రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత ఆర్ధిక వృద్ధి


2011-12 ఆర్ధిక సంవత్సరంలో రెండో క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు 2011) లో భారత ఆర్ధిక వృద్ధి గత రెండేళ్లలో అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయింది. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో విస్తరించిన కాలంలో భారత ఆర్ధిక వ్యవస్ధ కేవలం 6.9 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుదల, సంక్షోభంలో ఉన్న ప్రపంచ కేపిటల్ మార్కెట్లు అన్నీ కలిసి భారత ఆర్ధిక వృద్ధిని కిందికి నెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జిడిపి వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే తక్కువ నమోదు కావడం వరుసగా ఇది మూడోసారి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ఆర్ధిక వ్యవస్ధ తొమ్మిది శాతం వృద్ధి చెందుతుందని ప్రభుత్వం ప్రారంభంలో అంచనా వేయగా వాస్తవం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.

రెండో క్వార్టర్లో మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి ఘోరంగా 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇక మైనింగ్ రంగం తీసుకుంటె వృద్ధి చెందడానికి బదులు 2.9 శాతం కుచించుకు పోయింది. రానున్న క్వార్టర్లలో కూడా ఆర్ధిక వృద్ధి ఇంతకంటె మెరుగ్గా ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ లు మాత్రం మిగిలిన రెండు క్వార్టర్లలో ఆర్ధిక వృద్ధి బాగా పుంజుకుంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ రకమైన భరోసాలు ఇవ్వడం, అవి నెరవేరక ఆనక లెక తప్పామని లెంపలేసుకోవడం వీరికి మామూలే. అంతర్జాతీయ విశ్లేషకుల్లో కూడా భారత పాలకులు హామీలను ఉల్లంఘించడంలో లబ్ద ప్రతిష్టులన్న పేరును సంపాదించుకున్నారు.

సంవత్సరం పొడుగునా ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం అది పది శాతానికి దగ్గరగా ఉంది. ప్రపంచ స్ధాయిలో అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, యూరప్ రుణ సంక్షోభం ల వలన ఎగుమతులు క్షీణించడం కూడా భారత ఆర్ధిక వృద్ధిపై ప్రభావం చూపింది. ఈ కారణాలతో భారత దేశం నుండి విదేశీ వ్యవస్ధాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారత దేశం నుండి ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువ బలహీనడడం కూడా ఆర్ధిక వృద్ధి పై ప్రతికూల ప్రభావం కలిగించింది. రానున్న ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లు సమీక్షించకపోయినా ఇతర మార్గాల్లో ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

పెట్టుబడిదారులు లేదా మదుపుదారులు భారత రిటైల్ రంగాన్ని ప్రవేటీకరించాలనీ, విదేశీ స్వదేశీ ప్రవేటు పరిశ్రమలకు భూ సేకరణ సులభ తరంగా మార్చాలనీ కోరుతున్నారు. కానీ ఇవి రెండు చర్యలూ పక్కా ప్రజా వ్యతిరేక చర్యలు కావడం గమనార్హం. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల ఆ రంగంపై ఆధారపడి బతుకుతున్న నాలుగు కోట్ల కుంటుంబాలు ఉపాధి కోల్పోవలసి ఉంటుంది. కుటుంబానికి పరిమిత కుటుంబం నలుగురని లెక్కించినా మొత్తం పదహారు కోట్ల మంది జనాభా జీవనాధారం కోల్పోవలసి ఉంటుంది. వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెప్పిన ప్రకారం కోటి ఉద్యోగాలు వచ్చినా అవి నాలుగు కోట్ల కుటుంబాల ఉపాధిని పోగొట్టి వారి స్ధానంలో కోటి ఉద్యోగాలను సృష్టిస్తుందని భావించవలసి ఉంటుంది.

ఆ విధంగా చూసినా నికరంగా మూడు కోట్ల కుటుంబాలు ఉపాధిని కోల్పోతాయి. అదీ కాక ఈ రంగంపై ఆధారపడి ఉన్న కుటుంబాలు తమ పచారీ వ్యాపారాన్ని వంశపారంపర్యంగా కొనసాగిస్తాయి. కనుక ఆ కుటుంబాల నుండి కొత్తగా నిరుద్యోగులు తయారయ్యే అవకాశం తక్కువ. అదే విదేశీ బడా రిటైల్ కంపెనీల్లో తాత్కాలిక లేదా పార్ట్ టైం ఉద్యోగాలు తప్ప స్ధిరమైన ఉపాధి కల్పిస్తారా అన్నది అనుమానమే. పైగా పని పరిస్ధితులు, కార్మిక చట్టాలు అవి అమలు చేసే అవసరం లేకుండా విదేశీ కంపెనీలకు అనేక మినహాయింపులు ఇవ్వడం భారత పాలకులకు అత్యంత ఇష్టమైన పని. భూసేకరణ సులభ తరంగా మార్చడం అంటే ప్రజల అభ్యంతరాలు పట్టించుకోకుండా వారిపైన నిర్బంధం ప్రయోగించి వారి వ్యతిరేకతను పట్టించుకోకుండా భూములు లాక్కొని ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడానికి పధక రచన చేస్తున్నారని అనుమానించవలసి వస్తున్నది.

బహుశా ఈ ఉద్దేశ్యంతోనే కాబోలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన సమస్యలు రెండో అర్ధ భాగంలో పరిష్కారం అవుతాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భావిస్తున్నాడు. భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ సంవత్సరాంతానికల్లా బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం కాకుండా 5.5 శాతం వరకూ ఉంటుందని ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ సంగతిని అహ్లూవాలియా కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నాడు. అంతర్జాతీయ పరిస్ధితులే భారత వృద్ధిని కిందికి నెడుతున్నాయని ఆర్ధిక మంత్రి ప్రణబ్ చెప్పేస్తున్నాడు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 7.3 శాతం కంటె ఎక్కువ ఆర్ధిక వృద్ధి నమోదు కాకపోవచ్చని ఆయన నిర్ధారించాడు. ఇది ప్రారంభంలో లక్ష్యంగా పెట్టుకున్న 9 శాతం తో పోలిస్తే బాగా తక్కువ.

వ్యాఖ్యానించండి