అత్యాధునిక అమెరికా గూఢచారి విమానాన్ని నేలకూల్చిన ఇరాన్


అత్యాధునికమైన తన మానవ రహిత గూఢచార డ్రోన్ విమానాన్ని ఇరాన్ గగనతలంలో ఎగురుతూ గూఢచర్యానికి పాల్పడుతుండగా ఇరాన్ నేలకూల్చడంతో అమెరికా మింగలేక, కక్కలేక ఉంది. తన గూఢచర్య విమానాన్ని ఇరాన్ నేల కూల్చలేదనీ, దానంతట అదే కొన్ని సమస్యలు రావడం వలన కూలిపోయిందని చెప్పడానికి నానా తంటాలు పడుతోంది. ఆర్.క్యు – 170 గా పిలిచే ఈ గూఢచార డ్రోన్ విమానం అత్యంత ఆధునికమైనదనీ, అత్యంత ఎత్తునుండి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని అంగీకరిస్తూనే దాన్ని ఇరాన్ కూల్చిందన్న వార్తను మాత్రం అమెరికా నిరాకరిస్తోంది. దానంతట అదే కూలిపోయి ఉంటుందని చెబుతూ, తన గూఢచర్య విమానాన్ని తన బద్ధ శత్రువు ఇరాన్ కూల్చలేదని చెప్పడానికి పరువుకు పోతోంది.

కూలిపోయిన అమెరికా డ్రోన్ కు ఎటువంటి నష్టం కలగకుండా ఇరాన్ కిందికి దించినట్లుగా ఇరాన్ విడుదల చేసిన ఫొటోలను బట్టి అర్ధం అవుతోంది. రివర్స్ ఇంజనీగింగ్ ద్వారా డ్రోన్ విమానంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరాన్ దొంగిలిస్తుందనీ, లేదా చైనాకు అప్పజెపుతుందనీ అమెరికా ఇప్పుడు భయపడుతోంది. కూలిపోయిన విమానం అంతకుముందు కనపడకుండా విమానమేనని అమెరికా వర్గాలు ధృవీకరించాయి. కూలిపోయిన డ్రోన్ విమానం ఇరాన్ గగనతలంలో గూఢచార కార్యకలాపాలు నిర్వహిస్తోందని కూడా అమెరికా అధికారులు ధృవీకరించినట్లుగా రాయిటర్స్ తెలిపింది.

ఒక ప్రవేటు అమెరికా రక్షణ నిపుణుడు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఒక అమెరికా కమాండ్ సెంటర్ ని తాను ఒకసారి సందర్శించాననీ, ఇరాన్ లోపల నెలకొల్పిన ఎలక్ట్రానిక్ గూఢచార పరికరాలనుండి ఆ సెంటర్ కు అనేక విధాల సమాచారం వస్తున్న సంగతిని గమనించాననీ తెలిపినట్లుగా రాయిటర్స్ తెలిపింది. సమాచారంలో కొంత భాగం బాగా ఎత్తునుండి వస్తున్నట్లు తాను గమనించానని అతను తెలిపాడు. మరి కొంత సమాచారం ఇరాన్ లో గ్రౌండ్ పైన అమర్చిన పరికరాల ద్వారా వస్తున్న సమాచారంగా గుర్తించానని ఆయన తెలిపాడు. దీనిని బట్టి ఇరాన్ నుండి సమాచారం సేకరించడానికి అమెరికా ఎప్పటినుండో అనేక విధాలుగా ఏర్పాట్లు చేసుకుందని అర్ధం అవుతోంది. ఇరాన్ లో గూఢచార కార్యకలాపాలకు పాల్పడడాన్ని అమెరికా అధికారులు పూర్తి స్ధాయిలో సమర్ధించుకుంటున్నారు.

ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని నాశనం చెయ్యడానికి అమెరికా, ఇజ్రాయెల్ లు ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటాయి. ఇజ్రాయెల్, అత్యంత ప్రమాదకరమైన ‘స్టక్స్ నెట్’ వైరస్ ను కేవలం ఇరాన్ అణు కార్యక్రమ విధ్వంసం కోసమే తయారు చేసి దానిని ఇరాన్ అణు ప్లాంటులలోని కంప్యూటర్లలో ప్రవేశపెట్టడంలో సఫలం అయ్యింది. దానివల్ల ఇరాన్ అణు కార్యక్రమం దాదాపు ఐదు సంవత్సరాల మేరకు వాయిదాపడిందని ఇజ్రాయెల్ ప్రకటించింది కూడా. అనేకమంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చంపేశాయి. ఇటీవలనే ఇరాన్ లో జరిగిన పేలుడులో పదిహేడు మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఈ పేలుడు వెనక అమెరికా, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధల హస్తం ఉందని అందరూ అనుమానిస్తుండగా ఇరాన్ మాత్రం అది కేవలం ప్రమాదం మాత్రమేనని తెలిపింది.

ఇరాన్ లో అణు ప్రమాదాలు జరిగినప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు బహిరంగంగానే సంతోషం వ్యక్తం చేస్తుంటాయి.

 

వ్యాఖ్యానించండి