ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రిటైల్ రంగంలోకి వంద శాతం పెట్టుబడుల రావాలని ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వం అప్పటినుండి అనేక చర్చోప చర్చలు సాగించి కేవలం 51 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రిటైల్ రంగంలోకి అనుమతించాలని ఖుర్షీద్ తెలిపాడు.
“రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయం తీసుకునే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటినుండీ అనేక విధాలుగా ఈ విషయమై సమాలోచనలు చేశాం. ఎన్.డి.ఎ వందశాతం ఎఫ్.డి.ఐలు కావాలంది. మేము దాన్ని 51 శాతానికి తగ్గించాం” అని సల్మాన్ ఖుర్షీద్ విలేఖరులకు తెలిపాడు.
“ఎవరో ఒకరు అరిచాడనీ, కేకలు వేశాడనీ కారణంగా చూపి ఈ అంశంపై మరొకసారి ఆలోచించాలని చెప్పడం సరైంది కాదు. రెండువైపులా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం” అని ఖుర్షీద్ తెలిపాడు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్ తో పార్లమెంటు లో గొడవ చేస్తుండడంతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఎనిమిది రోజులైనా ఇంతవరకు ఎటువంటి చర్చా జరగలేదు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల వ్యవసాయదారులతో పాటు వినియోగదారులు కూడా నష్టపోతారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా ప్రధాని మన్మోహన్ దగ్గర్నుండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వరకూ తమ నిర్ణయం వారికే ఉపయోగమని ఊదరగొడుతున్నారు. ప్రధాని ఆర్ధిక సలహా బృందం నాయకుడు కౌశిక్ బసు అయితే విదేశీ పెట్టుబడులు రాకపోతే పేదలు అధిక ధరలు పెట్టీ సరుకులు కొనవలసి ఉంటుందని సెలవిచ్చాడు. ఇన్నాళ్లూ దేశంలోకి విదేశీ పెట్టుబడులు రాలేదు. మరి ఇన్నాళ్లూ అధిక ధరలకు మరేవో కారణాలు చెబుతూ వచ్చారు తప్ప విదేశీ పెట్టుబడులు రాకపోవడం వల్లనే అని ఇంతవరకూ ఈ పెద్ద మనిషి చెప్పలేదు.
BJP అధికారంలో లేనప్పుడు మాత్రమే ఆర్థిక సంస్కరణలకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు జరిపేవి సామ్రాజ్యవాద అనుకూల సంస్కరణలే.
NDAఅధికారంలో ఉన్నప్పుడు అలా చేసి ఉంటే తప్పే .ఒకరినొకరు ఆడిపోసుకొని పాయింట్లు స్కోర్ చెయ్యడం కాదు.ఈ FDIమన చిన్న వ్యాపారులకు నష్టం కాబట్టి దాన్ని ఉపసమ్హరించుకోవాలి.