గత దశాబ్దం పైగా రష్యాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న వ్లాదిమిర్ పుతిన్ కు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఎదురు లేకుండా తమకు అవసరమైన ‘రాజ్యాంగం సవరణలు’ చేసుకుంటూ పాలించిన పుతిన్ పార్టీకి ఈసారి రష్యా ప్రజలు కేవలం సాధారణ మెజారిటీ మాత్రమే కట్టబెట్టారు. అంటే ఇక పుతిన్ పార్టీ ‘రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకునే’ వెసులుబాటును కోల్పోయిందన్నమాట. రాజ్యాంగానికి ఏమన్నా మార్పులు చేయదలుచుకుంటే ఇతర పార్టీలపై ఆధారపడవలసిందే.
ప్రస్తుతం రష్యా అధ్యక్షుడిగా దిమిత్రి మెడ్వేడేవ్ వ్యవహరిస్తున్నాడు. వ్లాదిమిరి పుతిన్ ప్రధాని పదవిలో ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మెడ్వేడేవ్ ను అధ్యక్ష పదవికి నిలిపి తాను ప్రధానిగా పుతిన్ ఉన్నాడు. అప్పటికె పుతిన్ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేసి ఉన్నాడు. ఒకే వ్యక్తి మూడు పర్యాయాలు వరుసగా అధ్యక్ష పదవి అలంకరించడానికి రష్యా రాజ్యాంగం అంగీకరించదు. అందువల తన మాట జవదాటని మెడ్వెడేవ్ ను అధ్యక్షుడిని చేసి తాను ప్రధాని గా ఉన్నాడు. పుతిన్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో మెడ్వెడేవ్ ప్రధానిగా ఉండడం గమనార్హం.
ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు దాదాపు 96 శాతం పూర్తయ్యింది. అధికార పార్టీ యునైటెడ్ రష్యా కు లెక్కించిన ఓట్లలో 49.54 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికల్లో పుతిన్ పార్టీకి 64 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల ప్రకారం కొత్త పార్లమెంటులో ‘యునైటెడ్ రష్యా’ పార్టీ పాతిక భాగం సీట్లని కోల్పోతుందని ‘ది హిందూ’ తెలిపింది. 450 సీట్లు ఉన్న రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ లో ఇప్పటివరకూ పుతిన్ పార్టీకి 315 సీట్లు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఇవి కేవలం సగానికంటే కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అంటే మూడింట రెండొంతుల మెజారిటీ, సాధారణ మెజారిటీ స్ధాయికి పడిపోయింది.
ఈ సారి ప్రతిపక్ష పార్టీలు లాభపడ్డాయి. కమ్యూనిస్టులు అందరికంటె అధికంగా లాభపడ్డారని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లవల్లే ప్రతిపక్షాలు లాభపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది. గత ఎన్నికల్లో పన్నెండు శాతం ఓట్లు పొందిన కమ్యూనిస్టు పార్టీ ఈసారి 19 శాతం ఓట్లు పొందింది. ‘ఫెయిర్ రష్యా’ పార్టీ కి 13 శాతం ఓట్లు పోలయ్యాయి. వ్లాదిమిర్ ఝిరినోవ్‌స్కీ నేతృత్వంలోని మితవాద పార్టీకి 11.6 శాతం ఓట్లు పోలయ్యాయి. అనేక నగరాల్లో యునైటెడ్ రష్యా పార్టీని కమ్యూనిస్టులు ఓడించారని తెలుస్తోంది.
స్వతంత్ర పరిశీలకులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బ్యాలట్లను పెట్టెల్లో కుక్కడం, అనేక ఓట్లు వేసుకోవడం, ఫలితాల ప్రకటనలలో పాలకపార్టీకి అనుకూలంగా మార్పులు చేయడం లాంటి అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఎన్నికలు అత్యంత డర్టీ ఎన్నికలను కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జ్యుగనోవ్ అభివర్ణించాడు. అనేక చోట్ల పాలక పార్టీకి తొంభై శాతం పైగా ఓట్లు పోలయ్యాయని ప్రతిపక్షాలు తెలిపాయి.
కొత్త పార్లమెంటులో పరిస్ధితులకు అనుగుణంగా ఇతర పార్టీలతో కూటమి కట్టవలసిన అవసరం వస్తుందని మెడ్వేడేవ్ తన పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పాడు. ఎన్నికల ఫలితాలను పుతిన్ ‘చాలు’ అని అభివర్ణించాడు. ఓట్లు తగ్గిపోతాయని పుతిన్ ముందే ఊహించినట్లుగా ఈ వ్యాఖ్య తెలుపుతోంది. ‘మాఫియా స్టేట్’ గా పేరు పొందిన రష్యా రాజ్యవ్యవస్ధ లో ఈ ఎన్నికలు కొత్తగా తెచ్చే మార్పులు ఏమీ ఉండవు. ప్రజల పరిస్ధితులు ఎప్పటిలాగే మాఫియాల పాలనలో కొనసాగుతుంది.
సార్ మీకు వీలైతే ఇరోం షర్మిలా మరియు ..Armed Forces (Special Powers) Act, 1958 గురించి ఒక వ్యాసం రాయండి.
డేవిడ్ గారూ ప్రస్తుతం రెండు వ్యాసాలపైన దృష్టి పెట్టి ఉన్నాను. అవి పూర్తయ్యాక మీరు చెప్పింది రాయడానికి ప్రయత్నిస్తాను. గతంలో ఒకటి రాశాను. చిన్నదే అనుకుంటా.