పాకిస్ధాన్ ప్రతినిధులు ఓ.కె అన్నాకే అమెరికా దాడి చేసింది -వాల్‌స్ట్రీట్ జర్నల్


ఇరవై నాలుగు మంది పాకిస్ధానీ సైనికులు చనిపోవడానికి కారణమైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్ల దాడిని ‘ఉమ్మడి కమాండ్ సెంటర్’ లోని పాకిస్ధాన్ ప్రతినిధులు ఆమోదించిన తర్వాతే చేశామని అమెరికా కమేండర్లు చెప్పినట్లుగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తెలిపింది. కమాండ్ సెంటర్ లో ఉన్న పాకిస్ధాని ప్రతినిధులకు దాడి జరిగే చోట పాకిస్ధాన్ తాత్కాలిక పోస్టు నెలకొల్పిందని తెలియకపోవడంతో వారు దాడికి పచ్చ జెండా ఊపారని అమెరికా కమేండోలు తెలిపారు. అయితే కాల్పులు ప్రారంభం అయ్యాక అక్కడ తమ సైనికులున్నారనీ, కాల్పులు ఆపాలనీ పాకిస్ధాన్ కోరినా ఎందుకు ఆపలేదన్న ప్రశ్నకు వారినుండి సమాధానం లేదు. కొద్ది సేపు ఆపి మళ్లీ కాల్పులు ప్రారంభించి గంటకు పైగా దాడి జరిపి పాక్ సైన్యాన్ని చంపవలసిన అవసరం ఎందుకు వచ్చిందో వివరణ అందలేదు.

నవంబరు 26 న ఆఫ్ఘన్, పాకిస్ధాన్ సరిహద్దులో రెండు చెక్ పోస్టుల వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులను అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు దాడి చేసి సైనికులను చంపడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు మరోసారి ఘోరంగా క్షీణించిన సంగతి విదితమే. దాడికి ప్రతీకారంగా పాకిస్ధాన్ ఆఫ్ఘనిస్ధాన్ లోని నాటో బలగాలకు తమ భూభాగం ద్వారా జరితే సరఫరాలను నిలిపివేసింది. అమెరికా మానవరహిత విమానాలను ప్రయోగించేందుకు ఉపయోగిస్తున్న తమ షష్మీ వైమానిక స్ధావరాన్ని వెంటనే ఖాళీ చేయాలని కోరింది. జర్మనీ నగరం బాన్ లో ఆఫ్ఘనిస్ధాన్ పై జరగనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్సు కు గైర్హాజరు కావడానికి కూడా పాకిస్ధాన్ నిర్ణయించింది. ఆఫ్ఘన్ యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరులో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు.

పాకిస్ధాన్ సైనికుల హత్య తర్వాత ఆ ఘటనపై అమెరికా వివరణ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది కూడా ఆ సంఘటనలో పాల్గొన్న కమేండోలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా తెలిసిన విషయాలేననీ పూర్తి వివరాలు విచారణ పురోగతి సాధించే కొద్దీ వెల్లడి అయ్యే అవకాశాలున్నాయనీ అమెరికా సైనికాధికారులు తెలిపినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అమెరికా అధికారుల వివరణ ప్రకారం ఓ కేంపు నుండి కాల్పులు రావడంతో అమెరికా కమేండోలు హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లనుండి సహాయం అడిగారు. సంబంధిత బృందం ‘జాయింట్ బోర్డర్-కంట్రోల్ సెంటర్’ ను సంప్రదించి దాడి కోరుతున్న ప్రాంతంలో పాకిస్ధాన్ సైన్యం ఉన్నదీ లేనిదీ చెప్పవలసిందిగా కోరారు. జాయింట్ బోర్డర్-కంట్రోల్ సెంటర్ లో అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. అయితే అమెరికన్ కమెండోలు తాము తాలిబాన్ పైన దాడికి వెళ్తున్నట్లుగా బోర్డర్-కంట్రోల్ సెంటర్ కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు.

బోర్డర్-కంట్రోల్ సెంటర్ ను కమెండోలు సమాచారం అడిగినపుడు అక్కడ ఉన్న పాకిస్ధాన్ ప్రతినిధులు దాడికి వెళ్తున్న చోట పాకిస్ధాన్ సైన్యం లేదని సమాచారం ఇచ్చారు. దానితో వైమానిక దాడులకు అనుమతి దొరికినట్లు భావించి దాడి చేసినట్లుగా అమెరికా కమెండోలు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అమెరికా జరిగిన సంఘటనను ‘భాధాకరమైన ప్రమాదం’ గా అభివర్ణిస్తూ తన సానుభూతిని తెలిపింది కాని క్షమాపణ కోరలేదు. క్షమాపణ చెప్పడానికి అమెరికా నిరాకరించింది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ బలగాలు ఆపరేషన్లకు వెళ్లేటపుడు పాకిస్ధానీలకు సమాచారం ఇవ్వకుండానే వెళ్లడం రోజువారీగా జరుగుతుంది. పాకిస్ధానీ కమేండర్లకు తెలిస్తే ఆ సమాచారం తాలిబాన్ కి చేరుతుందని అనుమానించడం వల్లనే వారు పాకిస్ధానీలకు సమాచారం ఇవ్వరు. కాని తమ అనుమానాలకు అమెరికా ఇంతవరకూ ఎటువంటి సాక్ష్యాలనూ ఇవ్వలేదని పాకిస్ధాన్ చెబుతోంది. కేవలం అనుమానాలతో పాకిస్ధాన్ ను నిందించడం తగదని పాకిస్ధాన్ గీపెట్టినా అమెరికా పట్టించుకోకుండా అదొక పనిగా పాక్ పైన ఆరోపణలు చేస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమం లో అణ్వస్త్రాలు తయారవుతున్నాయని ఇంతవరకు ఎటువంటి సాక్ష్యాలు చూపకపోయినా అమెరికా, యూరప్ లు ఇరాన్ అణుబాంబు తయారు చేస్తున్నదన్న అనుమానంతో ఐదు సార్లు వాణిజ్య ఆంక్షలు విధించాయి.

“అనేక తప్పులు జరుగుతుంటాయి” అని అమెరికా అధికారి చెప్పినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆ తప్పుల్లో భాగంగా పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోయినా అమెరికా పైన ఎవరూ ఎటువంటి ఆరోపణలూ చేయకూడదన్నమాట! అదే అమెరికా సైనికుడు ఒక్కడు చనిపోయినా అది ప్రపంచ వార్త అయి తీరుతుంది. ఆ మరణానికి ప్రపంచం అంతా కొన్ని నెలలపాటు ఏడుస్తూ గడపాలి. సో కాల్డ్ టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలో అమెరికా సైనికుల ప్రాణాలకు ఉండే విలువ పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ సైనికుల ప్రాణాలకు ఉండదు. అది అమెరికా, యూరప్ ల నాయకత్వంలోని ప్రపంచాధిపత్య వ్యవస్ధ పాటిస్తున్న తెల్ల తోలు ధర్మం.

వ్యాఖ్యానించండి