రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని కేంద్రం సస్పెండ్ చేసింది -మమత


రిటైల్ రంగంలో ‘విదేశీ పెట్టుబడుల’ నిర్ణయం శనివారం అనూహ్యంగా మలుపు తిరిగింది. సూపర్ మార్కెట్లలో 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు ఆ విషయం తెలిపినట్లుగా మమతా బెనర్జీ విలేఖరులకు తెలిపింది.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఇప్పటివరకూ ఎటువంటి చర్చా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజూ కార్యక్రమాలను అడ్డుకోవడంతో ప్రతిరోజూ లోక్ సభ, రాజ్య సభ సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పరిచినప్పటికీ ప్రతిపక్షాలు లొంగి రాలేదు. “సూపర్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొండి, పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనివ్వండి” అన్నదే ప్రతిపక్షాలు నినాదంగా పాలక పక్షానికి వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపధ్యంలో అనివార్యంగా రిటైల్ రంగంలో విదేశీ కంపెనీల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం  ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు భావించవచ్చు.

కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనతో మాట్లాడాడనీ, ఆయన చెప్పినమేరకే తాను ఈ విషయం వెల్లడిస్తున్నాననీ మమత విలేఖరులకి చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. “ఇది తాత్కాలిక నిర్ణయం కాదు. ఏకాభిప్రాయం వచ్చే వరకూ, ఏకాభిప్రాయం వస్తే తప్ప… అప్పటివరకూ ఈ అంశం సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రణబ్ దా చెప్పారు” అని మమత వెల్లడించింది.

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల అనుమతి నిర్ణయాన్ని త్రిణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంలో సహకరించవలసిందిగా త్రిణమూల్ నాయకురాలు మమత ను ప్రధాని మన్మోహన్ రెండు రోజుల క్రితం కోరాడు. ‘ప్రభుత్వాన్ని పడగొట్టడం మాకు ఇష్టం లేదు. కాని ఎఫ్.డి.ఐ నిర్ణయాన్ని మాత్రం సమర్ధించం’ అని ప్రధానికి చెప్పినట్లుగా మమత తెలిపింది. “ప్రణబ్ దా మా అభిప్రాయాన్ని కోరారు. త్రిణమూల్ కాంగ్రెస్ తన నిర్ణయానికి కట్టుబడి ఉందని ఆయనకు చెప్పాను. ఏకాభిప్రాయం వచ్చే వరకూ నిర్ణయాన్ని సస్పెండ్ అయింది అని ఆయన చెప్పారు” అని మమత వివరించింది. మమత బెనర్జీ తల్లి అనారోగ్యంతో ఉండడంతొ ఆమెను సందర్శించడానికి ప్రణబ్ ముఖర్జీ కోల్ కతా వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది తప్ప రద్దు చేయలేదు. ఏకాభిప్రాయం వచ్చేవరకూ సస్పెండ్ చేస్తున్నట్లు మాత్రమే ప్రణబ్ చెప్పినట్లు మమత తెలిపింది. అంటే ఏకాభిప్రాయం సాధించి కేంద్ర ప్రభుత్వం తన కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేసే ఉద్దేశ్యంలో ఉంది. మురళీ మనోహర్ జోషి చెప్పినట్లు అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల రిటైల్ కంపెనీల లాబీల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. ఆ లాబీలను వదిలించుకోవడం ప్రభుత్వ పెద్దలకు కూడా ఇష్టం లేదు. కాకపోతే ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పార్టీలకు తగిన వాటా లభించిన తక్షణమే ఏకాభిప్రాయం దానంతట అదే సిద్ధిస్తుంది.

వ్యాఖ్యానించండి