చైనా, ఇండియాపై దాడి చేస్తుందని ప్రభుత్వం భావించడం లేదు -ప్రధాని


భారత దేశంపై దాడి చేయడానికి చైనా పధకం వేస్తోందన్న వాదనను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం చెప్పాడు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఇరు దేశాల అభిప్రాయం అని ఆయన అన్నాడు. ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఇండియా, చైనా సరిహద్దులు మొత్తం మీద ప్రశాంతంగానే ఉన్నాయని లోక్ సభ సభ్యులకు తెలిపాడని ‘ది హిందూ’ తెలిపింది.

“చైనా, ఇండియాపై దాడి చేయడానికి పధకం వేస్తోందన్న భావనను ఇండియా అంగీకరించడం లేదు” అని మన్మోహన్ లోక్ సభలో చెప్పాడు. లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు లేవనెత్తిన ప్రస్తావనకు మన్మోహన్ సమాధానం ఇస్తూ ఈ విషయం చెప్పాడు. ఇండియాపై దాడి చేయడానికి చైనా ఏర్పాట్లు చేసుకున్నదన్న సమాచారం తనవద్ద ఉన్నదని సమాజ్ వాదీ పార్టీ అధిపతి ములాయం సింగ్ యాదవ్ లోక్ సభలో ప్రస్తావించాడు. సరిహద్దులో దాడి చేయడానికి వీలుగా కొన్ని ప్రాంతాలను చైనా ఎంచుకున్నదని కూడా తనవద్ద సమాచారం ఉన్నదనీ, దాడులు అనివార్యమనీ ములాయం అన్నాడు.

చైనాలోని ఉన్నత స్ధాయి వర్గాలనుండి తాము బ్రహ్మపుత్ర నది నీటిని ఇండియాకి రాకుండా అడ్డుకోవడం లేదన్న హామీ లభించిందని మన్మోహన్ సభకు తెలిపాడు. భారత దేశం తన భూభాగంలో భాగంగా యెంచే ప్రాంతాలలోకి చైనా చొచ్చుకుని వచ్చిందన్న విషయాన్ని ప్రధాని అంగీకరించాడు. అయితే, ఈ వాదనను చైనా అంగీకరించడం లేదు. “ఈ విషయాలను ఇరు దేశాలకు చెందిన ఏరియా కమేండర్లు పరిష్కరించారు” అని ప్రధాని చెప్పాడు.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న విధానాన్ని ఇండియా అనుసరిస్తున్నదని ప్రధాని అన్నాడు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించాలన్న్ విధానంతో ఇండియా ఉన్నదని చెప్పాడు. గత ఎన్.డి.ఎ ప్రభుత్వం కూడా ఇదే విధానాలను కొనసాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. సరిహద్దు సమస్యలపైన చైనా, ఇండియాలు తమ ప్రతినిధుల మధ్య చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు నిమగ్నమై ఉన్నాయి. 2005, ఆ తర్వాత కొద్ది కాలం చర్చలలో పురోగతి కనిపించిందనీ, ఆ తర్వాత పెద్దగా పురోగతి లేదని ప్రధాని సభకు వివరించాడు.

గ్రామాలలో ఇరుగు పొరుగు వాళ్ళతో తగాదాలు పెట్టుకొంటేనో లేదా పక్కింటి వాళ్ళతో పెద్దగా మాట్లాడకుండా రిజర్వుడ్ అటువంటి వారికి ‘ఇరుగు పొరుగు లేదని’ అంటుంటారు. ఈ సూత్రం దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడమే ఏ దేశానికైనా కావలసింది. అలా కాక ఆధిపత్య ధోరణితోనో, పెద్దన్న వైఖరితోనో, విస్తరణవాద కాంక్షతోనో పెత్తందారీ ధోరణి కలిగి ఉన్నట్లయితే అవి ఇరుగు పొరుగు కోల్పోవలసి వస్తుంది. ఈ సూత్రం ఇండియా, చైనాలు ఇరు దేశాలకూ వర్తిస్తుంది.

12 thoughts on “చైనా, ఇండియాపై దాడి చేస్తుందని ప్రభుత్వం భావించడం లేదు -ప్రధాని

  1. భారత దేశంపై దాడి చేయడానికి చైనా పధకం వేస్తోందన్న వాదనను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం చెప్పారు.
    బాగుంది. 1962: అప్పట్లో చైనాలో భారత రాయబారి సర్దార్ పనిక్కర్ హెచ్చరికలు పట్టించుకోకుండా నెహ్రూ కూడా ఇలాగే మాట్లాడారు. ఫలితం అందరికీ తెలిసిందే.

