ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం గతంలో వేసిన ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) అంచనాను తగ్గించుకుంది. పనిలో పనిగా ఈ సంవత్సరం కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్ లేదా బడ్జెట్ డెఫిసిట్) లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. “చెల్లింపుల సమతూకం” (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) విషయంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నామని తెలిపింది. ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ ఎన్నడో ఇరవై సంవత్సరాల క్రితం 1992 లో ఇండియా ఎదుర్కొంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే భారత దేశం ఎదుర్కోవడం. స్వదేశీ, విదేశీ డిమాండ్ తగ్గుముఖం పట్టినందున జిడిపి వృద్ధి రేటు తగ్గించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది.
2011-12 ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ 9 శాతం వేగంతో అభివృద్ధి చెందుతుందని భారత ప్రభుత్వం గొప్పగా అంచనా వేసింది. దానిని ఇప్పుడు 7.25 నుండి 7.50 శాతం వరకూ వృద్ధి చెందవచ్చని సవరించుకుంది. ఇండియా తొమ్మిది శాతం అని అంచనా వేసినప్పటికీ, ఒక్క భారత ప్రభుత్వం తప్ప అంతర్జాతీయ పరిశీలకులు ఎవరూ భారత ప్రభుత్వ అంచనాను సమర్ధించలేదు. భారత ప్రభుత్వం అతిగా అంచనా వేస్తున్నదని కూడా వారు పేర్కొన్నారు. ఏడున్నర నుండి ఎనిమిది శాతం వరకూ వృద్ధి చెందవచ్చని అనేకమంది విశ్లేషకులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, విశ్లేషణా సంస్ధలు అంచనా వేశారు. ఇప్పుడు వారి అంచనాకే భారత ప్రభుత్వం కూడా రావలసి వచ్చింది.
ఆర్ధిక వ్యవస్ధ మందగమనంతో ప్రభుత్వ కోశాగార నిల్వలపైన ఒత్తిడి పెంచుతున్నదని భావిస్తున్నారు. ఈ పరిస్ధితి రూపాయి అమ్మకాలకి దారితీసి దాని విలువ పడిపోతున్నది. పన్నుల ఆదాయం బడ్జెట్ లో అంచనా వేసినంతగా రాలేదని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని తెలుస్తోంది. దానితో బడ్జెట్ లోటు పెరుగుతూ లక్ష్యంగా రూపొందించుకున్న 4.6 శాతం చేరుకోలేకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బడ్జెట్ లోటు ఎంత ఉండవచ్చన్నదీ ఇంకా ఒక అంచనా ప్రభుత్వం ప్రకటించలేదు.
భారత సరుకులకు విదేశీల్లో డిమాండ్ నెమ్మదించిందని రాయిటర్స్ తెలిపింది. ఫలితంగా ఎగుమతి లక్ష్యం 300 బిలియన్ డాలర్లను చేరుకోవడం కూడా కష్టతరంగా మారింది. వాణిజ్య సమతూకంలో తీవ్ర సమస్య ఏర్పడిందని వాణిజ్య కార్యదర్శి రాహుల్ ఖుల్లార్ శుక్రవారం తెలిపాడు. నికర పన్ను ఆదాయాలు మొదటి ఏడు నెలల్లో గత సంవత్సరంతో పోలిస్తే 7.3 శాతం పెరగ్గా ఖర్చులు మాత్రం 10 శాతం పెరిగాయని ఆయన తెలిపాడు. ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మి మొత్తం 400 బిలియన్ రూపాయలు సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అది కూడా కష్టమేనని ప్రభుత్వం చెబుతోంది.
పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చులకు యధావిధిగా ప్రభుత్వం సబ్సిడీల బిల్లును సాకుగా చూపుతోంది. ప్రజలకు సబ్సిడీలకు సరుకులు ఇవ్వడం వల్ల ఖర్చుల భాగం పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కాని కంపెనీలకు, కార్పొరేట్లకు వివిధ పన్నులలోనూ, ఎగుమతుల ప్రోత్సాహకాల రూపంలోనూ ఇస్తున్న సబ్సిడీలను అది ప్రస్తావించడం లేదు. రూపాయి పతనం కొనసాగితే ఇండియా ద్రవ్య సంక్షోభం ఎదుర్కోనుందన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఏ ఇతర ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ గల దేశాలన్నింటితో పోల్చినా ఇండియా నుండి అధికంగా ఎఫ్.ఐ.ఐ లు ఎగిరిపోతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇతర దేశాలన్నింటి కంటే ఇండియూలోనే అధికంగా నమోదవూతోంది.
భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను అమెరికా, యూరప్ ల ఆర్ధిక వ్యవస్ధలకు కట్టివేయడం అంతకంతకూ పెరుగుతున్న ఫలితంగా సంక్షోభ పరిస్ధితులు తీవ్రం అవుతుండగా, దాన్ని విస్మరించి భారత ప్రభుత్వం అదే దిశలో మరిన్ని చర్యలు తీసుకోవడానికి ఉవ్విళ్ళూరుతోంది. ఈ నేపధ్యంలో అమెరికా, యూరప్ లు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్ధితులను త్వరలో భారత ప్రజలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.