131 మందిని చంపేసిన చీప్ లిక్కర్


ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయి రోజులైనా గడవక ముందే పశ్చిమ బెంగాల్ లో మరో ప్రాణాంతక (ప్రమాదం లాంటి) సంఘటనే జరిగింది. చట్ట విరుద్ధంగా తయారు చేసిన చీప్ లిక్కర్ తాగి 131 మంది జనం చనిపోయారు. దక్షిణ 24 పరగణాల జిల్లా లోని సంగ్రామ్ పూర్ గ్రామం చుట్టు పక్కల జరిగిన ఈ ఘటనలో ఇంకా అనేకమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం రాత్రి చీప్ లిక్కర్ సేవించిగా బుధవారం తెల్లవారు ఝాము 2 గంటలనుండీ ఆసుపత్రులకి రావడం ప్రారంభమయిందని తెలుస్తోంది.

కనీసం మరో యాభై మంది ఆసుపత్రులలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. కొందరు కోల్‌కతా ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. చనిపోయినవారి సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సి.ఐ.డి విచారణకు ఆదేశించింది. అక్రమంగా తయారు చేసిన మద్యం సరఫరా చేసినందుకు ఏడుగురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. విషపూరితమైన మద్యం సరఫరా చేసిన మరో వ్యక్తి ‘నూర్ ఇస్లాం ఫకీర్’ కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఈయన్ని ఖోరా బాద్షా అని కూడా పిలుస్తారని వారు చెప్పారు.

చనిపోయినవారిలో అత్యధికులు రోజువారీ కూలీలు, రిక్షా డ్రైవర్లు, బండి లాగుడు కూలీలు అని తెలుస్తోంది. అనేక అక్రమ షాపుల నుండి విషపూరితమైన మద్యాన్ని ప్రజలు కొనుగొలు చేసి సేవించారు. తాగిన కొద్ది గంటలకే కడుపు నొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి లతో ఆసుపత్రులకు వచ్చారని డాక్టర్లు తెలిపారు. చనిపోయినవారిని పోస్టుమార్టం చేయడం ద్వారా చావుకి కారణం ఊపిరి సమస్యలు, గుండె ఆగిపోవడం అని తెలిసిందని డాక్టర్ల సమాచారం. బాధితులు కార్డియో-రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వలన చనిపోయారని ఒక డాక్టర్ ను ఉటంకిస్తూ ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. ఐతే జిల్లా అధికారులు మరణ కారణాన్ని ఇంకా గుర్తించవలసి ఉంది.

సంఘటన జరిగాక గ్రామస్ధులు లిక్కర్ తయారీ యూనిట్ ను అక్రమ షాపులను నాశనం చేసారు. అక్రమ లిక్కర్ అమ్మకాలను అడ్డుకోవడానికి తీవ్ర చర్యలు తీసుకోవడానికే తాను మొగ్గు చూపుతానని ముఖ్యమంత్రి మమత చెప్పింది. “అక్రమ మద్యం వ్యాపారం రాష్ట్రంలో చాలాకాలం నుండి కొనసాగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొందరినుండి ప్రతిఘటన ఎదురవుతోంది” అని మమత పేర్కొంది. ఆమె సి.పి.యం ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు. ప్రజలు మద్యం తాగడానికి తాను వ్యతిరేకిననీ కానీ ప్రజలు పండ్ల రసం తాగాలో లేక మద్యం తాగాలో ప్రజలకు వివరించడం పైన కూడా నాకు నమ్మకం లేదని కూడా మమత చెప్పిందని వార్తా పత్రికలు తెలిపాయి. మద్యం అమ్మకాలను నిషేధించే దమ్ము తనకి లేదని మమత పరోక్షంగా చెప్పదలుచుకుందన్నది స్పష్టమే.

మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది.

4 thoughts on “131 మందిని చంపేసిన చీప్ లిక్కర్

  1. అక్రమ మద్యం అన్న మాట నాకు యెన్నడూ నచ్చదు. అక్రమ మద్యం కాక సక్రమ మద్యం అంటూ యెలా ఉంటుంది?
    ఏ మద్యం అయినా ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసేదే. ప్రాణం తీసేదే.
    విషమే.

    నా చిన్నప్పుడే చదివాను. గాంధీగారు అన్నారట. మద్యపానాన్ని నషేధించని ప్రభుత్వాన్ని గౌరవించను అనో అలాంటిదో ఒక మాట.
    గాంధీగారి వారసులు నడిపించే ప్రభుత్వాలు మద్యపానం మీద సొమ్ములు గడించి ప్రజోపయోగకార్యక్రమాలు నడిపిస్తున్నాయట!
    ఇంతక్నా హైన్యం ఉందా? ఏం చెప్పాలి?

  2. “మద్యం అమ్మకాలను నిషేధించే దమ్ము తనకి లేదని మమత పరోక్షంగా చెప్పదలుచుకుందన్నది స్పష్టమే.”
    కిషన్‌జీలను, మావోయిస్టులను చంపడానికి మాత్రం ఎక్కడలేని దమ్ము పొడుచుకుని వస్తుందనుకుంటాను. ఇది తప్ప ఇంకేం చేయడానికి కూడా దమ్ము ఉండదేమో మరి.

  3. సారా వ్యాపారుల దగ్గర ఆయుధాలు ఉండవు. వాళ్ళు ఊరి చివర బట్టీలు ఏర్పాటు చేసుకుని సారా తయారీ చేస్తారు. వాళ్ళని పట్టుకోవడం చేతకాదు కానీ పురూలియా లాంటి కొండ ప్రాంతాలలో మావోయిస్టులని కాల్చి చంపడం మాత్రం చేతనవుతుందట.

వ్యాఖ్యానించండి