రెండేళ్ళ కనిష్ట స్ధాయికి సెన్సెక్స్ పతనం


బోంబే స్టాక్ ఎక్చేంజి సెన్సెక్స్ సూచి శుక్రవారం రెండున్నర శాతం పతనం అయింది. మొత్తంగా రెండేళ్లలోనే అత్యంత కనిష్ట స్ధాయికి చేరుకుంది. బ్యాంకింగ్, మెటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసిందని విశ్లేషకులు, ట్రేడర్లు విశ్లేషించారని రాయిటర్స్ తెలిపింది. బ్యాంకుల షేర్లు, ఫ్యూచర్లు బాగా పతనం అయ్యాయనీ, ఆర్.బి.ఐ పరపతి విధానం సమీక్షతో నిరుత్సాహపడిన మదుపుదారులు అమ్మకాలకు పాల్పడ్డారని వారు చెబుతున్నారు.

శుక్రవారం రిజర్వ్ బ్యాంకు పరపతి విధానాన్ని లేదా ద్రవ్య విధానాన్ని సమీక్షించింది. ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిగా వృద్ధి చెందుతుండడంతో చురుకు దనం కలిగించడం కోసం మార్కెట్లలోకి డబ్బును ఇంజెక్టు చేయడానికి వీలుగా వడ్దీ రేట్లను ఆర్.బి.ఐ తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. కాని ఆర్.బి.ఐ. బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులేవీ చెయ్యలేదు. పెంచకుండా తగ్గించకుండా అలానే ఉంచింది. తమ అంచనాలు విఫలం కావడంతో మదుపుదారులు అమ్మకాలకు పాల్పడ్డారని విశ్లెషకులు తెలిపారు.

ప్రారంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడింది. ఆర్.బి.ఐ ఆర్ధిక వృద్ధి పై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ వడ్డి రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించకపోవడంతో సెన్సెక్స్ పతనం ప్రారంభమయ్యుంది.  శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి 345.12 పాయింట్లు (2.18 శాతం) నష్టపోయి 15491.35 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబరు 3, 2009 తర్వాత సెన్సెక్స్ ఇంత తక్కువ స్ధాయికి పతనం కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి నిఫ్టీ 92.75 పాయింట్లు పతనమై 4651.60 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్ లోకి లిక్విడిటీ ని చొప్పించడానికి వీలుగా ఆర్.బి.ఐ కేష్ రిజర్వ్ రేషియో (సి.ఆర్.ఆర్) ని తగ్గిస్తారని మదుపుదారులు ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకులు వసూలు చేసే డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్.బి.ఐ వద్ద ఉంచవలసి ఉంటుంది. దానిని సి.ఆర్.ఆర్ అంటారు. దీన్ని తగ్గించినట్లయితే బ్యాంకుల వద్ద మరింత పెట్టుబడి అందుబాటులోకి వస్తుందనీ ఆ విధంగా బ్యాంకుల ద్వారా పెట్టుబడి మార్కెట్ లోకి ప్రవేశిస్తే వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెరుగుతాయనీ మదుపుదారులు భావించారు. అది జరగకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్ లో షేర్లపై అమ్మకాల రూపంలో పడిందని విశ్లేషకుల వివరణ.

ద్రవ్యోల్బణం తగ్గించే పేరుతో ఇప్పటికి పదమూడు సార్లు వడ్డీ రేట్లను ఆర్.బి.ఐ పెంచింది. ద్రవ్యోల్బణం అయితే అదుపులోకి రాలేదు గానీ ప్రజలతో పాటు, పెట్టుబడిదారులకూ, కంపెనీలకు అప్పులు అందుబాటులోకి లేకుండా పోయాయి. దానితో పెట్టుబడులు తగ్గి ఆర్ధిక వృద్ధి నెమ్మదించింది. యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ది నెమ్మదించడం కూడా ప్రభావం చూపు భారత ఆర్ధిక వృద్ధి బాగా పడిపోయింది. ఈ నేపధ్యంలో మార్కెట్ ను చురుకుగా మార్చడానికి ఆర్.బి.ఐ, లిక్విడిటీ (డబ్బు అందుబాటు) పెంచుతుందని ఆశించారు.

వ్యాఖ్యానించండి