
ఆఫ్ఘనిస్ధాన్ తో గల సరిహద్దుకు సమీపాన చెక్ పాయింట్ వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులు 28 మందిని అమెరికా హెలికాప్టర్ దాడి చేసి చంపడానికి వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు ఆయుధాలు, ఆహారం తన భూభాగం ద్వారా సరఫరా కాకుండా అడ్డుకుంది. అంతమంది సైనికులు తమ దాడిలో చనిపోయినప్పటికీ అమెరికా సైన్యం నుండి ఇంతవరకు సరైన ప్రకటన రాలేదు. “ఎవరైనా చనిపోతే వారికి మా సానుభూతి” అని ప్రకటించారే తప్ప తాము ఎందుకు దాడి చేయవలసి వచ్చిందీ, దాడి చేయడం తప్పా లేదా అన్న విషయాలపైన స్పందించలేదు. అమెరికాతో కయ్యం సరేసరి, నెయ్యం కూడా ఆత్మహత్యాసదృశమేనని పాకిస్ధాన్ పాలకులకు మరోసారి అర్ధం అయి ఉండాలి.
ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న నాటో బలగాలకు జరిగే ఆహార, ఆయుధాల సరఫరాల్లో 49 శాతం పాకిస్ధాన్ భూభాగం గుండానే జరగవలసి ఉంది. ఈ సరఫరాల కోసమే అమెరికా పాకిస్ధాన్ ను మితృడిగా చేసుకుంది. ఈ సరఫరాల కోసమే పాకిస్ధాన్ నుండి సంపూర్ణ మద్దతు అందడం లేదని అనుమానాలు వచ్చినా అమెరికా మళ్ళీ, మళ్లీ పాకిస్ధాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది. అటువంటిది తాజా ఘటనతో పాకిస్ధాన్ అమెరికా, నాటో బలగాలకు సరఫరాలు అందకుండా బంద్ చేసింది.
“నాటో హెలికాప్టర్లు ఎటువంటి కారణం లేకుండానే, విచక్షణ రహితంగా సలాలా చెక్ పోస్టుపై దాడి చేసి నిద్ర పోతున్న 28 మందిని చంపింది. మరో 11 మందిని గాయపరిచింది” అని మిలట్రీ అధికారులు చెప్పారు. చెక్ పోస్టు వద్ద మొత్తం నలభై మంది సైనికులు ఉన్నారనీ అందులో ఇద్దరు సైనికాధికారులనీ వారు తెలిపారు. “ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీ సంఘటనను తీవ్రంగా ఖండించారు” అని ఆయన ప్రతినిధి తెలిపాడు. ఈ అంశాన్ని నాటో, అమెరికాల దృష్టికి తీసుకెళ్ళాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరినట్లుగా ఆ ప్రతినిధి తెలిపాడు.
“సరిహద్దులో జరిగిన సంఘటనలో ఎవరైనా చనిపోయినా, గాయపడినా వారికి, వారి కుటుంబాలకు మా సానుభూతి” అని ఆఫ్ఘనిస్ధాన్ లో నాటో నేతృత్వంలోని ‘ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్’ కమాండర్ జనరల్ జాన్ అల్లెన్ ప్రకటించాడు. అంతకంటే వివరాలు చెప్పడానికి ఆయన ప్రతినిధి నిరాకరించాడని ‘ది గార్డియన్’ తెలిపింది. అయితే ఘటనపైన విచారణ జరుగుతుందని ఆయన చెప్పినట్లుగా పత్రిక తెలిపింది. ఎవరైనా చనిపోయారని గానీ, గాయపడ్డారని గానీ తమకు ఇంకా సమాచారం అందలేదని ఆయన తెలిపాడు.
పెషావర్ పట్టణానికి సమీపాన ఉన్న జామ్రుడ్ పట్టణంలో నాటో సరఫరా వాహనాలనూ, ఇంధన వాహనాలనూ పాక్ ప్రభుత్వం నిలిపివేసింది. పాక్ చెక్ పోస్టు పైన దాడి జరిగిన కొన్ని గంటలలోనే పాక్ ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. “మేము సరఫరాలను నిలిపివేశాము. జామ్రుడ్ లోని చెక్ పోస్టు నుండి నలభై ట్రక్కులు, ట్యాంకర్ల వరకూ వెనక్కి తిప్పి పంపాము” అని సీనియర్ ప్రభుత్వాధికారి ముతాహిర్ జెబ్ తెలిపాడు. భద్రతా కారణాల రీత్యా సరఫరాలు నిలిపేశామని మరొక అధికారి చెప్పినట్లు ‘ది గార్డియన్’ తెలిపింది.
“మా పోస్టు పైన నాటో బలగాలు జరిపిన దాడి వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఎటువంటి కారణాలు లేకుండా వాళ్లు నిద్రపోతున్న మావాళ్ళను చంపేశారు” అని సీనియర్ మిలట్రీ అధికారి చెప్పాడని పత్రిక తెలిపింది. అమెరికా విచక్షణా రహిత దాడి, ఆ వెంటనే పాకిస్ధాన్ ప్రతీకారం జరగడాన్ని బట్టి ఇరు దేశాల మధ్య మరోసారి సంబంధాలు వేడెక్కడం ఖాయమని భావించవచ్చు. పాక్ సైన్యం తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నదన్న అమెరికా ఆరోపణల నేపధ్యంనుండి తాజా అమెరికా దాడిని చూడవచ్చు.