నరేంద్ర మోడికి మరో లెంపకాయ, ‘ఇష్రాత్ జహాన్’ బూటకపు ఎన్‌కౌంటర్ పై సిబిఐ విచారణ


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కి వరుసగా లెంపకాయలు తగులుతూనే ఉన్నాయి. అయనకు లెంపకాయలు ఇచ్చినవాళ్ళలో తాజాగా గుజరాత్ హై కోర్టు చేరింది. ‘ఇష్రాత్ జహాన్’ తో పాటు ఆమె ముగ్గురు మిత్రులను బూటకపు ఎన్‌కౌంటర్ లో చంపిన నేరంపైన సి.బి.ఐ విచారణకు గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి బాధితుల్లో విశ్వాసం పాదుకొల్పడంలో విఫలమైనందున సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా హై కోర్టు పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (సిట్) ను తాజాగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయాల్సిందిగా కూడా హై కోర్టు ఆదేశించింది.

జస్టిస్ జయంత్ పటేల్, అభిలాష్ కుమారి లతో కూడిన డివిజన్ బెంచి ఈ ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధిపతి ఆర్.ఆర్.వర్మను తాజాగా ఎఫ్.ఐ.ఆర్ ను రెండు వారాల్లోగా దాఖలు చేసి కేసును సి.బి.ఐ కి బదలాయించాలని ఆదేశించింది. జాతీయ స్ధాయిలో ప్రభావం చూపనున్నందున కేసును ప్రత్యేకమైందిగా పరిగణించాలని డివిజన్ బెంచి ఆదేశించింది.

2004 లో బాధితులను చంపిన అనంతరం, వారు లష్కర్ ఎ తొయిబా టెర్రరిస్టులనీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ని చంపడానికి వాళ్ళు వెళ్తున్నారని గుజరాత్ పోలీసులు చేసిన ఆరోపణలపైన కూడా సి.బి.ఐ విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది. కేసు సున్నితమైందిగా పేర్కొంటూ, గుజరాత్ పోలీసులకు గానీ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (ఎన్.ఐ.ఎ) కి గానీ, సిట్ కు గానీ దానిని అప్పగించడానికి నిరాకరిస్తూ సి.బి.ఐ కి అప్పగించాలని బెంచి కోరింది. దానికి కోర్టు పన్నెండు కారణాలను చూపింది.

“కేసును విచారించే సంస్ధ విశ్వాసాన్ని పాదుకొల్పాలి. బాధితుల్లో ఆ సంస్ధ పట్ల విశ్వసనీయత ఉండాలి. కనుక గుజరాత్ పోలీసులకు కేసును అప్పగించకూడదని కోర్టు భావిస్తోంది” అని బెంచి పేర్కొంది. సిట్ సభ్యుల్లో బేధాభిప్రాయాలు తలెత్తడం, మెజారిటీ సభ్యులు విచారణను కొనసాగించడానికి సుముఖంగా లేకపోవడం వల్ల సిట్ కి కేసు బాధ్యతలను అప్పగించడానికి కూడా బెంచి నిరాకరించింది. ఎన్.ఐ.ఎ జ్యూరిస్‌డిక్షన్, సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకున్నపుడు దానికి విచారణ అప్పగించకపోవడమే మేలని బెంచి అభిప్రాయపడింది. ఎన్.ఐ.ఎ చేపట్టగల పరిధి పరిమితమైనందున కూడా దానికి కెసు అప్పగించరాదని బెంచి నిర్ణయించింది.

వ్యాఖ్యానించండి