  2. క్షమించాలి. నా వ్యాఖ్యకొక జ్ఞాపకం తాలూకు నేపధ్యం ఉంది. చాలా చాలా కాలం క్రిందట శ్రీమతి మాలతీ చందూరు గారు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ‘జవాబులు’ అనే శీర్షిక నిర్వహించేవారు. చదువరుల ప్రశ్నలకు రకరకాలకోణాల్లోంచి సమాధానాలు ఇచ్చేవారు. పాఠకుల ప్రశ్నలకన్నా ఆవిడ జవాబులే యెక్కువ ఆకట్టుకొనేవని వేరే చెప్పనవసరంలేదు. ఆవిడ జవాబుల్లోనాకు గుర్తు ఉన్న జవాబులజలో ఇది ఒకటి. పణిక్కర్ గారి హెచ్చరికలను నెహ్రూగారు అప్పటి చైనా ప్రధాని చౌ-ఎన్-లై మీద గల అతి నమ్మకంతో పట్టించుకోలేదని. దాని చేదు పర్యవసానం నెహ్రూగారి మనఃస్థితిపైనా తదుపరి ఆయన ఆరోగ్యంపైనా తీవ్రప్రభావంచూపిందనీ, అదే ఆయనకు మృత్యుద్వారం అయిందనీ ఆ జవాబు సారాంశం. దాన్ని ఉటంకించానంతే. పణిక్కర్ గారి ప్రసక్తి అక్కడినుండి యీ వ్యాఖ్యలోకి వచ్చింది. మీకు గుర్తుందో లేదో గాని 1962లో చైనా చేసిన దాడి నాకు ఇంకా బాగా గుర్తు. అప్పట్లో చైనా ప్రధానిగారికి ‘చౌ అండ్ లై’ అని ముద్దుపేరు రావటం నాకు గుర్తే. నాకు రాజకీయమైన అవగాహనలేవీ పదేళ్ళవయసులో లేవుగాని, చైనా దండయాత్రని ఖండిస్తూ ఒక వ్యాసం రాసి మా ఉపాధ్యాయులకు అందించిన విషయం గుర్తుంది. ఆ తరువాతి కాలంలో కొన్ని భారతీయ కమ్యూనిష్టు వర్గాలు బారతదేశమే చైనామీద దండయాత్రచేసిందని ప్రచారం చేశాయని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను కూడా. ఇటువంటి జ్ఞాపకం నేపధ్యంలో, ఇప్పటి ప్రధానిగూడా అదే పాతపాటను అందిపుచ్చుకుని పాడుతఉన్నారంటే గాయం రేగింది. కాని చైనా మనమీద మరొక దండయాత్ర చేసే ఉద్దేశంలో ఉందా లేదా అన్న విషయాన్ని నేను అధ్యయనం చేయలేదు కాబట్టి ఆవిషయంలో యేమీ వ్యాఖ్యానించలేను ప్రస్తుతానికి. అయితే, భారతదేశానికి యెన్నడూ గూడా, ఆ చైనా దేశం నమ్మదగిన మిత్రదేశంగా అటుంచి కనీస మిత్రవైఖరి ప్రదర్శించే దేశంగా కూడా లేదని నా నమ్మకం. నాతో యేకీభవించమని యెవరినీ మొగమాట పట్టటంలేదు. మన కళ్ళ ముందు జరిగిన చరిత్రయే అయినా మనలో యెవరికివారు తమతమ విచక్షణాజ్ఞాననేత్రాలతో ఒకే రకంగా చూసి అర్ధం చేసుకుంటారని ఆశించలేను కదా. నా అభిప్రాయం నేను చెప్పాను. ఈ విషయంలో చరిత్ర పునరావృతం కావాలని నా ఆకాంక్షకాదు. యెవరైనా అలా వ్యాఖ్యానిస్తున్నారో, కోరుకుంటున్నారో నాకు తెలియదు కూడా.

  3. శ్యామలరావు గారూ, నేను వేరే పని నిమిత్తం బైటికి వెళ్ళాను. అందువల్ల మీ వ్యాఖ్య ప్రచురణ ఆలస్యం అయింది.

