యూరో జోన్ లోని మొత్తం పదిహేడు దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. ఇ.యు రేటింగ్ తో పాటు ఇ.యు లో ఉన్న అతి పెద్ద బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్ధ హెచ్చరించింది. శుక్రవారం జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశంలో సంక్షోభ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎస్ & పి పరోక్ష హెచ్చరిక చేసినట్లయ్యింది.
యూరోపియన్ యూనియన్ లో మొత్తం 27 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా అందులో 17 దేశాలు ఉమ్మడి కరెన్సీ యూరో ను అమలు చేస్తున్నాయి. యూరో కరెన్సీ గా గల దేశాలను యూరో జోన్ గా పిలుస్తారు. శుక్రవారం జరిగే సమావేశంలో రుణ సంక్షోభం విషయంలో ఒక పరిష్కారానికి అంగీకరించాలని లేనట్లయితే పదిహేడు యూరోజోన్ దేశాల రేటింగ్ ను తగ్గించక తప్పదని ఎస్ & పి సోమవారమే హెచ్చరించింది.
యూరోపియన్ యూనియన్ డౌన్ గ్రేడ్ వలన యూరో జోన్ కి బైట ఉన్న ఇ.యు దేశాలపైన ప్రభావం కలిగించదని ఎస్ & పి ప్రతినిధి తెలిపాడు. అయితే ఆ చర్య వలన ఇ.యు రుణాల ఖరీదు పెరిగే అవకాశం ఉందని తన సభ్య దేశాలకు సహాయం చేయడం కూడా ఖరీదు వ్యవహారంగా మారుతుందని అతను తెలిపాడు. యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ దృక్పధాన్ని నెగిటివ్ కి ఎస్ & పి తగ్గించింది. 2011 లో ఇ.యు మొత్తం బడ్జెట్ రెవిన్యూలో 62 శాతం యూరో జోన్ దేశాలనుండే వచ్చిందనీ కనుక యూరో జోన్ సంక్షోభం ప్రభావం ఇ.యు రేటింగ్ పైన పడిందనీ ఆ సంస్ధ తెలిపింది.
యూరోజోన్ దేశాల రేటింగ్ తగ్గించినట్లయితే యూరోపియన్ యూనియన్ రేటింగ్ కూడా ఒక అడుగు తగ్గించవలసి ఉంటుందని తెలిపింది. అలాగే డ్యూశ్చ్ బ్యాంక్, బి.ఎన్.పి పరిబాస్ లాంటి భారీ బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించవచ్చని ఎస్ & పి తెలిపింది. ఎస్ & పి హెచ్చరికలతో ఇ.యు దేశాలపై మరింత ఒత్తిడి పెరిగింది. ఎస్ & పి హెచ్చరికలు యురో జోన్ దేశాలకు ఆగ్రహం తెప్పించింది. తమ దేశాల రాజకీయ ప్రక్రియలలోకి జొరబడడానికి రేటింగ్ ఏజన్సీలు ప్రయత్నిస్తున్నాయని అవి వ్యాఖ్యానించాయి. మార్కెట్ వర్గాలు మాత్రం మద్దతు పలికాయి.