రూపాయి పతనం కాకుండా ఆర్.బి.ఐ చర్యలు తీసుకుంటుంది -ఆర్.బి.ఐ


ప్రభుత్వం, ఆర్.బి.ఐ లు రూపాయి పతనం పట్ల తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకోవడానికి ఆర్.బి.ఐ చేయవలసిందేదీ లేదనీ, ఆ అవసరం లేదని ఆర్.బి.ఐ ఇన్నాళ్లూ చెబుతో వచ్చింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆర్.బి.ఐ జోక్యం వల్ల రూపాయి పతనం ఆగిపోయే అవకాశాలు లేవని చెబుతూ వచ్చాడు. శనివారం ఆర్.బి.ఐ స్వరం మారింది. రూపాయి విలువ ను స్ధిరంగా ఉంచడానికి అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యుటీ గవర్నర్ శుక్రవారం చెప్పాడు.

దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ సౌకర్యవంతమైన స్ధాయిలలో ఉండేలా ఆర్.బి.ఐ చర్యలు తీసుకుంటుందని కూడ ఆర్.బి.ఐ డిప్యుటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్ చెప్పాడు. 2011 సంవత్సరంలో రూపాయి విలువ ఇప్పటివరకూ 16.5 శాతం పడిపోయింది. ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించడంతో ఎఫ్.ఐ.ఐ లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులు ఇండియా నుండి ఉపసంహరించుకున్నారు. ఈ సంవత్సరంలో ఇతర ఎమర్జింగ్ మార్కెట్ దేశాలన్నింటిలోనూ ఇండియాలోనే షేర్ మార్కెట్లు ఎక్కువగా పతనం అయ్యాయి.

అధిక ద్రవ్యోల్బణం, నెమ్మదిస్తున్న ఆర్ధిక వృద్ధి, వాణిజ్య లోటు పెరుగుదల సమస్యలుగా భారత ఆర్ధిక పండితులముందు ప్రత్యక్షమయ్యాయి. ఈ సమస్యల మూలం దేశం బయట చూస్తున్న ప్రభుత్వం వాటి పరిష్కారం కూడా బైటనుండే రావాలని ఎదురు చూస్తోంది. దానిలో భాగంగానే రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే ప్రజావ్యతిరేక చర్యలను చేపట్టడానికి సైతం వెనకాడడం లేదు.

“మార్కెట్లలో విదేశీ మారక ద్రవ్యం సరఫరా పెంచడానికి మనవద్ద అనేక సాధనాలు ఉన్నాయి. తగిన సామర్ధ్యం ఉంది. సమీప భవిష్యత్తులో పతన దిశ తీవ్రంగా ఉన్నట్లయితే తగిన విధంగా జోక్యం చేసుకుంటాము” అని డిప్యుటి గవర్నర్ చెప్పాడు. నవంబర్ లో రూపాయి 6.7 శాతం పడిపోయింది. జనవరి 1995 తర్వాత రూపాయి విలువ ఒకే నెలలో ఈ స్ధాయిలో పతనం కావడం ఇదే ప్రధమం.

వ్యాఖ్యానించండి