    నెహ్రూ మరణానికీ భారత్-చైనా యుద్ధానికీ సంబంధం ఉందన్న సంగతి మీ ద్వారానే మొదటిసారిగా విన్నాను.

    అప్పటికీ ఇప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. చైనా సోషలిస్టు/కమ్యూనిస్టు దేశంగా ఇప్పుడు లేదు. అమెరికా-చైనా సంబంధాలు పెరిగాయి. ఇండియా-చైనా సంబంధాలు కూడా బాగా మెరుగుపడ్డాయి. దాడి చేయడానికి అప్పుడున్న కారణాలు ఇప్పుడు లేవు. కనుక మారిన పరిస్ధితుల్లో చైనా ఇండియాపై దాడి చేయడానికి సిద్ధపడకపోవచ్చు.

  4. Even if PM suspects that China wants to trouble India, do you really think PM is so naive to say it openly and firmly shoots himself in the foot !? I am surprised that you guys are giving importance to an otherwise a pretty standard diplomatic rhetoric.

  5. పావని గారూ, మీరన్నది కరెక్ట్. ప్రధాని వ్యాఖ్య డిప్లొమసీకి సంబంధించినది. కాని దానికి ప్రాముఖ్యం లేదనడం కరెక్ట్ కాదు. డిప్లొమసీ కోసం ‘చైనా దాడి’ అంశాన్నే ఎందుకు ఎంచుకోవాలి. పాజిటివ్ అంశాలనే ప్రస్తావించవచ్చు. ములాయం సింగ్ యాదవ్ చైనా దాడి అనివార్యం అన్నందుకు ప్రధాని స్పందించాడు. సింపుల్ గా పరిశీలిస్తాం అని చెప్పి ఊరుకోవచ్చు. ప్రస్తుతానికి డిప్లొమసీ లో భాగంగానే ఉన్నా, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఆ వ్యాఖ్య ఒక మెట్టుగా ఉంటుంది. ప్రధాని వ్యాఖ్యని పట్టించుకోవడం కూడా అలా అది మెట్టుగా ఉపయోగపడుతుందని చెబుతూ, భారత చైనా సంబంధాలలో ఒక మెట్టు నిర్మితమైంది అని చెప్పడానికే.

    నెహ్రూ విషయం కూడా అంతే. డిప్లొమేటిక్ చర్యల్లో భాగంగా ఫణిక్కర్ హెచ్చరికల్ని బహిరంగంగా నెహ్రూ ఆమోదించలేదు. ఫణిక్కర్ హెచ్చరిక, నెహ్రూ తిరస్కరణ రెండూ ఒకే ఎత్తుగడలో భాగంగానే చూడాలి తప్ప దానిని ఫణిక్కర్, నెహ్రూల మధ్య విభేధాలు గా చూడడం సరైంది కాదు. చైనా-ఇండియాల మధ్య ఘర్షణని ఊహించలేనంత అమాయకత్వంలో నెహ్రూ ఉంటాడని భావించడం మన అమాయకత్వం కావచ్చు. పైగా చైనా దాడి వల్లనే నెహ్రూ జబ్బున పడ్డాడని మాలతీ గారు వ్యాఖ్యానించడం మరింత ఆశ్చర్యకరం. దేశాధినేత స్పందనలు అంత ఛీప్ గా ఉంటాయని ఎలా భావించగలం?

  6. శ్రీమతి మాలతీ చందూర్ (80) గారు ఆంధ్రదేశంలో పేరెన్నిక గన్న ప్రసిధ్ధ విదుషీమణి. ఆవిడెప్పుడో ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబును నేను ప్రస్తావించానంతే.
    1895లో జన్మించిన శ్రీ కె.ఎమ్.పణిక్కర్. 1963 డిసెంబరులోనే చనిపోయారు. ఆయన 1948–52 మధ్యకాలంలో చైనాలో భారతరాయబారిగా పనిచేసారు. ఆయన పేరు నేను విన్నది శ్రీమతి మా.చందూరుగారి జవాబులోనే. ఆతరువాత విన్న గుర్తుకూడా లేదు. కాబట్టి నేను పొరబడలేదనే అనుకుంటున్నాను. అయినా సంశయలభ్ధి ఆవిడకే యిద్దాం. నెహ్రూ అమాయకుడా అని కాదు. దండయాత్రకు ముందుగా తెలివిగా చైనావారు భారత్ లో చేసిన సుహృద్భావయాత్ర గుర్తుందా? అందుకే ఆయన మనస్సు వికలం అయందేమో. నెహ్రూ సున్నిత మనస్కుడు, భావనాప్రపంచంలో విహరించే వాడూనని తెలుసుగదా!

