‘బ్యాట్ మేన్’ రెక్కలు కత్తిరించిన చైనా పోలీసు గూండాలు


చైనాలో ‘పోలీసులు’ అనబడే గూండాలు ‘బ్యాట్ మేన్’ సినిమా హీరో రెక్కలు కత్తిరించారు. తన తాజా సినిమా ప్రచారం కోసం చైనాలో పర్యటిస్తున్న ‘బ్యాట్ మేన్’ హీరో క్రిస్టియన్ బేల్, ఒక చైనా న్యాయవాద కార్యకర్తను కలవడానికి చేసిన ప్రయత్నాలను స్ధానిక పోలీసులు వమ్ము చేసారు. పోలీసు నిర్భంధం నుండి విడుదలైన కార్యకర్త ఇంటివద్ద ఉన్నప్పటికీ, ఆయనను కలవడం పైన ప్రస్తుతం నిషేధమేమీ లేనప్పటికీ అతన్ని సినిమా స్టార్ కలవడానికి పోలీసులు ఇష్టపడకపోవడం విశేషం.

బేల్ ను సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధ న్యాయవాద కార్యకర్త చెన్ గువాంగ్ హెంగ్ ను కలవడానికి తీసుకెళ్ళింది. ఇటీవలివరకూ జైలులో ఉన్న గువాంగ్ హెన్ ను స్ధానిక అధికారులు ఆయన గ్రామం డాంగ్ షిగు లోనే చట్ట విరుద్ధంగా గృహ నిర్భంధంలో ఉంచారు. ఈ గ్రామం ఈశాన్య రాష్ట్రం షాన్ డాంగ్ లో ఉంది. గువాంగ్ చెంగ్ తనంతట తానే న్యాయవాద వృత్తిని అభ్యసించిన లాయర్. స్ధానిక ప్రభుత్వ కార్యాలయాలపైన దాడి చేసినందుకూ, ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నందుకూ గువాంగ్ ను అరెస్టు చేశామని స్ధానిక ప్రభుత్వం చెబుతుంది. కాని అసలు విషయం వేరే ఉంది. స్ధానిక అధికారుల వల్ల బలవంతంగా గర్భస్రావాలకు గురైన అనేకమంది మహిళల తరపున గువాంగ్ వాదించడంతో అయనకీ ఆ గతి పట్టిందని ఆయన కుటుంబం చెబుతోంది. వాటితో పాటు ఇతర అనేక సున్నితమైన కేసులను స్ధానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వాదించాడని తెలుస్తోంది. ఇంతా చేసి గువాంగ్ చెంగ్ కి కళ్ళు కనపడవు.

గువాంగ్ వల్ల డాంగ్ షిగు  గ్రామం అనేక నెలల పాటు బైటివారి సందర్శనకు అందుబాటులో లేకుండా పోయింది. నిరంతరం పోలిసులు కాపలా కాస్తూ ఆ గ్రామానికి కొత్తవారెవరూ రాకుండా అడ్డుకున్నారు. విలేఖరులు, ఇతర కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. గత కొద్ది నెలల్లో చెన్ గువాంగ్ ను కలవడానికి వెళ్ళిన అనేకమందిపైన సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు దాడి చేశారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. “సాదా దుస్తుల్లో ఉన్న ధగ్గుల నుండి భద్రతాపరమైన ప్రమాదం ఉన్నద”ని గత నవంబర్ లో ‘ది ఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ చైనా” ఒక హెచ్చరిక జారీ చేసింది.

అయితే సినిమా స్టార్ బేల్, డాంగ్ షిగు సందర్శించడానికి సి.ఎన్.ఎన్ టి.వి ఛానెల్ బాధ్యత తీసుకుంది. తాను గువాంగ్ ను కలవాలనుకుంటున్నానని బెల్, సి.ఎన్.ఎన్ ను కలవడంతో ఆ సంస్ధ అందుకు చొరవ తీసుకుంది. సి.ఎన్.ఎన్ టెలివిజన్ సిబ్బందితో కలిసి క్రిస్టియన్ బేల్ డాంగ్ షిగు గ్రామం సమీపిస్తుండగానే గ్రీన్ జాకెట్లలో ఉన్న భద్రతా సిబ్బంది వచ్చి వారిని నెట్టుకుంటూ, తోసుకుంటూ అక్కడి నుండి వెళ్ళగొట్టారు. ఈ దృశ్యాన్ని చూపిస్తూ సి.ఎన్.ఎన్ ఒక వీడియోను ప్రచురించింది. (వీడియోను ఇక్కడ చూడండి)

