పాకిస్ధాన్ లోకి జొరబడి 14 మంది పాక్ సైనికుల్ని చంపిన అమెరికా సైన్యం


Nato attackఅమెరికా హెలికాప్టర్లు మరోసారి పాకిస్ధాన్ లోకి జొరబడ్డాయి. అంతటితో ఆగకుండా ఒక మిలట్రీ చెక్ పాయింటు పై దాడి చేసి అక్కడ ఉన్న 14 మంది పాకిస్ధాన్ సైనికుల్ని చంపేశాయి. ఘటనలో మరో నలుగురు గాయపడ్డాఅరు. ఈ మేరకు పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ అధికారులు పత్రికలకు సమాచారం అందించారు. దాడిలో మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారని స్ధానిక వార్తలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. సలాలా చెక్ పాయింట్ గా పిలిచే ఈ మిలట్రీ చెక్ పాయింటు ఆఫ్ఘన్ సరిహద్దుకు ఒకటిన్నర మైళ్ళ దూరంలోనే ఉంది.

వాయవ్య పాకిస్ధాన్ లో గల మొహ్మంద్ అనే గిరిజన ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్ధాన్ మిలట్రీ అధికారులు సంఘటనను ధృవీకరించారు. “ఎటువంటి హెచ్చరికలు లేకుండా నాటో హెలికాప్టర్లు పాకిస్ధాన్ చెక్ పాయింటుపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి. మరణాలు సంభవించాయని తెలుస్తోంది. వివరాలు అందవలసి ఉంది” అని మిలట్రీ ప్రతినిధి చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మొహ్మంద్ లోని బైజై ప్రాంతలో ఉదయం రెండు గంటలకు దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పాకిస్ధాన్ సైన్యాలు తాలిబాన్ పైన యుద్ధం చేస్తున్నాయి.

నాటో నాయకత్వం లోని ‘ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్’ కాబూల్ లో ప్రకటన చేస్తూ ‘ఒక ఘటన’ జరిగిందన్న వార్త విన్నామనీ మరింత సమాచారం సంపాదిస్తున్నామని తెలిపింది. అమెరికా, పాక్ ల మధ్య సంబంధాలు దెబ్బ తిన్న పరిస్ధితుల్లో తాజా ఘటన ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడవలసి ఉంది.

వ్యాఖ్యానించండి