అమెరికా కండకావరం: కాల్పులు ఆపమని విజ్ఞప్తి చేసినా పట్టించుకోని వైనం


ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికాకి సహకరిస్తున్నందుకు పాకిస్ధాన్ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సంవత్సరం క్రితం అమెరికా హలికాప్టర్ల కాల్పుల్లో ఇద్దరు సైనికులను నష్టపోయిన పాకిస్ధాన్, గత శనివారం అమెరికా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ విమానాలు జరిపిన దాడిలో చెక్ పోస్టు వద్ద కాపలా ఉన్న 28 మంది సైనికులను (24 మంది అని ‘ది హిందూ‘, ‘ఫస్ట్ పోస్ట్‘ పత్రికలూ, 25 మంది అని ‘ది గార్డియన్‘ పత్రికా చెబుతున్నాయి) కోల్పోయిన సంగతి విదితమే. అమెరికా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు కాల్పులు ప్రారంభించాక పాకిస్ధాన్ ప్రభుత్వం, అక్కడ ఉన్నది తమ సైనికులనీ, కాల్పులు ఆపాలని కోరినప్పటికీ, అహంకారంతో జ్ఞానేంద్రియాలన్నీ మూసుకుపోయిన అమెరికా పట్టించుకోలేదనీ, ఆ తర్వాత కూడా రెండు గంటల పాటు కాల్పులు కొనసాగించి తమ సైన్యాన్ని పొట్టన బెట్టుకుందనీ పాకిస్ధాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపాడు.

సరిహద్దులో ఉన్న పరిస్ధితుల దృష్ట్యా, అమెరికా నాటోల బలగాలూ, పాకిస్ధాన్ బలగాల మధ్య అయోమయం ఏర్పడకుండా ఉండడానికీ, ఇరువురి మధ్యా ఫ్రెండ్లీ ఫైర్ జరగకుండా ఉండడానికి ఒక హాట్ లైన్ ఏర్పరుచుకున్నారు. దీని ద్వారా అమెరికా హెలికాప్టర్లను, ఫైటర్ జెట్లనూ కాల్పులు ఆపవలసిందిగా పాకిస్ధాన్ ఆర్మీ కమేండర్లు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ అమెరికా పట్టించుకోలేదని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అధర్ అబ్బాస్ తెలిపాడు. సరిహద్దులో ఉన్న రెండు పోస్టుల వద్ద ఉన్న పాకిస్ధాన్ జవాన్లు అమెరికా కండకావరానికి బలయ్యారు. తమది కాని యుద్ధం చేస్తున్న పాకిస్ధాన్ సైనికులు తాము సాయం చేస్తున్న అమెరికా దుర్మార్గానికే బలవడం ఇది కొత్త కాదు, చివరిది కూడా కాబోదు.

పాకిస్ధాన్ భూభాగంలో గుళ్ళు, బాంబుల వర్షం కురుస్తుండగానే పాకిస్ధాన్ కమేండర్లు నాటో అధికారులతో సంప్రదించారనీ, కాల్పులు ఆపాల్సిందిగా కోరారనీ, వారి విజ్ఞప్తులను పట్టించుకోని నాటో బలగాలు తమ విధ్వంసాన్ని కొనాసాగించారని అబ్బాస్ తెలిపాడు. పాక్, ఆఫ్గన్ ల మధ్య ఉన్న డ్యూరండ్ సరిహద్దు అసమగ్రంగా ఉందనీ, సరైన సరిహద్దు రేఖను గుర్తించలేదనీ, ఆ ప్రాంతం అంతా గుట్టలతో నిండి ఉన్నందున శత్రువులెవరో, మితృలెవరో గుర్తించడం కష్టమనీ పలు అబద్ధాలు వల్లించిన అమెరికా, పాకిస్ధాన్ తాజా సమాచారం వెల్లడించి రోజు గడిచినప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ఈ విధంగా అమెరికా, సరిహద్దులు అతిక్రమించి పక్క దేశాల్లోకి చొరబడి మరీ విధ్వంసం జరిపిన ఉదాహరణలు యుగొస్లోవియాలో కూడా రికార్డు అయి ఉండడం గమనార్హం. 

మొహ్మంద్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు మిలట్రీ పోస్టులను “వోల్కనొ”, “గోల్డెన్” అని పిలుస్తారని అబ్బాస్ వివరించాడు. ఇవి రెండు కొండల వరుస పై భాగంలో ఉన్నాయని తెలిపాడు. ఈ సరిహద్దు పోస్టులు సరిగ్గా ఏ ప్రాంతంలో ఉన్నదీ నాటోకు సమచారం ఇచ్చామనీ అయినా ఆ ప్రాంతం పైనా కాల్పుల వర్షం కురిపించారని అబ్బాస్ తెలిపాడు. పైగా ఈ ప్రాంతం నుండి ఇటీవలే మిలిటెంట్లను పారద్రోలామని కూడా నాటో కు సమాచారం ఉందని ఆయన తెలిపాడు. ఇన్ని వివరాలను దగ్గరుంచుకున్నప్పటికీ అమెరికా, నాటో బలగాలు పాక్ సైన్యాన్ని చంపడానికే సిద్ధపడ్డారంటే పాకిస్ధాన్ సార్వభౌమత్వం పైన అమెరికాకి ఎంత గౌరవం ఉన్నదో పాక్ ప్రజలు అర్ధం చేసుకోవాలి.

నిజానికి ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా జరుపుతున్న దురాక్రమణ యుద్ధాన్ని పాకిస్ధాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా పాకిస్ధాన్ ఆర్మీ, ప్రభుత్వం అంతా అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు నటించక తప్పని పరిస్ధితి పాక్ లో నెలకొని ఉంది. ప్రజల కోసం అమెరికా వ్యతిరేకత నటిస్తూ, అమెరికా ఇచ్చే కమిషన్ల కోసం ఆఫ్ఘన్ యుద్ధానికి పాక్ ప్రభుత్వం, సైన్యం ఇరువురూ మద్దతు ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో పాక్ ప్రభుత్వం, మిలట్రీల మధ్య సంబంధాలు దెబ్బతిన్న పరిస్ధితుల్లో తాజాగా అమెరికా చేసిన దాడి ఇరువురినీ ఐక్యం చేసిందని చెప్పవచ్చు. పాకిస్ధాన్ ప్రజల్లో అమెరికా పట్ల ఉన్న వ్యతిరేకతను, పాక్ ప్రభుత్వం, సైన్యం అమెరికాతో మరిన్ని నిధుల కోసం బేరమాడడానికి వినియోగిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అమెరికా, యూరప్ దేశాల కు సేవచేశే మూడో ప్రపంచ దేశాల పాలకులందరూ ఇటువంటి ‘దళారీ’ కార్యకలాపాల ద్వారానే మనుగడ సాగిస్తారన్నది బహిరంగ రహస్యం.

వ్యాఖ్యానించండి