‘ది ఫ్లవర్ ఆఫ్ వార్’ అనే సినిమా ప్రమోషన్ కోసం బేల్ ప్రస్తుతం చైనాలో ఉన్నాడు. అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత చైనా దర్శకుడు ఝాంగ్ యీమౌ దర్శకత్వం వహించాడు. 1937 లో జపాన్ సైనాలు చైనాలోని నాన్‌జింగ్ పై దాడి చేసి పదుల వేలమందిని ఊచకోత కోయడం ఇతివృత్తంగా ఈ సినిమా నిర్మితమైంది. బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఈ చిత్ర నిర్మాణానికి కొంత ఫైనాన్స్ అందించింది. ఈ సినిమాను ప్రచారం కోసం చైనా ప్రభుత్వం నిర్మించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే సంఘటన జరిగిందే అయినందున, జరిగిన విషయాన్ని సినిమాలో మార్చి చూపిస్తేనో వాస్తవాలను తొక్కిపెడితేనో విమర్శించాలి తప్ప విషయంపై విమర్శ లేకుండా కేవలం ప్రాపగాండ గా విమర్శించడం సరికాదు.

సి.ఎన్.ఎన్ ఛానెల్ పూనుకుని బాధ్యతను నెత్తిన వేసుకోవడం కూడా మీడియా లో విమర్శలు వస్తున్నాయి. సంఘటనలను రిపోర్టు చేయడం కాక తానే ఒక సంఘటనను సృష్టించడం మీడియాకి తగదనీ, జర్నలిస్టుల హద్దులు చెరిగిపోవడం వాంఛనీయం కాదనీ విమర్శలు వచ్చాయి.

ప్రపంచ దేశాల్లో తన రాయబారుల ద్వారా అమెరికా సాగించిన గూఢచర్యం వివరాలను వికీలీక్స్ కి అందించాడని అనుమానిస్తున్న మిలట్రీ ఇంటలిజెన్స్ ఎనలిస్టు బ్రాడ్లీ మేనింగ్ ను అమెరికా ప్రభుత్వం ఇటీవల వరకూ అత్యంత కఠిన నిర్భంధాన్ని విధించింది. సంవత్సరం పైగా ఒక్కడినే సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ లో ఉంచి చిత్ర హింసలు పెట్టింది. ప్రతిరోజూ దుస్తులు పూర్తిగా విప్పి అతన్ని పడుకోబెట్టారు. పూర్తిగా చీకట్లో ఉండే అత్యంత చిన్న గదిలో రోజంతా అతన్ని నిర్బంధించి రోజుకి ఒక్క గంట మాత్రమే అతన్ని బైటికి అనుమతించారు. అతన్ని కలవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వచ్చినా అమెరికా అనుమతించలేదు. కలిసినపుడు ఒంటరిగా మాట్లాడాలని కోరినా అనుమతించలేదు. చివరికి ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమెరికా జైలు అధికారులపైన ఫిర్యాదు చేయవలసి వచ్చింది. ఈ లోపు అతనిని వేరే జైలుకి మార్చి ఆ తర్వాత మాత్రమే బ్రాడ్లీ మేనింగ్ ని కలవడానికి అనుమతించారు.

