సిరియాలో ప్రజల మరణాలపై ఐక్యరాజ్య సమితి ఇస్తున్నవి తప్పుడు లెక్కలని సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ తెలిపాడు. అమెరికా వార్తా సంస్ధ ఎబిసి న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పాడు. సిరియా లో నాలుగు వేల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సిరియా వచ్చి ఇక్కడ సర్వే జరిపి నిజా నిజాలు వెల్లడించాలని సిరియా అధ్యక్షుడు కోరాడు.
సిరియా భద్రతా దళాలు తన సొంత దళాలు కాదని బషర్ అన్నాడు. దళాలను తాను కమాండ్ కూడా చేయనని ఆయన వివరించాడు. “చంపాలనీ, క్రూరంగా ఉండాలనీ ఆర్డర్స్ ఏవీ ఇవ్వలేదు. నేను దళాలకు సొంతదారుని కాదు. నేను అధ్యక్షుడిని. దేశానికి కూడా నేను యజమానిని కాను. కనుక దళాను నా సొంత దళాలు కావు” అని బషర్ వివరించాడు.
ఇంటింటికీ తిరిగి అరెస్టులు సాగించారనీ, చిన్నపిల్లలను కూడా అరెస్టు చేశారనీ వచ్చిన వార్తలను విలేఖరి బార్బారా వాల్టర్స్ ప్రశ్నించగా ఆ వార్తలు నిజం కాదని బషర్ తెలిపాడు. “మనం ఇక్కడ ఉండి చూడాలి. మనం ఇక్కడ చూడము. కనుక మీరు వినే వార్తలను విశ్వసించలేరు” అని బషర్ అన్నాడు. సిరియా వచ్చి వాస్తవాలను విచారించి తర్వాత మాత్రమే ఆరోపణలు చేయాలని బషర్ పరోక్షంగా సూచించాడు.
మానవత పైన సిరియా ప్రభుత్వం నేరాలకు పాల్పడిందన్న సమితి ఆరోపణలను ప్రస్తావించగా, బషర్, సమితి నమ్మదగినది కాదని తెలిపాడు. సమితిలో సిరియా సభ్యత్వం తాము ఆడుతున్న ఒక ఆట మాత్రమేనని బషర్ తెలిపాడు. సాయుధ నేరస్ధుల గ్యాంగులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకోవడం పట్ల తాను నేరం చేసినట్లుగా ఆరోపించడాన్ని బషర్ తప్పు పట్టాడు.
“మా ప్రజలను రక్షించడానికి నేను చేయగలిగిందంతా చేశాను. అది నేరం ఎలా అవుతుంది. దానికి తప్పు చేసినట్లుగా నేను భావించడం లేదు. చనిపోయినవారి పట్ల బాధ ఉంటుంది. ప్రజలను చంపనప్పుడు నేరం చేసినట్లుగా నేను భావించలేను” అని బషర్ వివరించాడు.
నిరుద్యోగం, పోలీసుల అత్యాచారాలు, చిన్న చూపు చూడడం తదితర అంశాలతో నిరాశా, నిస్పృహలకు లోనైన బ్రిటన్ యువత ఆగ్రహంతో అల్లర్లకు పాల్పడినప్పుడు బ్రిటన్ ప్రభుత్వం వారిపైన తీవ్ర నిర్బంధం మోపింది. ఫేస్ బుక్ లో వ్యాఖ్యను పోస్ట్ చేసినవారిని కూడా తప్పుడు కేసులు మోపి సంవత్సరాల తరబడి జైలు శిక్షలు వేశారు. ప్రభుత్వం నుండి ప్రత్యేక ఉత్తర్వులు అందుకున్న న్యాయ వ్యవస్ధ దారుణంగా వ్యవహరించి అనేకమంది యువకులకు దారున శిక్షలు అమలు చేసింది. ఇదంతా ప్రజాస్వామ్యంగా పరిగణించే యూరప్, అమెరికాలు సాయుధంగా నేరాలకు పాల్పడుతున్న గ్యాంగులపైన సిరియా భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తున్నారు.
సాయుధ గ్యాంగులను ప్రజాస్వామిక ఉద్యమకారులుగానూ, వారు చేతిలో చనిపోతున్న ప్రజలు ప్రభుత్వం చేతిలో చనిపోతున్నవారిగానూ ప్రచారం చేస్తూ సిరియా ప్రభుత్వాన్ని రాక్షసీకరించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. లేని చావులను ప్రచారం చేస్తూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. సిరియా వచ్చి నిజా నిజాలను విచారించాలన్న సిరియా అధ్యక్షుడు బషర్ విసిరిన సవాలును పశ్చిమ వార్తా సంస్ధలు స్వీకరించవలసి ఉంది.