పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం


ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దు వద్ద రెండు చెక్ పోస్టుల వద్ద మొహరించి ఉన్న పాక్ సైనికులను 28 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు చంపినందుకు నిరసనగా జర్మనీ లోని బాన్ నగరంలో జరగనున్న ఆఫ్ఘనిస్ధాన్ కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదని పాకిస్ధాన్ నిర్ణయించింది. కాన్ఫరెన్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించి కీలక పాత్ర పొషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరీ లో ఆఫ్ఘనిస్ధాన్ పై కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్ధాన్ సహాయం లేనట్లయితే ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా, నాటోల సైన్యం ఉనికి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని అందరికీ తెలిసిన విషయమే.

లాహోరులో మంగళవారం ప్రధాని గిలాని అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో, డిసెంబరు 5 న బాన్ లో జరగనున్న ఆఫ్ఘన్ కాన్ఫరెన్స్ కు హాజారు కారాదని నిర్ణయించారు. అమెరికా కండకావరంతో చేసిన దాడిలో పాక్ సైనికులు దుర్మరణం పాలయ్యాక డిఫెన్స్ కమిటీ సమావేశమై తీసుకున్న పలు నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. 1. ఆఫ్ఘనిస్ధాన్ లోని నాటో, అమెరికా బలగాలకు ఆయుధ, ఆహార సరఫరా చేసే అన్ని మార్గాలనూ మూసివేయడం, 2. షమ్షి వైమానిక స్ధావరాన్ని పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయాలని అమెరికాని డిమాండ్ చేయడం, 3. ఆఫ్ఘనిస్ధాన్ లో యుద్ధం చేస్తున్న నాటో, అమెరికా బలగాలకు సహకారం అందించే విషయంపై పూర్తిగా సమీక్ష జరపడం. ఈ నిర్ణయాలను పాకిస్ధాన్ కేబినెట్ ఆమోదించింది.

షమ్షి వైమానిక స్ధావరం లో అమెరికాకి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు నడుస్తున్నాయి. డ్రోన్ విమానాలను నడపడం అందులో ముఖ్యమైనది. మానవ రహిత విమానాలలో మనుషులు లేనప్పటికీ అది నడవడానికి స్ధావరం నుండి వందకు పైగా సిబ్బంది పని చేయాల్సి ఉంటుందని అమెరికా మిలట్రీ అధికారులు చెబుతుంటారు. అటువంటి కార్యకలాపాలను షమ్షీ విమాన స్ధావరం నుండే నడస్తున్నాయని భావిస్తున్నారు. డ్రోన్ విమానాలను పూర్తిగా సి.ఐ.ఎ ఆధ్వర్యంలో నడుస్తాయి. విమానాలు ఎక్కడ దాడి చేయాలన్న విషయం నిర్ణయానికి ముందు నెలల తరబడి ఇంటలిజెన్స్ సమాచారాన్ని సీ.ఐ.ఎ గూఢచారులు సేకరిస్తారు. ఆ సమాచారం ఆధారంగానే డ్రొన్ దాడులు జరుపుతారు. స్ధావరంలో కూర్చుని రిమోట్ కంట్రోల్ మిషనరీ సహాయంతో డ్రోన్ విమానాలతో బాంబు దాడులు చేస్తారు. అటువంటి స్ధావరాన్ని అమెరికా ఖాళీ చేయవలసి రావడం అమెరికాకి గట్టి దెబ్బే అవుతుంది.

సి.ఐ.ఎ గూఢచారి రేమండ్ డేవిస్ గత జనవరిలో ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపాక సి.ఐ.ఎ గూఢచారుల్లో మూడింట్ రెండొంతుల మందిని దేశం విడిచి వెళ్లాలని పాకిస్ధాన్ మిలట్రీ డిమాండ్ చేసి అది సాధించేదాక విశ్రమించలేదు. దాదాపు నూట యాభై మంది సి.ఐ.ఏ గూఢచారులు పాకిస్ధాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అందులో వందమందికి పైగా అమెరికాకి తిప్పి పంపేశారు. ఈ నిర్ణయం అమలు కాకుండా ఉండడానికి అమెరికా ప్రభుత్వం, మిలట్రీలు శాయశక్తులా ప్రయత్నించినా పాక్ మిలట్రీ లొంగలేదు. అప్పటినుండే పాకిస్ధాన్ పైన అమెరికా ద్వేషం పెంచుకుంటూ వచ్చింది. పాక్ పై అమెరికా కోపానికి అసలు కారణం ఇదే. కాగా పశ్చిమ దేశాల పత్రికలు మాత్రం ఒసామా బిన్ లాడెన్ పాకిస్ధాన్ లో రక్షణ తీసుకున్నాడని తేలినందునే పాక్ కీ, అమెరికాకీ చెడిందని రాస్తుంటాయి. లాడెన్ ఉదంతం కారణమని చెబితే అది పాకిస్ధాన్ నేరంగా ధ్వనిస్తుంది. కాని సి.ఐ.ఎ గూఢచారులను తిప్పి పంపినందుకే సంబంధాలు చెడ్డాయని చెప్పుకుంటే అది అమెరికా పరువుకు భంగం. అందుకనే ఆ విషయంలో కూడా పశ్చిమ పత్రికలు అబద్ధాలు రాస్తుంటాయి. ఆ అబద్ధాలనే భారతీయ ఆంగ్ల పత్రికలు కూడా పొల్లు పోకుండా ప్రచారం చేస్తాయి.

