ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం వెలిబుచ్చిన విషయాన్ని కిర్బీ గుర్తు చేశాడు. సైనికుల మరణానికి దారి తీసిన పరిస్ధితులపైన విచారణ జరుపుతున్నామని కిర్బీ మరోసారి తెలిపాడు.
“ఇప్పటికిప్పుడే తప్పుని ఏ ఒక్కరిపైనా మోపడమే మేము చేయడం లేదు. విచారణ జరుగుతోంది. ఆ విచారణను జరగనివ్వాలి. వాస్తవాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. ఈ విచారణలో భాగస్వామ్యం తీసుకోవాలని పాకిస్ధాన్ ను మేము ఇప్పటికీ ఆహ్వానిస్తున్నాము” అని కిర్బీ తెలిపాడు. “అది మిలట్రీ ఆపరేషనే (మిలట్రీ ఎంగేజ్‌మెంట్)” అని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది.
“అది మిలట్రీ ఎంగేజ్‌మెంట్. నిజానికి, సరిహద్దుల మీదుగా జరిగిన కాల్పుల్లో చనిపోయింది రెండు డజన్ల పాకిస్ధానీ సైనికులు. అమాయక గ్రామీణులో లేదా పౌరులో కాదు. అది ఎలా సంభవించిందన్న వివరాలలోకి నేను వెళ్ళడం లేదు. అదే మేము ఇప్పుడు విచారణ లో చేస్తున్నది”
అని జాన్ కిర్బీ తెలిపాడు. ఇక్కడ అమెరికా అధికారి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. తాము కాల్పులు జరిపించి పాకిస్ధాన్ సైనికులే తప్ప గ్రామీణులో, పౌరులో (గ్రామీణులు పౌరులు ఎందుకు కాదో కిర్బీ యే వివరించవలసి ఉంది) కాదని ఆయన చెబుతున్నాడు. అంటే సైనికులే గనక చనిపోయినా పెద్ద వార్త కానవసరం లేదని పరోక్షంగా కిర్బీ చెబుతున్నాడని భావించవచ్చు. తాము జరిపింది మిలట్రీ ఆపరేషనే గనుక, చనిపోయింది సైనికులే గనక జరిగిందానిలో పెద్ద తప్పులేదన్నట్లుగా కిర్బీ సూచిస్తున్నాడు.
పాక్ సైనికుల మరణానంతరం ఘటనపైన అమెరికా సెంట్రల్ కమాండ్ విచారణకు ఆదేశించింది. ఉన్నతాధికారి నాయకత్వంలో జరిగే ఈ విచారణలో పాల్గొనవలసిందిగా ఆఫ్ఘనిస్ధాన్ పాకిస్ధాన్ ప్రభుత్వాలను కూడా అమెరికా ఆహ్వానించింది. ఆఫ్ఘనిస్ధాన్ లొని ‘అంతర్జాతీయ సహాయ భద్రతా బలగాలు’ (ఐ.ఎస్.ఎ.ఫ్) కూడా విచారణలో భాగం పంచుకుంటోందని తెలుస్తోంది. ఈ విచారణ కమిటీ డిసెంబరు 23 న నివేదిక సమర్పించవలసి ఉంది.
“పాక్ తో సంబంధాలు అమెరికాకి ఇప్పటికీ చాలా ముఖ్యమే. అనేక అంశాలలో, టెర్రరిజం వ్యతిరేక పోరాటంతో సహా, పాక్ సహకారం మాకు అవసరం. గత కొద్ది నెలలుగా సంబంధాలలొ ఎదురైన ఆటంకాలు మాకు తెలుసు. కాని పాకిస్ధాన్ తో కలిసి పని చేయడానికి గట్టి కృషి చేయబోతున్నాము. తద్వారా తాజా ఆటంకాన్ని కూడా అధిగమిస్తాము” అని రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ జార్జి లిటిల్ అన్నాడు. పాక్ మూసేసిన సప్లై మార్గాలను తిరిగి తెరిపించడానికి ప్రయత్నిస్తున్నామని కూడా ఆయన తెలిపాడు.
కిర్బీ మాటలే ఒక సూచిక అయినట్లయితే, అమెరికా జరిపే విచారణలో నెపం పాకిస్ధాన్ సైనికులపై మోపే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్ధాన్ తో సంబంధాలు మెరుగుదల కోసం అటువంటి నెపం మోపకుండా జాగ్రత్తవహించే అవకాశాలు కూడా లేకపోలేదు. కాని ఇప్పటివరకూ అమెరికా, పాకిస్ధాన్ సంబంధాలలో అమెరికా వైపు మొగ్గుతూ వచ్చిన త్రాసు, తాజా ఘటనతో ఒక్కసారిగా పాకిస్ధాన్ మిలట్రీ వైపు మొగ్గు చూపడం గమనార్హం.