చైనాలో ప్రభుత్వాధికారుల చేత బలవంతపు గర్భస్రావాలకు గురైన మహిళల తరపున వాదించిన చెన్ గువాంగ్ చెన్ బహుధా అభినందనీయుడు. అందునా కళ్ళు కనపడకపోయినప్పటికీ స్వయంగా న్యాయవాద విద్యను అభ్యసించి మరీ మహిళల తరపున వాదించడం మామాలు విషయం కాదు. అయితే క్రిస్టియన్ బేల్ లాంటి యాక్టర్ కార్యకర్తలకు ఎప్పుడూ చైనా, ఇరాన్, నార్త్ కొరియా లాంటి దేశాల్లో నిర్బంధంలో ఉన్నవారే కనిపించడం ఆక్షేపణీయం. వీరెప్పుడూ బ్రాడ్లీ మేనింగ్ లాంటివారికి గానీ, జులియన్ అస్సాంజ్ లాంటివారికి గానీ సహాయం చెయ్యాలన్న ఆలోచన రాదు. వారిని చూడాలని కూడా అనుకోరు. ఇక సి.ఎన్.ఎన్ లాంటి వార్తా సంస్ధలైతే బ్రాడ్లీ మేనింగ్, జులియన్ అస్సాంజ్ లపైన రాళ్లు వేయడానికో, మరిన్ని అబద్ధాలు రాయడానికో ఇష్టపడతాయి తప్ప వారిని సందర్శించేవారికి సహాయం చేయడం కలలోని మాట.

One thought on “‘బ్యాట్ మేన్’ రెక్కలు కత్తిరించిన చైనా పోలీసు గూండాలు

  1. శేఖర్ గారూ,
    నిష్పాక్షిక కథనం ప్రచురించారు. మనం ఒక విషయాన్ని నిజాయితీగా అంగీకరించాలి.

    పెట్టుబడిదారీ విధానమైనా, సోషలిజమైనా, ఈ రెండింటి కలయిక అని చెప్పుకుంటున్న మిశ్రమ ఆర్థికవ్యవస్థలైనా -ఇది అంతిమంగా కేపిటలిజమే అనుకోండి- తమను వ్యతిరేకించినవారి హక్కులను ఘోరంగా భంగపర్చాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. వర్గశత్రువు, ప్రభుత్వ వ్యతిరేకి, అన్నిటికన్నా మించి మనిషి ప్రాధమిక హక్కుల పరిరక్షణ విషయంలో గడచిన శతాబ్దపు చరిత్ర పొడవునా అన్ని వ్యవస్థలూ తమ ప్రాధమిక నియమాలను తీవ్రంగా ఉల్లంఘించాయనే చెప్పాలి.

    యుద్ధ నేరస్తుల హక్కులకు సంబంధించి జెనీవా డిక్లరేషన్ ను పావు శాతమైనా పాటించిన దేశం ఈ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టండి. -అలాంటిది ఉందా అనేది ఇంకో సందేహం.- గత రెండు వందల ఏళ్లుగా ఉనికిలో ఉన్న బూర్జువా ప్రజాస్వామ్యం యొక్క ప్రాధమిక హక్కులనైనా అధికారంలోకి వచ్చిన వివిధ రకాల వ్యవస్థలు సరిగా పాటించిన దాఖలాలు లేవు. రాజ్య వ్యవస్థ మనిషి హక్కులను తొక్కి పెట్టడంలో కేపిటలిజం, సోషలిజం రెండూ కూడా సమాన ఫాయిదాలో నడిచాయనడంలో మీరు విభేదించరనుకుంటాను.

    రాజ్యం 90శాతం మంది ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోవచ్చు. కాని తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న, దాని అవసరాలకోసం నిర్బంధంలోకి తీసుకున్నపది శాతం వ్యక్తుల -అంటే వ్యతిరేకులూ, వర్గ శత్రువులు- హక్కులను తొక్కివేయడంలో రాజ్యం ఏ రూపంలో ఉన్నా ఒకే విధంగా వ్యహరించడమే మనకాలపు విషాదం. మన కళ్లముందు అన్ని వ్యవస్థలూ తేలిపోయిందీ, ఘోరంగా విఫలమైందీ ఈ కోణంలో నుంచే అని నా ప్రగాఢాభిప్రాయిం. 20వ శతాబ్దంలో కేపటిలిజం, సోషలిజం రెండూ విఫలమయ్యాయని జపాన్ ఆర్తికవేత్త్త పుకయామా 1990లలో చెప్పడం ఈ కోణంలో చాలా సరైనదని నా భావన.

వ్యాఖ్యానించండి