సి.ఐ.ఎ గూఢచారులు వెళ్లిపోవడం వల్ల పాకిస్ధాన్ సైన్యానికి వారు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఆగిపోయింది. ఈ కార్యక్రమం పైన అమెరికా చాలా ఆశలు పెట్టుకుని ఉండడంతో పాక్ చర్య అమెరికాకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అప్పుటి నుండీ సంబంధాలు మెరుగు కోసమ్ ఇరు పక్షాలు మెల్లగా ప్రయత్నిస్తూ వచ్చారు. లాడెన్ హత్య తర్వాత పాక్ లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేజిక్కించుకోవడానికి మిలట్రీ ప్రయత్నిస్తున్నదంటూ అధ్యక్షుడు జర్దారీ అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు లేఖ రాస్తూ, దానిని నివారించడానికి అమెరికా సాయం చేయాలని కోరాడని వెల్లడయ్యాక మళ్ళీ పాక్, అమెరికాల సంబంధాలు క్షీణించాయి. పాకిస్ధాన్ లో సైతం పౌర ప్రభుత్వం, మిలట్రీ మధ్య విభేధాలు రగిలాయి. ఈ నేపధ్యంలో జరిగిన అమెరికా దాడి పాకిస్ధాన్ పౌర ప్రభుత్వం, మిలట్రీ లు మళ్ళీ ఒక్కటి అయ్యే అవకాశం లభించిందని భావించవచ్చు.

అంతేకాదు. ఇపుడు అమెరికా నుండి మరిన్ని నిధులు గుంజడానికి పాకిస్ధాన్ ప్రభుత్వ పెద్దలకు, మిలట్రీ పెద్దలకూ మంచి అవకాశం చేజిక్కింది. పాకిస్ధాన్ పెద్దలు కోరింది దక్కి సంబంధాలు మెరుగుపడ్డప్పటికీ అవి పూర్వ స్ధాయికి చేరుకుంటాయా లేదా అన్నది అనుమానమే. పాకిస్ధాన్ సైనికుల చావు పాకిస్ధాన్ ప్రజల సెంటిమెంట్లను బాగా దెబ్బకొట్టంది. ఏ దేశంలోనైనా అటువంటి పరిస్ధితుల్లో అది సహజమే. కనుక ప్రజల సెంటిమెంట్లలకు అనుగుణంగా పాక్, అమెరికా సంబంధాలు ఏదో ఒక దశ మేరకు శాశ్వతంగా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత మూడు సంవత్సరాలలో నాటో బలగాల దాడుల్లో మొత్తం 72 మంది పాకిస్ధాన్ సైనికులు చనిపోయారని పాకిస్ధాన్ మిలట్రీ అధికారులు చెప్పారు. తాజా దాడి జరిగాక అమెరికా-పాక్ సంబంధాలు ఇక ఎప్పటిలాగా కొనసాగడం అసంభవం అని పాక్ ప్రధాని గిలానీ చెప్పాడు కూడా. ప్రతి ఒక్కరికీ జీవితం విలువైనదేననీ, పాకిస్ధాన్ ప్రజలు గౌరవంతో, మర్యాదతో బ్రతకాలని కోరుకుంటున్నారనీ కెబినెట్ కి ప్రధాని చెపినట్లుగా ఛానెళ్ళు చెబుతున్నాయి. “ఇప్పటి కఠిన సమయంలో భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడంలో పాక్ ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటారు” అని గిలాని చెప్పాడని ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. నాటో దాడుల విషయం చర్చించడానికి పార్లమెంటులో ఉభయ సభల సంయుక్త సమావేశానికి పిలుపిస్తానని గిలాని చెప్పాడు. పాక్ అధ్యక్షుడు జర్దారీ, అమెరికా మిలట్రీకి రాసినట్లుగా చెప్పబడుతున్న రహస్య లేఖ విషయం కూడా సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. రెండు సంఘటనలపైన నియమించిన పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించాక సంయుక్త సమావేశం ఉంటుందని గిలాని చెప్పినట్లు తెలుస్తోంది.

One thought on “పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s