సిరియా అద్దె విప్లవకారులకు ఫ్రాన్సు మిలట్రీ ట్రైనింగ్


సిరియా నుండి పారిపోయి వచ్చిన అద్దె విప్లవకారులకి ఫ్రాన్సు ప్రభుత్వం రహస్యంగా మిలట్రీ ట్రైనింగ్ అందించనున్నట్లుగా ఫ్రాన్సు కి చెందిన వార పత్రిక “లె కెనార్డ్ ఎన్‌షైన్” వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ఫ్రాన్సు ఏజెంట్లు ప్రస్తుతం లెబనాన్, టర్కీలలో తిష్ట వేసుకుని ఉన్నారు. “‘సిరియా స్వేచ్ఛా సైన్యం’ నిర్మాణానికి ప్రారంభ సైనిక బలగాలను నిర్మించడం” ఆ ఏజెంట్ల ముఖ్య లక్ష్యం. లిబియాలో సోకాల్డ్ తిరుగుబాటు ప్రారంభం కాకముందే అక్కడి తిరుగుబాటుదారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నట్లుగానే సిరియా తిరుగుబాటు దారులకు టర్కీ, లెబనాన్ లలో ఫ్రాన్సు గూఢచారులు శిక్షణ ఇస్తారన్నమాట!

‘లె కెనార్డ్ ఎన్‌షైన్’ పత్రిక నవంబరు 23 నాటి సంచిక ఈ రహస్యాన్ని వెల్లడించింది. ఉత్తర లెబనాన్ లోనూ, టర్కీ లోనూ సిరియా నుండి పారిపోయీ వచ్చిన బషర్ వ్యతిరేకులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. సదరు వార పత్రిక ఈ విధంగా తెలిపింది.

“ఫ్రాన్సుకి చెందిన ‘జనరల్ డైరెక్టోరేట్ ఫర్ ఎక్స్‌టర్నల్ సెక్యూరిటీ’ (డి.జి.ఎస్.ఇ), స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (సి.ఒ.ఎస్) సంస్ధలకు చెందిన అనేకమంది ‘కోవర్టు చర్యల విభాగానికి’ చెందిన వారు (ఇతర దేశాల్లో తమకు నచ్చని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోవర్టు ఆపరేషన్లను నిర్వహించడానికి శిక్షణ ఇవ్వడమే వీరి పని) ఇప్పటికే టర్కీలో ఉన్నారు. తమకు ఆదేశాలు అందిన వెంటనే వీరు సిరియానుండి పారిపోయి వచ్చినవారికి ‘అర్బన్ గెరిల్లా యుద్ధ తంత్రం’ లో శిక్షణ ఇస్తారు”

ఫ్రాన్సు ప్రభుత్వానికి చెందిన ‘డైరెక్టరేట్ ఆఫ్ మిలటరీ ఇంటలిజెన్స్’ లోని ఉన్నత స్ధాయి అధికారిని ఉటంకిస్తూ లె కెనార్డ్ పత్రిక ఇలా పేర్కొంది.

“బషర్ కి వ్యతిరేకంగా పరోక్ష యుద్ధమా (ప్రాక్సీ వార్)? ఇది లిబియాలో జరిగినదాన్ని సిరియాలో పునరావృతం చేయడానికి సంబంధించిన విషయం కాదు. కాని ఫ్రాన్సు, బ్రిటన్ లు మాత్రమే సిరియా తిరుగుబాటుదారులతో మొట్టమొదట సంబంధాలను సంపాదించగలిగాయి” 

అంటే సిరియాకు సంబంధించినంతవరకూ గూఢచర్య కార్యకలాపాలకూ, సిరియాలో కోవర్టు ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి తమకే ముందు అవకాశం వచ్చిందని ఫ్రాన్సు అధికారి చెప్పదలుచుకున్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికాతో యూరోపియన్ యూనియన్ పోటీ పడుతున్నదన్న సంగతి గుర్తు చేసుకుంటే ఫ్రాన్సు అధికారి మాటల అంతరార్ధం అవగతం కాగలదు.

