
పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ గుండె నొప్పి తో దుబాయ్ ఆసుపత్రిలో చేరడంతో పాకిస్ధాన్ లో నిశ్శబ్ద కుట్ర జరుగుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘మెమో గేట్’ కుంభకోణం దరిమిలా పౌర ప్రభుత్వానికీ, సైన్యానికి మధ్య విభేధాలు తీవ్రమైనాయన్న వార్తల నేపధ్యంలో తాజా కుట్ర వార్తలు బలం సంపాదించుకున్నాయి. సైన్యం ఒత్తిడి మేరకు పదవి నుండి రాజీనామా చేయడం కోసమే దుబాయ్ ఆసుపత్రిలో జర్దారీ చేరాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జర్దారీ ప్రతినిధులు మాత్రం కుట్ర వార్తలను కొట్టిపారేస్తున్నారు.
“‘నిశ్శబ్ద కుట్ర’ జరుగుతోందన్న పుకార్ల వ్యాప్తి అటువంటి కుట్ర చేయాలన్న కోరికలను ఒక్కోసారి వ్యక్తం చేస్తాయి. జర్దారీ ఆరోగ్యం బాగానే ఉంది. రెండు మూడు రోజులయ్యాక పాకిస్ధాన్ కి తిరిగి వచ్చి తన బాధ్యతలని నిర్వహిస్తాడు” అని జర్ధారీ ప్రతినిధులు చెబుతున్నారు. జర్దారీ రొటీన్ మెడికల్ పరీక్షల కోసం దుబాయ్ వెళ్ళాడు అని జర్దారీ ఆఫీసు ప్రకటించింది. ‘చెక్ అప్’ ముందుగా అనుకున్నదేనని ఆయన కార్యాలయం తెలిపింది.
జర్దారీ సన్నిహితులు అసోసియేటేడ్ ప్రెస్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ జర్దారీకి ఆరోగ్యం బాగాలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వివరాలు మాత్రం చెప్పలేదని ఎపి తెలిపింది. ఆయన ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ కనిపించడం లేదు అని వారు తెలిపారని ఎ.పి తెలిపింది. సదరు వ్యక్తులు పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదని ఎ.పి తెలిపింది.
జర్దారీ మైనర్ గా గుండె నొప్పి కి గురయ్యాడని రాయిటర్స్ సంస్ధ మరొక అజ్ఞాత వ్యక్తిని ఉటంకిస్తూ తెలిపింది. “రెండు రోజుల క్రితం ఆయనకి గుండె నొప్పి వచ్చింది” అని ఆ వ్యక్తి తెలిపాడని రాయిటర్స్ తెలిపింది. “జర్దారీ కి ముందే ఉన్న గుండె సమస్య కు సంబంధించి న లక్షణాలు కనపడడంతో దుబాయ్ వెళ్ళాడు” అని ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఓ ప్రకటనలో తెలిపాడు. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో జర్దారీ రాజీనామా చేయనున్నాడన్న వార్తలను ఆయన ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ ఎ.పి కి తెలిపాడు.
ఒసామా బిన్ లాడేన్ హత్య తర్వాత పాకిస్ధాన్ లో పౌర ప్రభుత్వం నుండి అధికారం చేజిక్కించుకోవడానికి సైన్యం ప్రయత్నిస్తున్నదనీ, దాన్ని నివారించడానికి అమెరికా సాయం చెయ్యాలని అధ్యక్షుడు జర్దారీ అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు ఒక మెమో పంపించాడని కొద్ది వారాల క్రితం వెల్లడయ్యింది. అమెరికాలో పాకిస్ధాన్ రాయబారి అక్కడ ఉన్న పాక్ వ్యాపారి ద్వారా సదరు మెమో ను పంపినట్లుగా వెల్లడయ్యింది. ఈ విషయాన్ని మొదట పాక్ వ్యాపారే వెల్లడి చేయడం గమనార్హం. ఈ గొడవతో పాక్ రాయబారి రాజీనామా చేయవలసి వచ్చింది.
ఫారెన్ పాలసీ మ్యాగజైన్ వెబ్ సైట్ లో కుట్ర విషయం నిజమేనన్నట్లుగా సూచిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. సోమవారం రాత్రి జర్దారీ కి కొద్దిగా గుండెనొప్పి వచ్చిందనీ, ఆరోగ్యం బాగాలేదన్న కారణంతొ రాజీనామా చెయ్యవచ్చనీ అమెరికాలోని కొన్ని విభాగాలకు కూడా సమాచారం అందినట్లుగా ఫారెన్ పాలసీ ఆర్టికల్ తెలిపింది. “ఉచ్చు బిగుసుకుంటోంది. ఎప్పుడు జరుగుతుందన్నదే మిగిలింది” అని అమెరికా కి చెందిన మాజీ అధికారి చెప్పినట్లుగా ఆ ఆర్టికల్ తెలిపింది.
మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది.