అగ్నిమాపక విభాగం ముందే హెచ్చరించినా ఆసుపత్రి వాళ్ళు విన్లేదు -మమత


ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి బేస్‌మెంట్ ను ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక విభాగం వాళ్ళు జులైలోనే హెచ్చరించారనీ, అయినా ఆసుపత్రి వాళ్ళు ఆ పని చేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పత్రికలకు తెలిపింది. రెండు నెలల్లో బేస్‌మెంట్ ఖాళీ చేస్తామని అఫిడవిట్ సమర్పించిన ఆసుపత్రి యాజమాన్యం అది చేయలేదని ఆమే తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం లాభాపేక్ష, నిర్లక్ష్యంగా ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని నిస్సందేహంగా భావించవచ్చు.

ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 88 కి చేరింది. ఇంకా చాలా మంది కనిపించడం లేదని తెలుస్తోంది. వారిలో ఎంతమందీ చనిపోయిందీ తెలియదు. దొరకని వారి కోసం బంధువులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మంటలు అదుపు లోకి వచ్చినప్పటికీ పూర్తిగా ఆరిపోలేదని తెలుస్తోంది. తాజా అగ్ని ప్రమాదంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. నగరంలో ఉన్న మాల్ లు ఇతర భవనాలలో అగ్నిమాపక పధకాలు రూపొందించుకున్నదీ లేనిదీ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. తనిఖీలు శనివారం నుండి ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.

ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి కి చెందిన ఆరుగురు డైరెక్టర్లనూ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమత ఆదేశాలతోనే ఈ అరెస్టులు జరిగాయి. ఆసుపత్రికి ఉన్న లైసెన్సు కూడా మమత రద్దు చేసింది. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినప్పటినుండి ముఖ్యమంత్రి మమత స్వయంగా రంగం లోకి దిగడం గమనార్హం. ప్రమాదానికి సంబంధించిన ప్రకటనలలో ముఖ్యమైనవాటిని మమతే స్వయంగా చేసింది. అరెస్టుల వార్త, లైసెన్సు రద్దు వార్త, మొదలైనవన్నీ ఆమే స్వయంగా చేయడం గమనించదగ్గది.

సాధారణంగా ఇటువంటి ప్రమాదాల సమయంలో ముఖ్యమంత్రులు పట్టించుకోరు. ఓ ఖండన, ఒక సానుభూతి, కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఊరుకున్న ఉదాహరణలే తప్ప సంఘటనా స్ధలికి వచ్చి డైరెక్టర్లను అరెస్టు చెయ్యాలని అప్పటికప్పుడు ఆదేశించడం, లైసెన్సు వెంటనే రద్దు చెయ్యడం, ప్రమాద స్ధితిగతులపైన స్వయంగా ప్రకటించడం… ఇవన్నీ ముఖ్యమంత్రులు చెయ్యరు. ఆ పనులు చేసిన మమతను అభినందించక తప్పదు. ఇటువంటి సందర్భాలలో డబ్బులు ముట్టజెప్పి యాజమాన్యాలు చర్యలనుండి బైటపడడం సాధారణంగా జరుగుతుంది. అలా కాక ఆరుగురు డైరెక్టర్లను అరెస్టు చేసి, యజమానికి సైతం అరెస్టు చేసి వారిపైన 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం హర్షించదగినది.

“ప్రజలు తాము సంపాదించుకున్నదంతా పోసో, లేదా తమ వద్ద ఉన్నవన్నీ ఆమ్మేసో ఇటువంటి పెద్ద ఆసుపత్రులలో చేరుతుంటారు. అందుకు తగిన వసతులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుంది. అదేమీ చెయ్యకపోగా ఇలా ప్రాణాలమీదికి తేవడం క్షమించరానిది” అని ప్రకటించిన మమత అభినందనీయురాలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాధమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఒక విద్యుత్ ప్యానెల్ కాలి ఉండగా పరిశోధకులు గమనించారు.

ఆసుపత్రి వర్గాలు మరణించినవారికి ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. అది చాలదని భాధితులు నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తుందని ప్రధాని మన్మోహన్ ప్రకటించాడు. గాయపడ్డవారికి యాభై వేలు ఇస్తామని ఆయన చెప్పాడు.

ఆసుపత్రి వాళ్లు కనీసం తమ భవంతి ప్లాన్ ను కూడా ఇవ్వలేకపోయారని అగ్నిమాపక విభాగం ఆరోపించింది. ఆ అంశంపైన తాము ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. కనీసం భవంతిలో బైటికి వెళ్ళడానికి అత్యవసర మార్గాలు ఎటువైపు ఉన్నాయో కూడా యాజమాన్యం చెప్పలేదని వారు చెప్పారు. మంటలు చెలరేగితే ఆపడానికి అగ్నిమాపక సామాగ్రి దగ్గర పెట్టుకోలేదని వారు చెప్పారు. భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి బేస్‌మెంట్ ను గోడౌన్ గా వాడుతున్నారని తెలుస్తోంది. బేస్‌మెంట్ ని ఖాళీ చేయాలని అగ్నిమాపక విభాగం జులైలోనే హెచ్చరించినా ఖాళీ చేస్తామని చెప్పి అఫిడవిట్ ఇచ్చి కూడా ఖాళీ చేయలేదు. అగ్నిప్రమాదంలో మొదట మంటలు బేస్‌మెంట్ నుండే ప్రారంభం కావడం ఈ సందర్భంగా గమనార్హం.

వ్యాఖ్యానించండి