‘లె కెనార్డ్’ వార పత్రిక ప్రకారం ఇది “నాటో రూపొందించిన పరిమిత జోక్యం మాత్రమే.” ఫ్రాన్సు, బ్రిటన్ ల నేతృత్వంలో రూపొందించిన సిరియా తిరుగుబాటు కార్యక్రమంలో ఈ క్రింది అంశాలు ప్రధానంగా ఉన్నాయని పత్రిక తెలిపింది. అవి:

  • పౌర, మిలట్రీ తిరుగుబాట్లకు మద్దతు ఇవ్వడం
  • ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం
  • సిరియా సరిహద్దుల గుండా ఆయుధాలను స్మగుల్ చెయ్యడం
  • నాటో ద్వారా అమెరికాతో అవసరమైన కాంటాక్టు ఉంచుకోవడం

ఈ అంశాలపైన ఫ్రాన్సు, బ్రిటన్, టర్కీ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ‘లె కెనార్డ్’ పత్రిక పేర్కొన్నది. ఈ అంశాలను పరికించినట్లయితే లిబియా తిరుగుబాటు గుర్తుకు రాక మానదు.

  • లిబియాలో తిరుగుబాటు మొదలైనట్లుగా ఒక్కసారిగా వార్తలు గుప్పించడం, తమ పౌరులపైనే గడ్డాఫీ తన యుద్ధ విమానాల చేత కాల్పులు జరుపుతున్నాడని అబద్ధాలు అదే పనిగా ప్రచారం లో పెట్టడం,
  • ఆ వంకతో లిబియా ప్రభుత్వ విమానాలు ఎగరకుండా అక్కడి గగన తలంపై నిషేధం విధించి నాటో విమానాలను లిబియాలోకి చొప్పించడం,
  • ఐక్య రాజ్య సమితిలో ‘లిబియా పౌరుల రక్షణ’ కోసం అంటూ ‘ఏ చర్యలైనా తీసుకోవడానికి’ అనుమతిస్తూ తీర్మానం ఆమోదించుకోవడం,
  • ఆ తర్వాత విచ్చలవిడిగా తాము రూపొందించుకున్న సూత్రాలను సైతం ఉల్లంఘిస్తూ లిబియాలో పట్టణాలపై బాంబులు కురిపించి సర్వనాశనం చేయడం,
  • అంతిమంగా గడ్డాఫీని చంపేసి తోలు బొమ్మల ప్రభుత్వాన్ని నిలబెట్టడం…

లిబియాలో ప్రజాస్వామ్యం స్ధాపిస్తామని చెప్పిన ఈ పడమటి బందిపోటు దొంగలు ఇప్పుడక్కడ ఆఫ్రికా జాతి నల్లవారిపైన జాతి విద్వేషం చెలరేగుతున్నప్పటికీ పట్టించుకోరు. అక్కడ ప్రభుత్వం ఏ జాతో తెలియదు. అది ప్రజాస్వామిక ప్రభుత్వమా లేక నియంత ప్రభుత్వమా లేక ఆటోక్రట్ ప్రభుత్వమా లేక మత తత్వ ప్రభుత్వమా… అన్నది ఇంతవరకు తెలియదు. అది ఏమైనా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లకు అనవసరం. వారికి కావలసింది ఆయిల్ కాంట్రాక్టులు. అవన్నీ వారికి దక్కాయి. ఇక మిగిలింది లిబియా ప్రజలు. వారేమైపోయినా వారికి అనవసరం.

గడ్డాఫీ నియంతృత్వం పైనా, లిబియా ప్రజల పజాస్వామిక ఆకాంక్షల పైనా తెగ బాధపడిపోయిన మన తెలుగు మిత్రులు ఇపుడు లిబియలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? వీరికి మాత్రం ఎందుకు? పడమటి పత్రికలు, ఛానెళ్ళు ప్రచారం చేస్తున్నంతసేపూ గడ్డాఫీ నియంతృత్వం పట్ల ఆవేశ పడిపోవడమె తప్ప అక్కడ నిజానికి ఏం జరిగిందో, ఏం జరగనున్నదో వాస్తవాల పరిశీలన వీరికి అనవసరం. పత్రికలు అంటించిన నాలుగు ‘ప్రజస్వామిక’ కబుర్లను నాలుకపై ఉంచుకుని అవి కక్కడమే తప్ప లిబియా ప్రజల సంగతి వీరికి మాత్రం ఏ అవసరం?

వ్యాఖ్యానించండి