డాలరుతో 26 పైసలు పెరిగిన రూపాయి విలువ


స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా లాభాల బాట పట్టడంతో ఆ మేరకు రూపాయి విలువ కూడా కోలుకుంటోంది. శుక్రవారం రూపాయి విలువ డాలరు విలువతో పోలిస్తే 26 పైసలు పెరిగి రు.52.20/21 కు చేరుకుంది. ఇది గత రెండు వారాలలో అత్యధిక స్ధాయి కావడం గమనార్హం.

ఎగుమతిదారులు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు డాలర్ల అమ్మకం చేపట్టడంతో రూపాయి విలువ పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు లాభాలు సంపాదిస్తుండడం కూడా రూపాయి విలువ కోలుకోవడానికి దారి తీసింది.

అయితే ఊర్ధ్వ పయనం కొనసాగడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాక్ మార్కెట్ లాభాలు తాత్కాలిక పరిణామమేనని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. బి.ఎస్.ఇ సెన్సెక్స్ ఇంకా పతనమై 14000 పాయింట్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని గురువారం కొంతమంది విశ్లేషకులు భావించారు. వచ్చే సంవత్సరం సెన్సెక్స్ మరింత పతనమైన మరింత బలహీన స్ధాయిని నమోదు చేయవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

విదేశీ సంస్ధాగత పెట్టుబడిదారులు (ఎఫ్.ఐ.ఐ) నవంబరు 30, డిసెంబరు 1 తేదీలలోనే 201.97 మిలియన్ డాలర్ల పెట్టుబడులను దేశంలోకి తెచ్చినట్లుగా సెబి రికార్డులు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు రూపాయి విలువను డాలరుకు రు.51.3523 గా నిర్ణయించింది. యూరోకు రు.69.1380 గా నిర్ణయించింది. జపాన్ యెన్ విలువతో పోల్చినా రూపాయి విలువ పెరిగినట్లుగా తెలుస్తోంది.

గత కొన్ని వారాలుగా రూపాయి విలువ పడిపోతూ వస్తోంది. డాలరుకు 45 రూపాయిలుగా ఉన్న రూపాయి విలువ శుక్రవారం నాటికి 51.3523 స్ధాయికి పడిపోయింది. ఎఫ్.ఐ.ఐ లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ప్రపంచ ఆర్ధిక పరిస్ధుతులు రూపాయి విలువ పతనానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది. రూపాయి పతనానికి దేశీయ కారణాలని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

వ్యాఖ్యానించండి