పాకిస్ధాన్ గగన తలం లోకి మరోసారి జొరబడడమే కాకుండా, తాలిబాన్ పై పోరాడుతున్న 28 మంది పాక్ సైనికుల్ని అమెరికా హెలికాప్టర్లు చంపేయడంపైన పాకిస్ధాన్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీలు ప్రతీకార చర్యలను ముమ్మరం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో పాక్ ఇస్తూ వచ్చిన సహకారం తగ్గించే వైపుగా పాక్ మిలట్రీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాక్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది.
శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు ఆఫ్ఘన్ సరిహద్దు సమీపాన ముహ్మంద్ గిరిజన ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టు పైన అమెరికా హెలికాప్టర్లు దాడి చేసి 28 పాక్ సైనికుల్ని పొట్టన బెట్టుకున్న సంగతి విదితమే. దాడిలో మరో 13 మంది గాయపడ్డారనీ, చనిపోయినవారిలో ఇద్దరు ఉన్నత సైనికాధికారులు ఉన్నారనీ పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంఘటన పట్ల నాటో గానీ, అమెరికా గానీ పూర్తి వివరాలు ఇవ్వడానికి ఇంతవరకూ ముందుకు రాలేదు. అమెరికా, పొడి మాటలతో ‘సారీ’ చెప్పి ఊరుకుంది. సంఘటనపై విచారణ జరుపుతున్నామని మొక్కుబడి ప్రకటన చేసింది.
ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా, నాటో సైనిక బలగాలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించే చర్యలతో పాటు పాక్ ప్రభుత్వం, మిలట్రీలు మరిన్ని ప్రతీకార చర్యలు చేపట్టారు. తన ‘షమ్సి విమాన స్ధావరం’ నుండి పదిహేను రోజుల్లో ఖాళీ చేయాలని అమెరికాను పాకిస్ధాన్ కోరింది. దాడికి తక్షణ ప్రతిస్పందనగా పాకిస్ధాన్ తన భూభాగం ద్వారా ఆఫ్ఘన్ లోని అమెరికా, నాటో బలగాలకు ఆహారాలు, ఆయుధాలు సరఫరా అయ్యే అన్ని రూట్లను మూసివేసింది. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా నేతృత్వంలోని కూటమి దేశాల బలగాలతో పాకిస్ధాన్ ఏర్పాటు చేసుకున్న సహకార ఒప్పందాలన్నింటినీ పునఃసమీక్షించాలని కూడా పాకిస్ధాన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
శనివారం ఉదయానికే ఆహార సరఫరాలను, ఇంధన సరఫరాలను పాకిస్ధాన్ ఆపేసింది. నాటో, అమెరికాలతో తన నిరసనను పాక్ ప్రభుత్వం తెలియజేసింది. పాక్ ప్రభుత్వం కేబినెట్ లోని డిఫెన్స్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచింది. ‘హెచ్చరికలు లేని దాడి పట్ల ఎలా స్పందించాలన్న దానిపై సమావేశం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. పాకిస్ధాన్ సౌర్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ పాక్ గగలతలంలోకి అమెరికా హెలికాప్టర్లు జొరబడ్డాయని పాక్ ప్రభుత్వమ్ అభివర్ణించింది.
పాక్ ప్రధాని సూచనల మేరకు పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్, అమెరికా రాయబారి కామెరాన్ ముంటర్ ను పిలిపించుకుని పాక్ ప్రభుత్వ నిరసనను తెలియ జేశాడు. అమెరికా దాడి పాక్ ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేసినట్లుగా అమెరికా రాయబారికి తెలిపామనీ, పాక్ చెక్ పోస్టు పై దాడి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపామనీ పాక్ ప్రతినిధులు తెలిపారు. ఈ దాడి పాకిస్ధాన్ – అమెరికా/నాటో/ఐ.ఎస్.ఎ.ఎఫ్ ల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించామనీ వారు తెలిపారు.
నాటో కేంద్ర కార్యాలయం ఉన్న బెల్జియం రాజధాని బ్రసెల్స్ వద్దా, అమెరికా రాజధాని వాషింగ్టన్ లోనూ పాకిస్ధాన్ తన నిరసనను రికార్డు చేసింది. ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందే పాకిస్ధాన్ సర్వసైన్యాధ్యక్షుడు అష్రఫ్ పర్వేజ్ కయాని, ఐ.ఎస్.ఎ.ఎఫ్ ఛీఫ్ జాన్ అల్లెన్ తొ కలిసి చర్చలు జరపడం గమనార్హం. పాక్ తో సమన్వయంపైన ఈ చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇరు పక్షాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి తదితర అంశాలపైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అవే అంశాలపైన నీలి నీడలు కమ్మే రీతిలో అమెరికా దాడి జరగడం విశేషం.
పాకిస్ధాన్ సైనికులు తమకు అందుబాటులో ఉన్న ఆయుధాలతో అమెరికా దాడికి ప్రతిస్పందించారని కయాని ప్రకటించాడు. ఈ ‘బాధ్యతారహిత’ చర్యకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకోవాలని బలగాలను కోరినట్లుగా ఆయన తెలిపాడు. ఆ చర్యలు ఏవిటన్నదీ కయాని వివరించలేదని “ది హిందూ’ తెలిపింది.