భారత దేశం ఐదు లేదా ఆరు శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని భరించలేదని భారత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పార్లమెంటులో అన్నాడు. అక్టోబరు నెలలో భారత ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్యోల్బణం 9.73 శాతం గా ఉంది. కనీసం సంవత్సరం నుండి భారత ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం కంటే కిందికి దిగి రాలేదు. మరి ద్రవ్యోల్బణం తగ్గించకుండా ప్రణబ్ ముఖర్జీని ఎవరు ఆపారో తెలియడం లేదు.
భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తున్న ఆర్ధిక పండితులలో మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఆయనతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, హోం మంత్రి పి.చిదంబరం, ప్రధాని ఆర్ధిక సలాహా బృందం నాయకుడు కౌశిక్ బసు, ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు… వీళ్ళంతా మన ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తున్నారు. వీళ్ళంతా ద్రవ్యోల్బణం పైన ఏదో ఒక ప్రకటన ఇవ్వకుండా ఏ వారమూ గడవలేదు. ద్రవ్యోల్బణాని అరికట్టడమే తమ ఏకైక లక్ష్యమని వీళ్ళు ప్రకటించి రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. వీళ్ళు ప్రతిన బూనిన నాటినుండి వీరు చేసిన ప్రయత్నాల ద్వారా ద్రవ్యోల్బణం తగ్గిన దాఖలాలు అసలు లేవు.
“తమ విధానాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది చూశారా” అని వీళ్ళు తలెత్తుకున్న సంఘటన లేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికని చెప్పి ఆర్.బి.ఐ వడ్డీ రేట్లను పదమూడు సార్లు పెంచింది. వడ్డీ రేట్లు పెరిగి ప్రజలకి అప్పులు ఖరీదయ్యాయే గానీ ద్రవ్యోల్బణం తగ్గింది లేదు. అన్ని సార్లు వడ్డీ రేట్లు పెంచినా ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గడం లేదో ఆర్.బి.ఐ గవర్నర్ ఏ ఒక్కసారీ వివరించలేదు. అదేమంటే యూరప్ రుణ సంక్షోభం, అమెరికా జిడిపి వృద్ధి సంక్షోభం అని బైటికి చూస్తారు తప్ప ద్రవ్యోల్బణం తగ్గించడంలో వీరు సఫలం కాలేకపోయారు. వీళ్ళేం ఆర్ధిక పండితులు? వీళ్ళేం ఆర్ధిక రధ సారధులు? దాదాపు మూడు సంవత్సరాల పాటు వరుసగా విఫలం అవుతూ వచ్చారు.
ఇప్పుడేమో ఇండియా ఐదు, ఆరు శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణం భరించలేదని ప్రణబ్ ప్రకటిస్తున్నాడు. ఈయన ఇండియా ఆర్ధిక వ్యవస్ధ గురించి మాట్లాడుతున్నాడా? లేక భారత ప్రజల గురించి మాట్లాడుతున్నాడా? కొందరు రెండూ ఒకటే అనవచ్చేమో కానీ మన ఆర్ధిక రధ సారధులకు మాత్రం కాదు. భారత నాయకుల దృష్టిలో ఆర్ధిక వ్యవస్ధ అంటే భారత ప్రవేటు రంగం, విదేశీ ప్రవేటు రంగం వారి ప్రయోజనాలు. వీళ్ళ దృష్టిలో ప్రజల ప్రయోజనాలు ఆర్ధిక వ్యవస్ధలో భాగం కాదు. కేవలం ఎన్నికల సమయంలో లేదా ఒకటీ రెండూ ప్రజాకర్షక పధకాల విషయం వచ్చినపుడే వీరికి ప్రజల ప్రయోజనాలు గుర్తుకు వస్తాయి. ఎన్నికలు ముగిశాక మళ్లీ మామూలే.
భారత ద్రవ్యోల్బణం అధికంగా ఉందని చెప్పి విదేశీ పెట్టుబడులు ఇండియాకి రావడం తగ్గిపోయాయి. స్వదేశీ పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. వీళ్ళు ఆర్.బి.ఐ వడ్డీ రెట్లు ఎక్కువగా ఉండడాన్ని కూడా చూపించి పెట్టుబడులకు సిద్దపడడం లేదు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బులు అప్పుగా తీసుకుని పెట్టుబడులు పెడతారు తప్ప తమ పెట్టుబడుల్ని కాదు. అయినా వీరి పెట్టుబడుల కోసం ఎదురు చూపులు చూస్తుంటారు మన నాయకులు.
వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా పెట్టుబడులు రావు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న పెట్టుబడులు రావు. బడ్జెట్ లోటు ఎక్కువగా ఉన్నా పెట్టుబడులు రావు. పైగా ఉన్న పెట్టుబడులు భారత దేశం నుండి ఎగిరిపోతుంటాయి. దాంతో రూపాయి విలువ పడిపోతుంది. అది చూసి మరిన్ని పెట్టుబడులు ఎగిరిపోతాయి. కనుక పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి భారత ప్రభుత్వం వేగంగా, చురుకుగా సంస్కరణలను చేపట్టాలి. అందులో భాగమే రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు!
ఇంతకీ భారత దేశం ఐదు లేదా ఆరు శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం భరించలేదు అనడం వెనక ఆర్ధికమంత్రి ప్రణభ్ ముఖర్జీ ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రతిపక్షాలు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అంగీకరించాలి అని. భారత దేశంలోని ప్రతి ఆర్ధిక సమస్య పరిష్కారానికి విదేశాల వైపు చూస్తున్న వీళ్ళు భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను ఎట్లా నడుపుతారు? సిగ్గు లేకపోతే సరి!