
కోల్‌కతా లో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మంది దుర్మరణ పాలయ్యారు. చనిపోయినవారిలో అధికులు రోగులే. ప్రమాదం జరిగినపుడు రోగులు నిద్రలో ఉండడంతో అధికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏడంతస్ధుల భవనంలో పొగ దట్టంగా అలుముకోవడంతో అనేకమందికి ఊపిరాడలేదు. అగ్నిమాపక సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి నిచ్చెనలు ఉపయోగించి రోగులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు రోగులను స్ట్రెచర్లలో ఉంచి బైటికి తెస్తున్నారు.
బేస్‌మెంట్ లో మంటలు బయలుదేరి ఎ/సి షాఫ్టుల ద్వారా భవనం అంతా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది గంట తర్వాత ఘటనా స్ధలానికి చేరుకున్నట్లు అక్కడి జనం చెబుతున్నారు. “పై అంతస్ధుల్లోని రోగులు కిటికీలకు అరి చేతులు, ముఖాలు ఆనించి తమను రక్షించాలంటూ వేడుకోవడాన్ని మేం చూశాం” అని కొంతమంది పత్రికలకు తెలిపారు. ఉదయం పది ప్రాంతానికల్లా మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. చనిపోయినవారినీ రక్షణ వర్గాలు బైటికి తెస్తున్నారు.
చనిపోయినవారిలో ముగ్గురు తప్ప మిగిలినవారంతా రోగులేనని ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తొంభైమంది రోగులను క్షేమంగా బైటికి తెచ్చారని వారు తెలిపారు. మంటలను తెల్లవారు ఝాము గం 3.30 ని.లకు పసిగట్టారనీ, ఐదు నుండి పది నిమిషాల్లోపు అగ్నిమాపక విభాగానికి కబురు పంపామనీ వారు వివరించారు. ఆసుపత్రి వర్గాలు చాలా నెమ్మదిగా ప్రతిస్పందించారని స్ధానికులు విమర్శిస్తున్నారు. మూడేళ్ళ క్రితం కూడా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించినట్లుగా వారు గుర్తు చేశారు.
“ఫైర్ బ్రిగేడ్లు గానీ, నిచ్చేనలు గానీ ఆసుపత్రి వద్దకు వెళ్లలేని విధంగా ఆసుపత్రి నిర్మాణం ఉంది. అందువలన రక్షణ ఏర్పాట్లు ఆలస్యం అయ్యాయి. ఈ లోపు పొగ పై అంతస్ధులదాకా వ్యాపించింది” అని పశ్చిమ బెంగాల పట్టణాబివృద్ధి మంత్రి హకీమ్ తెలిపాడు. ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రికి ఆపరేటింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి మమత ప్రకటించింది. నగరంలో అనేక ఆసుపత్రులను ఎ.ఎం.ఆర్.ఐ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమామి సంస్ధ ఈ ఆసుపత్రులకు సొంతదారుగా తెలుస్తోంది. ప్రమాదంతో ఈ కంపెనీ షేర్లు రెండు శాతానికి పైగా పడిపోయాయి.
పట్టణ ప్లానింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ లంచాలను మింగి భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రమాదాలు సంభవించినపుడు వాటి గురించి చెప్పుకోవడం తర్వాత మర్చిపోవడం కూడా సర్వ సాధారణంగా మారిపోయింది. పాలకుల ప్రధమ కర్తవ్యం ప్రజల బాగోగులు కానందువల్లనే ఈ దుస్ధితి.
> పాలకుల ప్రధమ కర్తవ్యం ప్రజల బాగోగులు కానందువల్లనే ఈ దుస్ధితి.
సరిగ్గా చెప్పారు. యెంత విషాదకర ఘటన!
మనప్రియ దేశంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి.
అన్ని సార్లూ అన్యాయంగా ప్రజలప్రాణాలు పోతూనే ఉంటాయి.
మన ప్రభుత్వాలు యధాప్రకారం విచారం ప్రకటిస్తూనే ఉంటాయి
పాపం అవి తక్షణం కమిటీలమీద కమిటీలు వేస్తూనే ఉంటాయి
మళ్లీ వాటి రిపోర్టుల్ని జాగ్రత్తగా బుట్టదాక్షలు చేస్తూనే ఉంటాయి
ప్రజల కష్టాలన్నీ కూడా యధాప్రకారం పెరుగుతూనే ఉంటాయి.