
పాకిస్ధాన్ కి ఐ.ఎస్.ఐ ఉన్నట్లే, ఇండియాకి కూడా ఓ గూఢచార సంస్ధ ఉంది. దాని పేరు ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’. దీన్ని సంక్షిప్తంగా ఆర్.ఎ.డబ్ల్యు లేదా ‘రా’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా పాకిస్ధాన్, చైనా విషయాల్లో చురుకుగా పని చేస్తుంటుంది. దీనికి ఇప్పుడు భారతీయులు చేసే ఫోన్ కాల్స్, ఈ-మెయిళ్ళు, ఇంకా ఇతరేతర డేటా కమ్యూనికేషన్లు అన్నింటినీ దొంగచాటుగా వినే అధికారం చట్టపరంగా దక్కింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది.
ఇప్పటికే ఎనిమిది భారత సంస్ధలకు ఇలా భారత ప్రజల ఫోన్లు, ఈ-మెయిళ్ళు లాంటి సంభాషణలను వినే అధికారం ఉన్నట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఈ ఎనిమిది సంస్ధల పేర్లను ఆ పత్రిక ఇవ్వలేదు. తాజాగా ఈ ఎనిమిదింటికీ భారత విదేశీ గూఢచార సంస్ధ ‘రా’ కూడా జత కలిసింది. దూరంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలన్నింటిపైనా, అవి ఏ రూపంలో ఉన్న మధ్యలోనే చదివడం, వినడం చేయగల అధికారాలు ఈ సంస్ధలకు ఉన్నాయి. అన్ని రకాల ఫోన్ కాల్స్, ఎస్.ఎం.ఎస్, ఎం.ఎం.ఎస్, ఈ-మెయిళ్ళు, సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో జరిగే సంభాషణలు, ఛాటింగ్, ఐ.ఎం ఇత్యాదిగా గల కమ్యూనికేషన్లన్నింటినీ ఈ సంస్ధలు వినడానికి ఇప్పుడు పూర్తి అవకాశాలు ఉన్నాయి.
దేశీయంగా రా పాల్పడుతున్న గూఢచర్యానికి చట్టబద్ధత కల్పించడానికే దానికి ఈ అధికారాలు ఇచ్చారని తెలుస్తోంది. 1967లో ఏర్పడిన ‘రా’ ఈ విధంగా దేశంలోపల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం దక్కడం ఇదే మొదటిసారి. హోం మంత్రిత్వ శాఖ ఇటీవలనే ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. భారత దేశంలోని భద్రతా, ఇంటలిజెన్స్ వర్గాలకు గల సాంకేతిక సామర్ధ్యం గురించి ఇటీవల ‘ది హిందూ’ కొన్ని వ్యాసాలు ప్రచురించింది. ఇండియానుండి విదేశాలకు వెళ్ళే కమ్యూనికేషన్లను కూడా అడ్డుకుని చదివే అధికారం ఇప్పటివరకూ ‘రా’ కు లేదు. సంభాషణలను వినడానికి వీలైన పరికరాలను అంతర్జాతీయ గేట్ వేల వద్ద పెట్టే అధికారం దానికి లేదు. తాజా నోటిఫికేషన్ తో ‘రా’ కు ఈ అధికారాలు లభించాయి.
26/11 దాడుల సందర్భంగా టెర్రరిస్టులకు పాకిస్ధాన్ నుండి ఆదేశాలు జారీ చేసిన సంభాషణలను గూఢచార పరికారాల ద్వారా తెలుసుకోగలిగామనీ, అవి లేనట్లయితే ముంబై దాడులలో పాకిస్ధాన్ పాత్ర ఉందనడానికి అంతర్జాతీయంగా తగిన సాక్ష్యాలు చూపించగలిగేవారం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తమ చర్యను సమర్ధించుకుంటున్నాయి. ఇటువంటి సంభాషణలను వినడానికి ‘రా’ కు అధికారాలు ఇవ్వక తప్పదని వారు చెబుతున్నారు. అయితే ఇలా ఫోన్లను ట్యాప్ చెయ్యడం విషయంలో కేంద్ర ప్రభుత్వంపైన కోర్టు గత సంవత్సరమే మొట్టికాయలు వేసింది. పర్యవసానంగా సంబంధిత మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది కూడా.
దేశంలో ఉన్న ఏ పౌరుడికి చెందిన సంభాషణనైనా మూడు రోజుల పాటు ఫోన్లను ట్యాప్ చేసి పైనుండి అనుమతి అవసరం లేకుండా వినవచ్చని తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఇది చెయ్యవచ్చట. అయితే హోం శాఖ కార్యదర్శి ఆ తర్వాత అందుకు అనుమతి నిరాకరిస్తే గనక అప్పటివరకూ మూడు రోజుల పాటు రికార్డు చేసిన సమాచారాన్ని నలభై ఎనిమిది గంటల లోపల నాశనం చెయ్యవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఏజన్సీలన్నీ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ కింద ఉన్న సంస్ధలు, సి.బి.ఐ లతో పాటు, ఇలా సంభాషణలి వినడానికి కేంద్ర ప్రభుత్వ హోం కార్యదర్శిని అనుమతి కోరవలసి ఉంటుంది. అయితే ఈ వ్యవస్ధ స్వార్ధ కారణాల కోసం వినియోగించబడకుండా అడ్దుకునే వ్యవస్ధ లేదని సీనియర్ అధికారులు అంగీకరించారని ‘ది హిందూ’ తెలిపింది. అమాయకుల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం కొట్టిపారవేయలేమని కూడా వారు చెప్పారు.
ముంబై దాడులను అడ్డు పెట్టుకుని దేశంలోని ప్రజల మధ్య సంభాషణలు వినే అధికారం చేజిక్కించుకోవడం పూర్తిగా ప్రజల ప్రవసీ హక్కులు హరించడం తప్ప మరొకటి కాదు. భారత ప్రభుత్వం అనుసరించే విదేశీ, స్వదేశీ విధానాలు భారత దేశంలో జరుగుతున్న టెర్రరిస్టు దాడులకు ప్రధాన వనరుగా పని చేస్తున్నాయి. ఈ విధానలను సవరించుకోకుండా టెర్రరిస్టులను ప్రధాన ప్రమాదంగా చూపుతూ ఆ పేరుతో దేశ ప్రజల ప్రాధమిక హక్కులను హరించాలని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిని పౌరులంతా వ్యతిరేకించాలి.