రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేయడం తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “ఇవి కేవలం భారతీయ రాజకీయాలు మాత్రమే” అని ఆ అధికారి అన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది.
“నమ్మదగని భారత ప్రభుత్వం (ఫికిల్ ఇండియా గవర్నమెంట్) విదేశీ సూపర్ మార్కెట్ల నిర్ణయాన్ని పక్కనబెట్టింది” అన్న హెడ్డింగ్ తో రాయిటర్స్ వార్తా సంస్ధ ఓ కధనాన్ని ప్రచురించింది. ఈ హెడ్డింగ్ తోనే రాయిటర్స్ వార్తా సంస్ధ భారత ప్రభుత్వం పట్ల ఎంత అసంతృప్తితో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రాయిటర్స్ సంస్ధ మాత్రమే కాదు. అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి), ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్ (ఎ.ఎఫ్.పి), బి.బి.సి లాంటి ఇతర వార్తా సంస్ధలు సైతం రిటైల్ బిల్లును పక్కనబెట్టడం పట్ల ఏదో రూపంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ కంపెనీల ప్రయోజనాలను ఈ వార్తా సంస్ధలు ప్రాతినిధ్యం వహిస్తున్నందునే ఈ అసంతృప్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే భారత ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించవలసిన భారత ప్రభుత్వం మాత్రం తన బాధ్యతను విస్మరించింది. రైతులకి, వినియోగదారులకి లాభకరం అన్న పేరుతో ఆ వర్గాల ప్రజలకే హాని చేసే విధానాన్ని తేవడానికి నడుం కట్టింది. రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని ప్రధాని నిర్ద్వంద్వంగా ప్రకటించిన నేపధ్యంలో నిర్ణయాన్ని పక్కన బెట్టడం ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం తప్ప ప్రజల ప్రయోజనాలను గుర్తెరిగి కాదు.
పార్లమెంటు సమావేశాలు జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నందున ఎలాగైనా పార్లమెంటును నడపడానికి తాజా నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదని ప్రభుత్వ వర్గాలు ప్రవేటు సంభాషణల్లో చెబుతున్నారు. ఆ మేరకు వారు విదేశీ వార్తా సంస్ధల ప్రతినిధులకు హామీలు కూడా ఇస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తున్నారు తప్ప తాము ప్రభుత్వంలో ఉన్నట్లయితే ఎన్.డి.ఎ పక్షాలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటాయనడంలో ఎటువంటి సందేహమూ అనవసరం. బి.జె.పి నాయకత్వంలోని మధ్య ప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ విలేఖరులకు చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.
రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిజానికి పార్లమెంటులో ఆమోదం పొందవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. కాని ఈ నిర్ణయంపైన పార్లమెంటులో చర్చకు పెట్టి ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకోవడంతో ఇంతవరకూ సమావేశాలు ఒక్కరోజు కూడా జరగలేదు. దానితో రిటైల్ నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యూహాత్మకంగా, పార్లమెంటు సమావేశాలు జరగడానికి వీలుగా పక్కన పెట్టింది. మరిన్ని బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందవలసి ఉన్నందున, పార్లమెంటు సమావేశాలు జరగక పోతే అవన్నీ వాయిదా పదే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ రిటైల్ బిల్లుని తాత్కాలికంగా పక్కన పెట్టింది. హడావుడి ముగిశాక రిటైల్ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయడం ఖాయం.