విదేశీ సూపర్ మార్కెట్లపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోంది. -అద్వాని


విదేశీ సూపర్ మార్కెట్ల వల్ల కలగనున్న లాభాలపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోందని ప్రతిపక్ష బి.జె.పి అగ్ర నాయకుదు ఎల్.కె.అద్వానీ శనివారం ఆరోపించాడు. “వాల్-మార్ట్ పశ్చిమ దేశాలకు మంచిది కావచ్చు. కాని వాల్-మార్ట్ మనకు సేవ చేసే సంస్ధ కాదు” అని అద్వాని పేర్కొన్నాడు. “మనం వాల్-మార్ట్ పట్ల అసూయ చెందకూడదు” అని న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ అద్వానీ చెప్పాడు. తద్వారా పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను అతిగా అనుకరించడంపైన హెచ్చరించాడు.

నిజానికి బి.జె.పి పార్టీ కూడా స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక సిద్ధాంతాలకు గట్టి మద్దతుదారు. అ సిద్ధాంతాల వెలుగులోనే తన పాలనలో వరుసగా తొమ్మిది శాతం జిడిపి సాధించడాన్ని ‘ఇండియా వెలిగిపోతోంది’, ‘అంతా బాగుంది’ లాంటి నినాదాలతో అభివర్ణిస్తూ 2004 లో దేశ ప్రజలు ఆ పార్టీకి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వెలిగిపోతోంది దేశం కాదనీ, దేశంలో ఉన్న కొద్ది మంది ధనికులు మాత్రమే వెలిగిపోతున్నారనీ, బి.జె.పి చెప్పినట్లు అంతా ఏమీ బాగో లేదనీ ప్రజలు ఎన్.డి.ఎ ని ఓడించడం ద్వారా తెలియజెప్పారు.

దానితో బి.జె.పి పాఠం నేర్చుకుంది. ప్రజలకు ఏమి చేప్పాలో తాము ఏమి చేయాలో పాఠాలు నేర్చుకుంది. ప్రజలకు కావలసిన పాపులిస్టు నినాదాలు ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ లాగా తాను చేయదలుచుకున్న మార్కెట్ సిద్ధాంతాల అమలు కొనసాగించాలని నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అప్పటినుండీ ప్రతిపక్ష బి.జె.పి పాపులిస్టు నినాదాలను అందుకుంది. పాపులిస్టు కాంగ్రెస్ ను మించిన నినాదాలతో పోటీపడుతోంది. స్వయంగా స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక సిద్ధాంతాల మద్దతుదారు అయినప్పటికీ ప్రజలకు మాత్రం పాపులిస్టు నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టింది. అధికారంలో ఉన్నపుడు వందశాతం ఎఫ్.డి.ఐ లు రిటైల్ రంగంలో అనుమతించాలని చెప్పిన బి.జె.పి ఇప్పుడు దానివల్ల ప్రజలకు, ఉపాధికి నష్టమని చెబుతోంది.

మరోపక్క పశ్చిమ వార్తా సంస్ధలు ‘రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించే నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న గొడవని వివిధ పద్ధతుల్లో నిరసిస్తోంది. ప్రతిపక్షాల వ్యతిరేకతను అర్ధలేనిధిగా చూపడానికి ప్రయత్నిస్తోంది. ఆ గొడవను చూసి పాలక పక్షం తన నిర్ణయంపై వెనక్కి పోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ, వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి తగిన సూచనలు చేస్తోంది. రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల ప్రవేశం వల్ల నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి ఊపందుకుంటుందని ఆశ చూపిస్తోంది. ఉపాధి పెరుగుతుందని తమ భారతీయ పాఠకులకు ఎక్కించడానికి శతధా ప్రయత్నిస్తోంది. ఆర్ధిక వృద్ధి పట్టాలెక్కాలంటే రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల అనుమతి నిర్ణయం బాగా దోహదపడుతుందని అదే పనిగా రొద పెడుతోంది. ఆర్ధిక వృద్ధి దేశంలో ధనికులకే తప్ప ఎనభై శాతం ఉన్న పేదలకు ఉపయోగపడడం లేదన్న సత్యాన్ని దాచి పెడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది.

“రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించడం వల్ల అనేక సమస్యలు తీరుతాయనీ, ద్రవ్యోల్బణం తగ్గుతుందనీ, ధరలు తగ్గుతాయనీ, నిరుద్యోగం తగ్గుతుందనీ చెబుతూ రిటైల్ ప్రవేటీకరణపై సానుకూల దృక్పధం ఏర్పడడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చెబుతున్నవారంతా, ఎఫ్.డి.ఐ లవలన మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నవారంతా దేశాన్ని ఫూల్ చేస్తున్నారు. అది జరిగేపని కాదు” అని అద్వాని పేర్కొన్నాడు. “అతి పెద్ద సెక్షన్ కి చెందిన ప్రజానీకం పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో కారణం అంతుబట్టడం లేదు” అని అద్వానీ అన్నాడు.

పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏలుతున్న యు.పి.ఎ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ (పద్దెనిమిది సీట్లు), మరొక భాగస్వామ్య పార్టీ డి.ఎం.కె (పద్దెనిమిది సీట్లు) లు ఎఫ్.డి.ఐ ల అనుమతిని వ్యతిరేకిస్తున్నాయి. అత్యధిక సంఖ్యలో చిన్న వర్తకులు, మధ్య తరగా వ్యాపారులు ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉండడంతో ఈ పార్టీలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే “ప్రభుత్వాన్ని పడగొట్టలేను. అలాగని రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల ప్రవేశాన్ని అనుమతించలేను” అని త్రిణమూల్ నాయకురాలు మమత శుక్రవారం పేర్కొంది. మన్మోహన్ రాయబారంతో డి.ఎం.కె మెత్తబడ్డట్టు తెలుస్తోంది. ఓటింగ్ జరిగితే మద్దతు ఇవ్వాలని మన్మోహన్ తమ మిత్ర పక్షాలని సిద్ధమ్ చేసే పనిలో పడ్డాడు.

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల అనుమతి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రధాని మన్మోహన్ తిరస్కరిస్తున్నాడు. తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా నేరుగా ప్రజల చేత ఎన్నికకాలేని మన్మోహన్ ప్రధాన మంత్రి పదవి వెలగబెట్టడమే దేశానికి ప్రారబ్దం కాగా ఆయన సారధ్యంలో ప్రజా వ్యతిరేక నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తుండడం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న అతి పెద్ద మోసాలలో ఒకటి.

దేశీయ ఆంగ్లపత్రికలు సైతం విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ప్రచార యుద్ధాన్ని చేస్తున్నాయి. మోసపూరితమైన పశ్చిమ పత్రికల వాదనలను నెత్తిన ఎత్తుకుని ఎఫ్.డి.ఐ లు కావాలని ప్రచారం చేస్తున్నాయి. “స్ధానిక రిటైలర్లు ‘కొద్ది బుద్ధి’ తో ఆలోచిస్తూ, ఏమీ చేయడం లేదు. వారి మైండ్ సెట్ మార్చుకుని ఎఫ్.డి.ఐ లను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది” అని ఎకనమిక్ టైమ్స్ పత్రిక సంపాదకీయం రాసింది. ముందు ఈ పశ్చిమ ఆలోచనా పరులు విదేశీ బుద్దులతో ఆలోచించడం మాని భారత దేశ ప్రజల కోసం ఆలోచించాల్సిన అగత్యం ఇప్పుడు అత్యవసరంగా ముందుకొచ్చింది. విదేశీ కంపెనీలకు అనుకూలంగా సిద్ధాంతాలు వల్లించే తమ ‘పశ్చిమ మైండ్ సెట్’ ను ఇవి తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

వ్యాఖ్యానించండి