మా చెక్‌పోస్టులపై దాడి చేస్తున్నామని అమెరికాకి ముందే తెలుసు -పాక్ మిలట్రీ


ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్ధాన్ చెక్ పోస్టులపైనే తాము దాడి చేస్తున్నామన్న సంగతి అమెరికా హెలికాప్టర్లకూ, జెట్ ఫైటర్లకూ ముందే తెలుసనీ, తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారనీ పాకిస్ధాన్ మిలట్రీ వ్యాఖ్యానించింది. పాకిస్ధాన్ మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ ఈ మేరకు పత్రికలకు వివరాలు వెల్లడించాడు. అమెరికా హెలికాప్టర్లు పాకిస్ధానీ చెక్ పోస్టులపై దాడి చేస్తున్నారని అమెరికా బలగాలను అప్రమత్తం చేసినప్పటికీ కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపాడు. పత్రికా సంపాదకుల సమావేశంలో ఇష్ఫక్ నదీమ్ దాడి గురించిన వివరాలు వెల్లడించాడు.

“పాకిస్ధాన్ చెక్ పోస్టులు గోల్డెన్, వోల్కనో లకు సంబంధించిన పూర్తి వివరాలు ఐ.ఎస్.ఎ.ఎఫ్ (ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ – నాటో, ఐ.ఎస్.ఎ.ఎఫ్ అంటూ ఎన్ని పేర్లు చెప్పినా అంతిమ పరిశీలనలో అవన్నీ అమెరికా మిలట్రీయేనని గమనించాలి) వద్ద అప్పటికే ఉన్నాయి. చిత్రపటాలలో (మ్యాప్) సైతం ఎక్కడ ఉన్నదీ వారికి సమాచారం ఉంది. వారు దాడి చేస్తున్నది పాక్ చెక్ పోస్టులు అని వారికి తెలియకుండా అసంభవం” అని నదీమ్ చెప్పాడు.

నాటో బ్యానర్ కింద ఉన్న అమెరికా బలగాలు హెలికాప్టర్లలోనూ, జెట్ ఫైటర్లలోనూ వచ్చి ఆఫ్-పాక్ సరిహద్దుకు సమీపంలో గల పాక్ చెక్ పోస్టులపైన శనివారం తెల్లవారు ఝామున దాడులు చేసిన సంగతి విదితమే. పాకిస్ధాన్ భూభాగం నుండి తమపైకి కాల్పులు వచ్చాయని దానితో ‘సమీప వైమానిక మద్దతు’ ను అమెరికా-ఆఫ్ఘన్ సంయుక్త బలగాలు కోరాయనీ, అందువల్లనే హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు దాడి చేసాయనీ అమెరికా చెబుతోంది. వారిపై దాడి జరిగితే సాక్ష్యాలేవి? గాయపడ్డ వారేరి? అని పాకిస్ధాన్ ప్రశ్నిస్తోంది.

నదీమ్ చెప్పిందాని ప్రకారం:

అమెరికా హెలికాప్టర్లు పాక్ చెక్ పోస్టుకి సమీపంలో స్ధానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత కనిపించాయి. అప్పుడే అవి కాల్పులు ప్రారంభించాయి. ముప్పావు గంటసేపు కాల్పులు జరిపి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఒకటింపావు ప్రాంతంలో మళ్ళీ వచ్చాయి. ఈసారి అవి గంటకు పైగా కాల్పులు సాగించాయి. మొదటి దాడి జరిగిన కొన్ని నిమిషాల ముందు ఆఫ్ఘనిస్ధాన్ లో గల కమ్యూనికేషన్స్ సెంటర్ లో డ్యూటీలో ఉన్న అమెరికా సార్జెంట్, పాకిస్ధాన్ పోస్టులకు పదిహేను కి.మీ దూరంలో ఉన్న చోటు నుండి నాటో ప్రత్యేక దళాలపైకి కాల్పులు జరుగుతున్నాయని పాకిస్ధాని మేజర్ కి తెలిపాడు. పాకిస్ధానీ మేజర్ సంబంధిత చోటుని చెక్ చేసుకోవడానికి కొంత సమయం కావాలని కోరుతూ దాని కో-ఆర్డినేట్స్ సమాచారం అడిగాడు. ఏడు నిమిషాల తర్వాత అమెరికా సార్జంట్ మళ్లీ పిలిచి “మీ వోల్కనో పోస్టు దాడికి గురైంది” అని చెప్పాడు. ఆ మాటలతో తాము పాకిస్ధాన్ పోస్టులపైన దాడి చేస్తున్న సంగతి నాటోకు తెలుసనని స్పష్టమవుతున్నట్లుగా నదీమ్ నిర్ధారించుకున్నాడు.

జర్మనీ నగరం బాన్ లో ఆఫ్ఘనిస్ధాన్ సమస్యపై త్వరలో జరగనున్న అంతర్జాతీయ సమావేశానికి హాజరు కారాదని పాకిస్ధాన్ నిర్ణయించుకుంది. “మిగతా ప్రపంచానికి వ్యతిరేకంగా పని చేయాలని పాకిస్ధాన్ ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. కానీ ఇతర ప్రపంచం పాకిస్ధాన్ ని ఒక మూలకు నెట్టేసినట్లయితే, ఎర్ర గీతలను ఉల్లంఘించినట్లయితే, వారు భాగస్వామ్యానికి సంబంధించిన ప్రాధమిక పునాదినే తిరస్కరించినట్లుగా అర్ధం చేసుకోవాలి” అని పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ, డాన్ పత్రికతో మాట్లాడుతూ పేర్కొన్నది. హినా రబ్బానీ ఇక్కడ ‘మిగతా ప్రపంచం’ అనడానికి బదులు ‘అమెరికా’ అని గానీ లేదా ‘నాటో’ అని గానీ లేదా ‘ఐ.ఎస్.ఎ.ఎఫ్’ అనిగానీ చెప్పవలసి ఉంది. మిగతా ప్రపంచం అనడం ద్వారా పాకిస్ధాన్ ఒక్కటే ఒకవైపు, మిగిలిన ప్రపంచం అంతా మరొకవైపు నిలబడి పోరాడుతున్నట్లుగా అర్ధం ధ్వనిస్తోంది. ఇటువంటి పదజాలం పాకిస్ధాన్ అహాన్ని సంతృప్తిపరచవచ్చేమో గానీ, పాకిస్ధాన్ వాదనను ఇతర దేశాలు అంగీకరించడానికి ఉపయోగపడదు.

వ్యాఖ్యానించండి