బోధనా సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బైటివారు స్కూళ్ళలోకి జొరబడి విద్యా బోధనకు ఆటంకం కలుగ జెయ్యడాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా చేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా జొరబడడం పై ఉన్న చట్టాలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ ఏజన్సీలు తప్ప పాఠశాలల్లోకి జొరబడకుండా ఉండేలా చట్టాలు తేవాలని కోరుతున్నారు. అనేక దాడులను ఎదుర్కొన్న అనంతరం ఉపాద్యాయులు, పాఠశాలలు ఈ డిమాండ్లను రూపొందించారు.
ఈ నెలలోనే శివ సేన యువజన విభాగం పదో తరగతి విద్యార్ధిని చెంపపై కొట్టాడంటూ ఒక ఉపాధ్యాయుడిని కొట్టారు. గత నవంబరులో ప్రశ్న పత్రం లీక్ అయిందని ఆరోపిస్తూ ఎం.ఎన్.ఎస్ విద్యార్ధి విభాగం ముంబై యూనివర్సిటీ అధికారి ఒకరి ముఖానికి నల్ల రంగు పులిమి అవమానపరిచారు. 2008 లో కింగ్ జార్జి స్కూల్ ప్రిన్సిపాల్ ను కొట్టారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్ధులపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ ఉపాధ్యాయుడిని కాకుండా ప్రిన్సిపాల్ ను కొట్టారు.
తమ ఆందోళనలో తదుపరి చర్యగా సమర్ధవంతమైన చట్టంతో సేన ల అరాచకాలను అడ్డుకోవాలని విద్యామంత్రిని కోరనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సేన ల తో పాటుగా హిందూ సంస్ధలకు చెందిన ఇతర సంస్ధలు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రేమికుల రోజున పార్కులపైన దాడి చేసి వారి కంటబడిన ప్రేమికులకు బలవంతంగా పెళ్ళి చేసిన సంఘటనలు గతంలో జరిగాయి. బెంగుళూరు లో ఒక పబ్ పై దాడి చేసిన సంఘటన కూడా దేశ వ్యాపితంగా ప్రచారం అయ్యింది. భారత దేశ సంస్కృతికి కాపలాదారులుగా వీళ్ళు తమను తాము భావించుకుంటూ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం జరుగుతోంది. సంస్కృతికి సంబంధించిన అంశాలు ఆయా వ్యక్తులు, జన సమూహాల ఇష్టా యిష్టాలకు సంబంధించిన అంశాలనీ, సంస్కృతీ విలువల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా విలువలను కాపాడడానికి ప్రయత్నించాలి తప్ప గూండాయిజంతో ఏ విలువనూ సంరక్షించలేమనీ వీరికి ఎప్పుడు అర్ధం అవుతుంది?
AAMADYA MUSLIMLU KERALA LO OKA PROFESSOR CHEYI NARIKI NATTU GURTU…………..DEENIKI E MANTARU……..
వసంత్ గారూ, గూండాయిజం ఎవరు చేసినా గూండాయిజమే కదండీ. అది ముస్లిం మతం వాళ్ళు చేసినా, హిందూ మతం వాళ్ళు చేసినా లేక మరొక మతం వాళ్ళు చేసినా గూండాయిజం కాకుండా పోదు. మతాన్ని బట్టి గూండాయిజం పవిత్రం అవుతుందా చెప్పండి? నాకు తెలిసి, నేను విన్నంతవరకూ/చదివినంతవరకూ గూండాయిజాన్నీ, పరమతాలని ద్వేషించడాన్నీ ఏ మతమూ ఒప్పుకోదు. అలాగని ఆయా మతం వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు కూడా. ఇక గూండాయిజం విషయంలో మతాల మధ్య పోటీ తేవడం భావ్యమా చెప్పండి?
ముస్లిం మతం పేరుతో అరబ్ దేశాల్లో సనాతన ధర్మాలను అనుసరిస్తూ, సమాజంలో బలహీన తరగతుల వాళ్ళను (స్త్రీలు, పేదలు మొ.వారు) అణచివేస్తూ నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారు. అవే పద్ధతులను మరొక రూపంలో శివసేన, మరొక సేన తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు చేసేదీ ప్రజలకు వ్యతిరేకమే. ప్రజలకు వ్యతిరేకమైన పనులను ఎవరు చేసినా వ్యతిరేకించవలసిందే. అందులో తన, మన తేడాలు ఉండనే కూడదు.