
ఇండియా, చైనా. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి రెండు స్ధానాల్లో ఉన్న దేశాలు ఇవి. ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ లుగా ప్రపంచ ఆర్ధిక పండితులచేత ప్రశంసలు అందుకుంటున్న దేశాలు. కాని ఈ రెండు దేశాలు తమ ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసి, వారి వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టిమరీ ఆర్ధిక వృద్ధిని సాధిస్తున్నాయన్నది ఆ దేశాల ప్రజలకు మాత్రమే తెలిసిన సత్యం.
భారత దేశంలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన ఒడిషా గ్రామాలు మొదలుకొని వేలాది ‘స్పెషల్ ఎకనమిక్ జోన్’ లు, ఆంధ్ర ప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మార్చే వాన్ పిక్, సోంపేట కనపర్తి ధర్మల్ ఫ్యాక్టరీలు, నియంగిరి మొదలైన ప్రాంతాల్లో ప్రజలనుండి బలవంతంగా భూములు లాక్కున ప్రభుత్వం, కంపెనీలు వారికి సరైన నష్టపరిహారం ఇంతవరకూ ఇవ్వలేదు. వారి జీవనోపాధి పోగొట్టడమే కాక, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు గుప్పించి తమ పని పూర్తయ్యాక మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి బదులు కంపెనీల కొమ్ము కాస్తూ ప్రజలను వారి ఊళ్ళనుండి వెళ్లగొట్టడానికి యధాశక్తి సహకరిస్తున్నాయి.
ఇలాంటిదే చైనాలో జరిగిన ఓ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. దక్షిణ చైనాలోని గువాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ని వూకాన్ గ్రామస్ధులు తమ భూముల్ని లాక్కొని నష్టపరిహారాన్ని ఇవ్వనందుకు ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. నిరసనకు నాయకత్వం వహిస్తున్న గ్రామస్ధుల ప్రతినిధిని అరెస్టు చేసి మూడు రోజుల తర్వాత అతన్ని శవంగా మార్చడంతో గ్రామ ప్రజలు అగ్రహోదగ్రులై తీవ్రంగా ఉద్యమిస్తున్నారు. తమ గ్రామంలో పోలీసులను, బైటవారిని అడుగుపెట్టనివ్వకుండా కాపలా కాస్తూ తమ భూముల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
చాలా సంవత్సరాలుగా తమ గ్రామంలో భూముల్ని ఒక్కొటొక్కటిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ సరైన నష్టపరిహారం చెల్లించలేదని గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గత సెప్టెంబరు నెలలో గ్రామస్ధులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తమ వద్దనుండి ‘అభివృద్ధి కోసం’ అని చెప్పి వశం చేసుకున్న భూమి చుట్టూ కట్టిన గోడను కూల్చివేసారు. ప్రభుత్వ కార్యాలయాలపైన దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికి వూరుకున్న ప్రభుత్వం గత వారం గ్రామ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ‘క్సూ జిన్‌బో’ నూ, ఇంకా మరికొందరినీ అరెస్టు చేసింది. వారు నేరస్ధులనీ, అనుమానితులనీ చెప్పి నిర్బంధించారు.
ఇంతలోనే సోమవారం ‘క్సూ జిన్‌బో’ హఠాత్తుగా జబ్బు పాలయ్యి చనిపోయాడని అధికారులు ప్రకటించారు. జిన్ బో ను అర్జెంటుగా ఆసుపత్రికి తరలించామనీ కాని డాక్టర్లు అతన్ని కాపాడలేకపోయారనీ వూకాన్ గ్రామాన్ని పర్యవేక్షించే లూఫెంగ్ నగర ప్రభుత్వం గ్రామ ప్రజలకు చెప్పింది. దీనితో ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. ప్రజలు ఒక పక్క, అధికారులు, పోలీసులు ఒక పక్క మొహరించి ఉండగా గ్రామం వద్ద యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు గ్రామంలోకి ఇతరులు ప్రవేశించకుండా అక్కడికి దారి తీసే రోడ్డును నిర్బంధించారు. పోలీసులను గ్రామంలోకి రాకుండా గ్రామస్ధులు అడ్డుకుంటున్నారు. కొన్ని వందలమంది గ్రామస్ధులు దఫ దఫాలుగా ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తున్నారు.
గుండె సమస్యలతో జిన్ బో చనిపోయాడని నగర ప్రభుత్వం ప్రకటించింది. మరణానికి ఇతర కారణాలేవీ లేవని భుజాలు తడుముకుంది. జిన్ బో ను పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలను వైద్య పరిశీలకులు ఖండించారని ప్రభుత్వం చెప్పినట్లుగా జిన్ హువా వార్తా సంస్ధ తెలిపింది. ముంజేయి, మోకాలి వద్ద గాయాలున్నాయని అవి సంకెళ్లవల్ల, మోకాళ్ళపై కూర్చోవడం వల్ల అయిన గాయాలని వైద్యులు చెప్పినట్లుగా ఆ సంస్ధ తెలిపింది. కాని అధికారులు గ్రామస్ధులకు చనిపోయిన వ్యక్తి మృత దేహాన్ని ఇంతవరకూ ఇవ్వలేదు. ఆశ్చర్యంగా మృతదేహాన్ని వారికి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్ధులు చెప్పారని బిబిసి తెలిపింది.
స్ధానిక కమ్యూనిస్టు పార్టీ మాత్రం భూ ఆక్రమణని గాలికొదిలి నిరసన విరమించాలని ప్రజలను కోరుతోంది. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ జిన్ హువా లొ స్ధానిక కమ్యూనిస్టు పార్టీ నాయకుడి చేత ఒక వ్యాసం రాయించారు. అల్లర్లు మానేయాలని ఆ వ్యాసంలో కోరారు. అయితే తమ భూమి తమకు దక్కడం గానీ, సరైన నష్టపరిహారం దక్కడం గానీ ఏదో ఒకటి జరిగే వరకూ పోరాడాలని గ్రామస్ధులు నిర్ణయించుకున్నారు. చైనాలో ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా ఆ వార్తలు బైటికి పొక్కకుండా చైనా ప్రభుత్వం అడ్డుకుంటుంది.