అమెరికా కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది -ఒబామా


అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శుక్రవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో కొద్దిగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ అది శాశ్వతం కాదని ఆర్ధిక విశ్లెషకులు భావిస్తున్నారు. బారక్ ఒబామా అంచనా సైతం దాని ధృవీకరిస్తోంది.

సిబి.ఎస్ టెలివిజన్ కి చెందిన “60 మినిట్స్” కార్యక్రమానికి ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం ఇచి ప్రసారం కానున్నది. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో సమస్యల పరిష్కారాన్ని తక్కువ అంచనా వేశారా అనడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఒబామా ఈ మాటలన్నాడు.

“ఇది దీర్ఘకాలిక ప్రాజెక్టు అని నేను ఎల్లవేళలా నమ్ముతూ వచ్చాను. మన ఆర్ధిక వ్యవస్ధలో వ్యవస్ధాగత సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమస్యలు రెండు దశాబ్దాలుగా నిర్మితమవుతూ వచ్చాయి” అని అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నాడు.

“ఇది రెండు సంవత్సరాలకంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చని అంచనా వేశాను. ఆ తర్వాత పరిష్కారం ఒక అధ్యక్షుడి పదవీకాలం తీసుకోవచ్చని భావించాను. ఇప్పుడేమో ఒక అధ్యక్షుడి పదవీకాలం కంటె ఎక్కువ సమయం అవసరం కావచ్చని అనిపిస్తోంది” అని బారక్ ఒబామా చెప్పాడు. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నవంబరు కల్లా ఎనిమిది శాతానికి నిరుద్యోగం తగ్గవచ్చని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన “అది సంభవమే అనుకుంటున్నాను. ఐతే జోస్యం చెప్పే పనిలో నేను లేను” అని ఒబామా అన్నాడు.

అమెరికా నిరుద్యోగం ఒబామా తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలను ప్రభావితం చెయ్యనున్నది. నిరుద్యోగం తొమ్మిది శాతం నుంది ఇటీవల 8.6 శాతానికి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అయినా అది ఇంకా అధికంగానే భావిస్తున్నారు. ఐదు శాతం నిరుద్యోగం నార్మల్ గా పరిగణించవచ్చని అంచనా వేస్తున్నరు. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య తగ్గుతున్నదని లెక్కలు చెబుతున్నాయి.

నిరుద్యోగం ఇదే స్ధాయిలో కొనసాగవచ్చని అత్యధికులు భావిస్తున్నారు.ఒబామా రేటింగ్ కూడా పడిఫోతోంది. 54 శాతం మంది ఒబామాకి రెండోసారి ఎన్నిక కాతగిన అర్హత లేదని చెప్పగా, 44 మంది మాత్రమే ఒబామా అభ్యర్ధిత్వాన్ని ఆమోదించారు. ముప్ఫై మూడు శాతం మంది మాత్రమే ఒబామాకి ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించగల సామార్ధ్యాన్ని ఇచ్చాయి. ఒబామా పదవీ కాలంలో ఇదే అత్యంత తక్కువ రేటింగ్.

వ్యాఖ్యానించండి