  7. నెహ్రూ సున్నిత మనస్కుడు అయ్యే అవకాశమే లేదు. తెలంగాణలో నైజాం నిరంకుశ పాలనకీ, రజాకార్ల అకృత్యాలకీ వ్యతిరేకంగా ప్రజలు సాయుధ పోరాటం చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని భూస్వాములనుండి స్వాధీనం చేసుకుని అనుభవించడం ప్రారంభించారు. నిజాంని పారద్రోలే పేరుతో నెహ్రూ-పటేల్ ద్వయం భారత సైన్యాన్ని దించి తెలంగాణలో కమ్యూనిస్టుల్ని ఊచకోత కోసింది. ముఖ్యంగా రైతాంగం అనుభవిస్తున్న లక్షల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుని భూస్వాములకి తిరిగి ఇచ్చేసింది నెహ్రూ ప్రభుత్వం. నిజాం ని సకల మర్యాదలతో సాగనంపడమే కాక అతనికి నష్టపరిహారం పేరుతో కోట్లకొద్దీ ఆస్తుల్ని కట్టబెట్టింది నెహ్రూ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం. కమ్యూనిస్టుల్ని ఊచకోత కోశారు సరే, రైతులు అనుభవిస్తున్న భూముల్ని లాక్కొని మళ్ళీ భూస్వాములకు అప్పజెప్పాల్సిన అవసరం సున్నిత మనస్కుడైన నెహ్రూకి ఎందుకు వచ్చింది? మూడు వేల గ్రామాల్లో రైతుల భవిష్యత్తుని నెహ్రూ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. భూస్వాముల భల్లూకపు పట్టునుండి తమను తాము విముక్తం చేసుకున్న రైతులను మళ్లీ అదే భూస్వాముల ఆధీనంలోకి నెట్టివేశారు. సున్నిత మనస్కులు చేసే పనా ఇది?

  8. ఒప్పు కుంటున్నానిండీ శేఖరు గారూ. నెహ్రూ సున్నిత మనస్కుడు కాదు.
    కాని అలా ఆయనకు ఆరోజుల్లో ప్రచారం లభించిందేమో. నాకు సరిగా తెలియదు,
    నా చిన్నతనంలో, మాయింట్లో నెహ్రూగారి ఫోటో ఒకటి ఉండేది. నేను అది చూసి కాగితంమీద నకలు గియ్యటానికి ప్రయత్నం చేయటం నాకింకా గుర్తుంది.
    ఒకరకమైన ఆరాధనా భావం ఉందేమో! నెహ్రూగారి నిర్యాణం నాటికి వయస్సు అప్పటికి 13లోపే.
    అయితే త్వరలోనే ఆయనంటే నాకూ, నామిత్రులు కొంతమందికి విరక్తి కలిగింది. అదీ ఒక ప్రభుత్వ ప్రచార పోష్టరు చూసి అంటే నమ్ముతారా?
    దానిలో నెహ్రూగారి ఉపదేశంలాగా ఉంది: మనం తినీతినక అయినా సరే యెగుమతులు చేసి దేశానికి డబ్బు సంపాదించాలని.
    మాకేం నచ్చలేదు.
    పైగా కొన్ని కొన్ని కారణాలవల్ల ఆయన మన దేశానికన్నా, తన అంతర్జాతీయకీర్తి పలుకుబడులకే ప్రాధాన్యత యిచ్చే వాడని మాకొక ఘట్టి నమ్మకం కలిగింది.
    దాంతో, ఆయన మరింతగా మాకు నచ్చకుండా పోయాడు.
    ఆయన ఇందిరా గాంధీని దేశంమీద రుద్దటానికి ప్రయత్నం చేసాడని మాకు అభిప్రాయం త్వరలోనే బలపడింది.
    ఆయన అస్సలు నచ్చకుండా పోయాడు.
    అదీ సంగతి.

  9. తినీ తినక ఎగుమతులు చేసి సంపాదించే డబ్బు ఎవరికి ఇవ్వాలనో? సోషలిజం పేరు చెప్పి జనాల్ని మోసం చేసిన ఘనత కూడా నెహ్రూదే.

వ్యాఖ్యానించండి